చిదంబరం ఎస్.జయరామన్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | చిదంబరం, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా | 1917 జనవరి 6
మరణం | 1995 జనవరి 29 | (వయసు 78)
సంగీత శైలి | సినిమా సంగీతం |
వృత్తి | నటుడు, నేపథ్య గాయకుడు, సినిమా సంగీత దర్శకుడు |
వాయిద్యాలు | గాత్ర విద్వాంసుడు |
చిదంబరం సుందరం పిళ్ళై జయరామన్ లేదా సి.ఎస్.జయరామన్ (తమిళం: சி. எஸ். ஜெயராமன்) పేరుపొందిన నటుడు, నేపథ్యగాయకుడు, సంగీత దర్శకుడు. ఇతని పాటలు 1940 -70 మద్య విడుదలైన అనేక తమిళ సినిమాలలో చోటు చేసుకున్నాయి.
ఇతడు 1917, జనవరి 6వ తేదీన తమిళనాడులోని పుణ్యస్థలమైన చిదంబరంలో జన్మించాడు. ఇతని తండ్రి సుందరం పిళ్ళై పేరుమోసిన శాస్త్రీయ సంగీత గాత్ర విద్వాంసుడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఇతని బావమరిది. ఎం.కరుణానిధి సినిమా రంగంలోనికి అడుగు పెట్టడానికి ఇతడే కారణం. ఇతని సిఫారసుపై తమిళ సినిమా దర్శకుడు ఎ.ఎస్.ఎ.స్వామి కరుణానిధిని 1947లో తన సినిమా "రాజకుమారి"కి స్క్రిప్ట్ రచయితగా పరిచయం చేశాడు. తరువాత కరుణానిధి గొప్ప సినిమా రచయితగా ఎదిగాడు.
ఇతడు 1934 నుండి తమిళ సినిమాలలో నటించడం ప్రారంభించాడు. ఇతడు నటించిన సినిమాలలో కృష్ణలీల (1934), భక్త ధృవన్ (1935), నల్ల తంగాళ్ (1935), లీలావతి సులోచన (1936), ఇళంత కాదల్ (1941), పూంపావై (1944), కృష్ణభక్తి (1948) ఉన్నాయి.
ఉదయనన్ వాసవదత్త (1946), రక్త కన్నీర్ (1954) సినిమాలకు సంగీత దర్శకుడిగా, విజయకుమారి (1950), కృష్ణ విజయం (1950) సినిమాలకు సహ సంగీత దర్శకుడిగా పనిచేశాడు.
ఇతని మధురమైన స్వరం వల్ల ఇతనికి అనేక సినిమాలలో నేపథ్య గాయకుడిగా అవకాశం లభించింది. ఇతడు ఎస్.వి.వెంకటరామన్, జి.రామనాథన్, కున్నక్కూడి వెంకట్రామ అయ్యర్, సి.ఆర్.సుబ్బరామన్, ఆర్. సుదర్శనం, జి.గోవిందరాజులు నాయుడు, ఎస్.ఎం.సుబ్బయ్యనాయుడు, విశ్వనాథన్-రామమూర్తి, టి.ఆర్. పప్పా, టి.జి.లింగప్ప, సుసర్ల దక్షిణామూర్తి, ఆర్.గోవర్ధనం, కె.వి.మహదేవన్, సి.రామచంద్ర, టి.ఎం.ఇబ్రహీం, సాలూరు హనుమంతరావు, మాస్టర్ వేణు, జి.అశ్వత్థామ, పెండ్యాల నాగేశ్వరరావు, రాజన్ - నాగేంద్ర మొదలైన సంగీత దర్శకుల ఆధ్వర్యంలో తమిళ, కన్నడ సినిమా పాటలు పాడాడు.
ఇతడు ఎం.ఎల్.వసంతకుమారి, జిక్కి, పి.సుశీల, ఎ.పి.కోమల, పి.లీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎ. జి. రత్నమాల, భానుమతీ రామకృష్ణ మొదలైన గాయనీమణులతో కలిసి పాటలు పాడాడు.
ఇతని పాటలకు టి.వి.రాధాకృష్ణన్, శివాజీ గణేశన్, ఎం.జి.రామచంద్రన్, ఎం.ఆర్.రాధా, రాజ్‌కుమార్, ఎస్.ఎస్.రాజేంద్రన్, ఎన్.టి.రామారావు, టి.కె.భగవతి, కె.బాలాజీ, పి.వి.నరసింహభారతి మొదలైన నటులు నటించారు.
ఇతడికి తమిళ్ ఇసై చిత్తర్ (తమిళం: தமிழ் இசை சித்தர்) అనే బిరుదు ఉంది. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతనికి 1983లో సృజనాత్మక & ప్రయోగాత్మక సంగీతం విభాగంలో అవార్డును ప్రకటించింది.
ఇతడు తిరుక్కురల్‌ను పూర్తిస్థాయి కచేరీ రూపంలో ప్రదర్శించిన కొద్దిమందిలో ఒకడుగా పేరుపొందాడు.[1]
ఇతడు 1995, జనవరి 29వ తేదీన తన 78వ యేట మరణించాడు.[2]