చందుబి సరస్సు అస్సాంలోని కామరూప్ జిల్లా లో రభా హసోంగ్ అటానమస్ కౌన్సిల్ లో ఉన్న ఒక సహజ సరస్సు. గువహాటి నగరం నుండి 64 కిలోమీటర్ల (40 మైళ్ళు) దూరంలో ఉన్న ఈ సరస్సును జాతీయ రహదారి - 37 ద్వారా చేరుకోవచ్చు.[1]
ఈ సరస్సు అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు ఆవరించి ఉన్న గారో కొండల అడుగు భాగాన ఉంది. ఈ ప్రాంతం లోతైన అటవీ, చిన్న గ్రామాలతో నిండి ఉంది. ఇది ఒక సందర్శన స్థలం, విహార యాత్ర ప్రదేశం. ఈ సరస్సు శీతాకాలంలో వలస పక్షులను ఆకర్షిస్తుంది.[2]
ఈ సరస్సు జూన్ 12, 1897 న సాయంత్రం అస్సాం లో సంభవించిన భూకంపం వల్ల ఏర్పడింది. అప్పటి అడవి కాస్త సరస్సుగా మారింది.
సరస్సులో ఏర్పడిన సహజ మడుగు దీని ప్రధాన భాగం. ఈ సరస్సులో జాలరులు చేపలు పట్టుకుంటారు. సరస్సు నిర్వాహకులు సరస్సు నీటిలో రోయింగ్ చేయడానికి సౌకర్యాలు కూడా కల్పించారు. జనవరి మొదటి వారంలో జరిగే చందుబి పండగకు, స్థానిక గ్రామ ప్రజలు తమ సాంప్రదాయ, సాంస్కృతిక నృత్య రూపాలను ప్రదర్శిస్తారు. అనేక రకాల స్టాల్స్ లల్లో తమ స్థానిక సాంప్రదాయ ఆహారాన్ని అమ్ముతారు.[3]