చందమామ కథలు | |
---|---|
దర్శకత్వం | ప్రవీణ్ సత్తారు |
రచన | ప్రవీణ్ సత్తారు |
నిర్మాత | చాణక్య భూనేటి |
తారాగణం | కిషోర్ మంచు లక్ష్మి ఆమని నరేష్ కృష్ణుడు చైతన్య కృష్ణ రిచా పనయ్ నాగ శౌర్య |
ఛాయాగ్రహణం | సురేష్ రగుటు |
కూర్పు | ధర్మేంద్ర కాకరాల |
సంగీతం | మిక్కీ జె. మేయర్ |
నిర్మాణ సంస్థ | ఎ వర్కింగ్ డ్రీం ప్రొడక్షన్ |
విడుదల తేదీ | 25 ఏప్రిల్ 2014 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చందమామ కథలు 2014 లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో విడుదలైన ఒక సినిమా.[1] ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది.[2]
ఇది ఒక ప్రయోగాత్మక చిత్రం. దీనిలో ఎనిమిది కథలున్నాయి. ఒక కథ పూర్తయి ఇంకో కథ ప్రారంభమయ్యే సంకలనం లాగాక, సమాంతర ఖండికలుగా వచ్చి పోతూంటాయి.
సారథి (కిషోర్) ఒక రచయిత. అతనికి భార్య ఒక కూతురికి జన్మనిచ్చిన తర్వాత చనిపోయి ఉంటుంది. ఆ పాపకి ఏదో జబ్బు చేస్తుంది. చికిత్స కోసం ఐదు లక్షల రూపాయలు అవసరమౌతుంది. అతను తాను చూసిన జీవితాల నుండి ఏడు కథలు రాయడం మొదలు పెడతాడు.
మొదటి కథలో బాగా లావెక్కిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి వెంకటేశ్వర్రావు (కృష్ణుడు)కి ముప్ఫై దగ్గర పడుతున్నా పెళ్ళి కావడం లేదని బెంగపడి, పెళ్ళికోసం విఫలయత్నాలు చేస్తూంటాడు.
రెండవ కథలో ఒకప్పుడు మోడల్‌గా వెలిగిన లీసా స్మిత్ (మంచు లక్ష్మి) ఇప్పుడు అవకాశాల్లేక, సహజీవనం చేస్తున్న డబ్బున్నవాడు కూడా వేరొకామెని చూసుకోవడంతో, మిడిల్ క్లాస్ ఫ్లాట్‌లో అద్దెకుంటూ తాగుడూ సిగరెట్లు మరిగి టెన్షన్‌తో గడుపుతూంటుంది.
మూడవ కథలో ఓల్డ్ సిటీలో సూపర్ మార్కెట్ నడిపే అష్రఫ్ (అభిజిత్)ని హసీనా (రిచా పనాయ్) ప్రేమలోకి దింపి, పెద్దలతో సంబంధం మాట్లాడమని ఒత్తిడి చేస్తూంటే ఇరకాటంలో పడతాడు అష్రఫ్.
నాలుగవ కథలో ఇంటర్ రెండో సంవత్సరం చదివే రఘు (నాగ శౌర్య) క్లాస్‌మేట్ అయిన రాజకీయనాయకుడి కూతురు రేణు (శామిలీ అగర్వాల్)ని కాదనలేని పరిస్థితుల్లో ఇరికించి, పెళ్ళిచేసుకుని, జీవితంలో సెటిలై పోవాలని పథకాలేస్తూంటాడు.
ఐదవ కథలో పనీపాటా లేని రఘు (కృష్ణ చైతన్య) వూళ్ళో నానమ్మ (పావలా శ్యామల) నిఘాలో వున్న ముగ్గురు మనవరాళ్ళలో గౌరీ (అమితా రావ్) అనే అమ్మాయిమీద మీద కన్నేసి, ముగ్గులోకి దింపాలని కాని పనులు చేస్తూంటాడు.
ఆరవ కథలో భార్యకి విడాకులిచ్చి వచ్చిన ఎన్నారై మోహన్ (నరేష్) అనుకోకుండా మాజీ ప్రేమికురాలు సరిత (ఆమని)ని విధవరాలిగా చూసి, కొడుకులూ కోడళ్ళూ వున్నా ఆమెతో తిరిగి స్నేహం పెంచుకునే ప్రయత్నాల్లో ఉంటాడు.
ఏడవ కథలో ఓ బిచ్చగాడు (కృష్ణేశ్వర్ రావు) పన్నెండు లక్షలు విలువజేసే ఒకింటికి ఎలాగైనా యజమాని కావాలన్న కలలతో బిచ్చ మెత్తుకుంటూ భారీ యెత్తున డబ్బు పోగేస్తూంటాడు.
ఇక చివరి కథ రచయితదే. సగంసగం కథలు రాసుకెళ్ళి ఐదు లక్షలు అర్జెంటుగా అడ్వాన్సు ఇమ్మని అడిగితే, కథలు పూర్తి చేసుకు రమ్మంటాడు ప్రచురణకర్త (సూర్య).
ఇక్కడ్నించీ తన సమస్య మళ్ళీ మొదటికొచ్చి, సగం సగం కథల్ని పూర్తి చేసే శక్తియుక్తుల్ని కూడదీసుకుని కష్టిస్తాడు సారథి. ఓ పక్క కూతురి ఆపరేషన్ దగ్గర పడుతూంటుంది. పూర్తి చేయాల్సిన ఏడు కథల్లోనూ సంఘర్షణలున్నాయి. వాటిలో సగం సుఖాంతాలు, సగం దుఖాంతాలూ ఉన్నాయి. తీరా పూర్తిచేసి ప్రచురణకర్త దగ్గరికి తీసికెళ్తే తన కథే దుఖాంతమయ్యింది! ఇప్పుడేం చేయాలి? ఆపరేషన్ కి డబ్బు ఎలా? సారథి కూతురిని ఎలా కాపాడుకున్నాడనేది మిగతా కథ[3].
ఒకే సినిమాలో రెండు లేక ఎక్కువ కథలను చూపించే ప్రయోగాలు ఈ సినిమా కంటే ముందు చాలా వచ్చాయి. 1939లో తమిళంలో తీసిన సిరిక్కథ భారతదేశంలో తీసిన మొట్టమొదటి బహుళ కథాచిత్రం.1961లో సత్యజిత్ రే బెంగాలీ భాషలో రవీంద్రనాథ్ టాగూర్ కథల ఆధారంగా తీసిన 'తీన్ కన్య' ఈ కోవకు చెందిందే. 1976లో కన్నడ భాషలో 'కథా సంగమ' వచ్చింది. 2007లో అనురాగ్ బసు హిందీలో తీసిన బహుళ కథా చలనచిత్రం ‘లైఫ్ ఇన్ ఏ మెట్రో’, దీనికి ముందు 2003లో రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో ప్రవాళ్ రమణ్ దర్శకత్వం వహించిన ఆరు కథల ‘డర్నా మనా హై’, 2007లో రామ్ గోపాల్ వర్మతో కలుపుకుని ఏడుగురు దర్శకుల ‘డర్నా జరూరీ హై’ అనే ఏడు కథల ఆంథాలజీ, ఆరుగురు దర్శకులతో 'దస్ కహానియా' వచ్చాయి. 2009లో మలయాళంలో పదకొండు మంది దర్శకుల పదకొండు కథల ‘కేరళ కేఫ్’ వచ్చింది. 2009లోనే క్రిష్ దర్శకత్వంలో ఐదు విభిన్న కథల సమాహారంగా వేదం సినిమా వచ్చింది. ఈ సినిమాలన్నీ విజయవంతమయ్యాయి[3].
ఈ సినిమాలోని పాటలను అనంత్ శ్రీరామ్, చిన్నికృష్ణ, రచించగా మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలోని పాటలు:[5]
ఈ సినిమా 62వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమాగా ఎన్నికైంది[6]. ఈ పురస్కారం క్రింద రజత కమలం, లక్షరూపాయల నగదు పురస్కారం, ప్రశంసాపత్రం నిర్మాతకు లభించాయి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నంది పురస్కారాలలో ఈ సినిమాలోని నటనకు గాను మంచు లక్ష్మికి ఉత్తమ సహాయనటి పురస్కారం లభించింది[7].
ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో కూడా మంచు లక్ష్మికి ఉత్తమ సహాయనటి - తెలుగు అవార్డు దక్కింది[8].