చంద్రప్రభ సైకియానీ | |
---|---|
চন্দ্ৰপ্ৰভা শইকীয়ানী | |
జననం | చంద్రప్రియ దాస్ 1901 మార్చి 16 దాయిసింగారి, కామరూప్ జిల్లా, అస్సాం |
మరణం | 1972 మార్చి 16 దాయిసింగారి, కామరూప్ జిల్లా, అస్సాం | (వయసు 71)
ఇతర పేర్లు | చంద్రప్రభ సైకియానీ |
వృత్తి | సంఘస్ంస్కర్త, రచయిత్రి |
క్రియాశీల సంవత్సరాలు | 1918-1972 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఆల్ అస్సాం ప్రాదేశిక మహిళా సమితి |
భాగస్వామి | దండినాథ్ కలితా |
పిల్లలు | అతుల్ సైకియా |
తల్లిదండ్రులు | రతిరామ్ మజుందార్ గంగప్రియ |
పురస్కారాలు | పద్మశ్రీ |
చంద్రప్రభ సైకియాని (1901 మార్చి 16 - 1972 మార్చి 16) అస్సాంకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, రచయిత్రి, సంఘ సంస్కర్త. ఆమెను అస్సాంలో స్త్రీవాద ఉద్యమానికి మార్గదర్శకురాలిగా పరిగణిస్తారు. [1] [2] అస్సాం మహిళల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థ అయిన ఆల్ అస్సాం మహిళా మహిళా సమితిని స్థాపించింది. [3] భారత ప్రభుత్వం ఆమెకు 1972 లో నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ బహూకరించింది. [4] మూడు దశాబ్దాల తరువాత, 2002 లో సంఘ సంస్కర్తలు అనే శ్రేణిలో సైకియాని స్మారక స్టాంపును విడుదల చేసింది [5]
1920-21 శాసనోల్లంఘన ఉద్యమంలోను, 1932 లో జరిగిన సహాయ నిరాకరణోద్యమం లోనూ ఆమె చురుకైన పాత్ర పోషించింది. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె స్వతంత్ర భారతదేశ రాజకీయాల్లో అడుగుపెట్టిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది. సైకియాని కవయిత్రి, రచయిత్రి కూడా.
చంద్రప్రభ అస్సాం రాష్ట్రం, కామరూప్ జిల్లా లోని దోయిసింగారి గ్రామంలో 1901 మార్చి 16 న రతిరామ్ మజుందార్, గంగప్రియా మజుందార్ లకు జన్మించింది. ఆమెకు చంద్రప్రియ అని పేరు పెట్టారు. ఈశాన్య భారతదేశ రాష్ట్రం. పదకొండు మంది పిల్లలలో ఆమె ఏడవది. పెద్దయ్యాక ఆమె, "చంద్రప్రభ సైకియాని" అనే పేరును ఎంచుకుంది.
ఆమె సోదరి రజనీప్రభ సైకియాని (అస్సాంలో మొదటి మహిళా డాక్టరు) తో పాటు, వారు అనేక కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలుర పాఠశాలలో (బాలికల పాఠశాల లేదు) చదువుకున్నారు. నడుము లోతున్న నీళ్ళను దాటుకుని వెళ్ళేవారు. వారి ప్రయత్నం పాఠశాల సబ్ ఇన్స్‌పెక్టర్ అయిన నీల్కాంత బారువాను ఆకట్టుకుంది. ఆమెకు నాగావో మిషన్ స్కూల్‌కు స్కాలర్‌షిప్ లభించింది. [6] నాగావ్ మిషన్ స్కూల్‌లో, క్రైస్తవ మతంలోకి మారాలనే ప్రతిపాదనను తిరస్కరించడంతో ఆమెను హాస్టల్‌లో ఉండడానికి పాఠశాల అధికారులు అనుమతించలేదు. ఆమె వారిపై నిరసన వ్యక్తం చేసింది. చివరకు ఆమె నిరసన ఫలితాన్నిచ్చి, అధికారులు ఆమెను హాస్టల్‌లోకి చేర్చుకున్నారు. [1] [7] [8]
పాఠశాల అయిన తర్వాత, ఆమె స్థానికంగా ఉండే నిరక్షరాస్యులైన బాలికలను పాఠశాలకు సమీపంలో ఉన్న తాత్కాలిక షెడ్డులో చేర్చి, తాను నేర్చుకున్న వాటిని వారికి బోధించేది. [6] హాస్టల్ సూపరింటెండెంట్ హిందూ విద్యార్థుల పట్ల వివక్షాపూరితంగా వ్యవహరించినందుకు ఆమె నిరసన వ్యక్తం చేసింది. దానితో ఆమె సామాజిక కార్యకలాపాలు మొదలయ్యాయి. [1]
తల్లిదండ్రులు ఆమెను ఒక వృద్ధుడి కిచ్చి పెళ్ళి చెయ్యబీవడంతో ఆమె ఎదురు తిరిగింది [9] అస్సామీ రచయిత దండినాథ్ కలితాతో నిశ్చితార్థం చేసుకుంది. [7] వారి సంబంధం కారణంగా ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. కానీ కలితా మరొకరిని పెళ్ళి చేసుకోవడంతో ఆమె జీవితాంతం అవివాహిత గానే ఉండిపోయింది. [8] [6] కుమారుడిని పెంచడంలో ఒంటరి తల్లిగా అమె సంప్రదాయవాద సమాజం నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంది. అయితే తేజ్‌పూర్‌లో ఉండగా ఆమెకు చంద్రనాథ్ శర్మ, ఓమియో కుమార్ దాస్, [10] జ్యోతిప్రసాద్ అగర్వాలా, లఖిధర్ శర్మ వంటి సామాజిక, సాంస్కృతిక నాయకుల పరిచయం కలిగించింది.
సైకియాని నాగావ్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా తన వృత్తిని ప్రారంభించింది. తరువాత తేజ్‌పూర్ బాలికల ME స్కూల్‌కు ప్రధానోపాధ్యాయురాలిగా మారింది. [1]
తేజ్‌పూర్‌లో ఉండగా ఆమెకు, జ్యోతిప్రసాద్ అగర్వాలా, ఓమియో కుమార్ దాస్, చంద్ర నాథ్ శర్మ, లఖిధర్ శర్మ వంటి ప్రముఖులతో పరిచయమైంది. [11] 1918 లో, అసోమ్ ఛాత్ర సన్మిలన్ వారి తేజ్‌పూర్ సెషన్‌లో, ఆమె ఏకైక మహిళా ప్రతినిధి. నల్లమందు తినడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలపై భారీ సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించింది. దానిని నిషేధించాలని కోరింది. [1] ఒక అస్సామీ మహిళ, పెద్ద సభలో మాట్లాడిన మొదటి సంఘటన ఇది.
1921 లో జాతీయవాదం పెరగడంతో ప్రభావితమై, ఆమె మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొంది. తేజ్‌పూర్ మహిళల్లో సందేశాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేసింది. [1] 1925 లో అస్సాం సాహిత్య సభ వారి నాగావ్ సమావేశంలో ఆమె ఆహ్వానిత వక్తగా ప్రసంగించింది. అక్కడ ఆమె మహిళలను విడిగా ఒక ప్రత్యేక ఆవరణలో కూర్చోబెట్టడం చూసి, ఆ అడ్డంకులను పడదోయమని పిలుపు నిచ్చింది. దాంతో ఆ మహిళలు బయటికి వచ్చి పురుషులతో పాటు కలిసారు. [1]
గ్రామానికి తిరిగి వచ్చిన తరువాత, ఆమె కల్జీరాపారా పాఠశాలలో టీచర్‌గా చేరింది. కానీ భారత జాతీయ కాంగ్రెస్ గౌహతి సభలకు హాజరు కావడానికి పాఠశాల అనుమతి నిరాకరించడంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసింది. [1] ఆమె తన సామాజిక క్రియాశీలతను కొనసాగించింది. బాల్య వివాహాలు, బహుభార్యాత్వం, దేవాలయాలలో మహిళల పట్ల వివక్షకు వ్యతిరేకంగా వ్యవహరించడానికి మహిళల విద్య, స్వయం ఉపాధి వంటి సమస్యలను చేపట్టడానికి 1926 లో అస్సాం స్థానిక మహిళా సమితిని స్థాపించింది [12] ఆమె ప్రయత్నాల వలన గౌహతి సమీపంలో ఉన్న హయగ్రీవ మాధవ ఆలయం లోకి మహిళలను అనుమతించారు. [1] శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్న కారణంగా ఆమె 1930 లో జైలు శిక్ష అనుభవించింది. తరువాత 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మళ్లీ జైలు పాలైంది. [7] [8]
భారత స్వాతంత్ర్యం తరువాత, ఆమె సోషలిస్ట్ పార్టీలో చేరింది. కానీ మళ్ళీ కాంగ్రెసు పార్టీలో చేరింది. 1957 అసోం శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. [1] ఆమె కుమారుడు అతుల్ సైకియా రాజకీయవేత్త. అసోం శాసనసభ మాజీ సభ్యుడు. [7]
సైకియాని 1918 లో 17 ఏళ్ల వయసులో స్థానిక పత్రిక, బాహిలో తన మొదటి చిన్న కథను ప్రచురించింది. తర్వాత పితృభిత (1937), సిపాహి బిద్రోహత్ (సిపాయ్ తిరుగుబాటు), డిల్లిర్ సింహాసన్ (ఢిల్లీ సింహాసనం), కవి అనవ్ ఘోష్ తదితర నవలలు రచించింది. ఆమె మహిళా సమితి సంస్థకు చెందిన అస్సామీ పత్రిక అభిజత్రికి సంపాదకురాలిగా ఏడు సంవత్సరాల పాటు పనిచేసింది. [1] అల్ ఇండియా అస్సాం రైతుల సమావేశానికి కూడా నాయకత్వం వహించింది. [7]
1972 లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది. మళ్లీ 2002 లో, భారత ప్రభుత్వం ఆమె గౌరవార్థం స్మారక స్టాంపును విడుదల చేసింది.
సైకియాని తన 72 వ పుట్టినరోజు నాడు, 1972 మార్చి 16 న క్యాన్సర్‌తో మరణించింది [1][7] ఆమె మరణానికి కొన్ని నెలల ముందు,1972 లో, భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. [4] 2002 లో పోస్ట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ద్వారా సంఘ సంస్కర్తల స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసి ప్రభుత్వం ఆమెను సత్కరించింది. [5] గౌహతి లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌కు [13] ఆమె పేరు పెట్టారు. [6] తేజ్పూర్ విశ్వవిద్యాలయం ఈశాన్య భారతదేశంలో మహిళల విద్య అభివృద్ధి కోసం 2009 లో ఆమె పేరిట ఒక మహిళల సెంటర్, ఉమెన్స్ స్టడీస్ కోసం చంద్రప్రభ సైకియానీ సెంటర్ (CSCWS) ను స్థాపించారు. [14]
ఆమె జీవిత చరిత్రపై నాలుగు పుస్తకాలు వచ్చాయి:
నిరుపమా బోరోఘాయ్ రచించిన అభియాత్రి వన్ లైఫ్ మెనీ రివర్స్ [17] అనే నవల [18] సైకియానీ జీవితంపై ఆధారపడీ రసిన కల్పిత రచన. [8] ఈ నవలకు 1996 లో సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. [19] తరువాత ప్రొదీప్టో బోర్గోహైన్ ఈ నవలను ఆంగ్లంలోకి అనువదించాడు. సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్నారు. [8]