గూగుల్ లిప్యంతరీకరణ ద్వారా మనకు కావలసిన తెలుగు పదాన్ని ఇంగ్లీషు అక్షరాలతో టైపు చేసి ఖాళీ పట్టి (కీబోర్డు లోని స్పేస్ బార్) నొక్కితే గూగుల్ దాన్ని తెలుగులోకి మారుస్తుంది. టైపు చేస్తూ ఉండగానే ఆ అక్షరాలకు సంబంధించిన తెలుగు పదాలను ఊహించి చూపిస్తుంది.[1] విండోస్, మ్యాక్, యూనిక్స్ లాంటి ఏ కంప్యూటర్ వ్యవస్థలోనైనా గూగుల్ క్రోమ్ విహరిణి (బ్రౌజరు) లో దీన్ని వాడవచ్చు. గూగుల్ క్రోమ్‌బుక్ వాడుకరులకు నేరుగా ఆపరేటింగు వ్యవస్థలోనే ఈ సౌకర్యం ఉంది.
గూగుల్ లిప్యంతరీకరణ తొలిగా 2007 ఆగస్టు 20 న విడుదలైనపుడు 19 భాషలలో పనిచేసేది. [2] ఇది గూగుల్ సైట్లలో (జీమెయిల్, బ్లాగర్ లాంటి) పనిచేస్తుంది. అంతర్జాల సంపర్కములేకుండా (ఆఫ్‌లైన్) వాడాలంటే విండోస్ కంప్యూటర్లలో స్థాపించుకోవటానికి సాఫ్ట్వేర్[3] అందుబాటులో ఉంది. విండోస్, లినక్స్, మాక్ ఒఎస్ లాంటి ఏ నిర్వహణ వ్యవస్థైనా, వాటిలో పనిచేసే విహరిణులు (బ్రౌజర్) (ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్, ఫైర్ఫాక్స్, సఫారి, గూగుల్ క్రోమ్ ) లో తెలుగు టైపు చేయడానికి బుక్ మార్క్ లెట్ [4] ద్వారా వాడుకునే వీలుండేది. అయితే తరువాత భద్రతా కారణాల దృష్ట్యా ఈ సాంకేతిక అంశం పనిచేయడం ఆగిపోయింది. [5]
2019 మార్చి 28 న విడుదలైన క్రోమ్ విహరిణి ఎక్స్టెన్షన్ 52 భాషలకు పనిచేస్తుంది. [6]