గురు (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఐ.వి. శశి |
---|---|
తారాగణం | కమల్ హాసన్, శ్రీదేవి, సత్యనారాయణ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | శివ శక్తి ఫిల్మ్స్ |
విడుదల తేదీ | జూలై 19, 1980[1] |
భాష | తెలుగు |
గురు ఐ. వి. శశి దర్శకత్వంలో 1980లో విడుదలైన తెలుగు తమిళ ద్విభాషా చిత్రం. ఇందులో కమల్ హాసన్, శ్రీదేవి ముఖ్యపాత్రలు పోషించారు.[2] ఇది జుగ్ను అనే హిందీ చిత్రానికి పునర్నిర్మాణం.
భారతదేశానికి స్వాతంత్ర్యం రాకమునుపు రఘు అనే ఒక జమీందారు కొడుకు విప్లవ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటాడు. అతని తండ్రికి అది నచ్చదు. ఒకసారి అతను పోలీసులను తప్పించుకుని పారిపోతుండగా అతను చనిపోయాడని భావించి అతన్ని గురించి ఆలోచించడం మానేస్తాడు అతని తండ్రి. పది సంవత్సరాల తర్వాత రఘు భార్యను మరొక జమీందారు అత్యాచారం చేయబోగా, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఆమెను కాల్చి చంపుతాడు. ఇది కళ్లారా చూసిన ఆమె కొడుకు ఆ జమీందారును కాల్చి పారిపోతాడు.
కొన్ని సంవత్సరాల తర్వాత అతను అశోక్ అనే పేరుతో పెరిగి పెద్దవాడవుతాడు. అతను తన తల్లి పేరు మీదుగా పార్వతీ నిలయం అనే పేరుతో అనాథ పిల్లల కోసం ఒక ఆశ్రమాన్ని నిర్వహిస్తూ దానధర్మాలు చేసేవాడిగా పేరు తెచ్చుకుంటాడు. నిజానికి అశోక్ పార్వతీ నిలయాన్ని నిర్వహించడం కోసం గురు అనే మారుపేరుతో నేరాలు చేస్తూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతుంటాడు. ఈ విషయం అతని ప్రాణస్నేహితుడు మహేష్ కి తప్ప మరెవ్వరికీ తెలియదు. మరో పక్క అశోక్ తాత రమేష్ అనే అతన్ని తన మనవడిలా పెంచుకుంటూ ఉంటాడు. రమేష్ కూడా నేర కార్యకలాపాలు చేస్తుంటాడు.
అశోక్ సుజాత అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. సుజాత ఒక పైస్థాయి పోలీసు అధికారి మేనకోడలు. అశోక్ ఒకసారి తన గొడవల్లో భాగంగా ఒక గ్యాంగుతో గొడవ పెట్టుకుంటాడు. ఈ గ్యాంగుకు ఒక చెయ్యి మాత్రమే ఉన్నవాడు బాసు. అతని అనుచరుడు రమేష్. అశోక్ కనపడకుండా పోయిన తన తండ్రి రఘును కూడా చూస్తాడు. అతని ఒక ప్రొఫెసరుగా పనిచేస్తుంటాడు. కానీ తన కొడుకు గురించి ఎవరికీ చెప్పడు.
రఘుకు చిన్నప్పుడు తాను చంపింది సుజాత తండ్రిని అని తెలుసుకుని ఆ విషయం చెప్పకుండా సుజాతను దూరం పెడతాడు. దాంతో ఆమె బాధ పడుతుంది. అశోక్ ఏదైనా పెద్ద పనిచేసి పార్వతి నిలయం భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూసి తర్వాత అజ్ఞాతం లోకి వెళ్ళిపోవాలనుకుంటాడు. అతని ప్రయత్నం నెరవేరిందా లేదా అన్నది మిగతా కథ.
ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించాడు.