చినరాయుడు | |
---|---|
దర్శకత్వం | బి.గోపాల్ |
రచన | భువనచంద్ర |
నిర్మాత | పి. ఆర్. ప్రసాద్ |
తారాగణం | వెంకటేష్, విజయశాంతి |
ఛాయాగ్రహణం | వి. ఎస్. ఆర్. స్వామి |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | శ్రీ దత్తసాయి ఫిలిమ్స్ |
విడుదల తేదీ | ఆగస్టు 7, 1992 |
సినిమా నిడివి | 141 ని |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చినరాయుడు 1992లో విడుదలైన తెలుగు సినిమా. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకటేష్, విజయశాంతి ప్రధానపాత్రలు పోషించారు.[1][2] ఇది తమిళంలో విజయవంతమైన చిన్న గౌండర్ సినిమాకి తెలుగు పునర్నిర్మాణం. తమిళంలో విజయకాంత్ ప్రధాన పాత్రను పోషించాడు.
చినరాయుడు ఊరికి పెద్ద. అందరికీ న్యాయం జరిగేలా, ప్రజలు సంతోషంగా ఉండేలా చూస్తుంటాడు. తల్లి దుర్గమ్మతో కలిసి నివసిస్తూ ఉంటాడు. చినరాయుడి బావ పశుపతి ఎప్పుడూ అతన్ని ద్వేషిస్తూ అడ్డు తగులుతూ ఉంటాడు. గౌరి అదే ఊర్లో మేకలు కాసుకుంటూ ఉండే యువతి. గౌరి, చినరాయుడు సరదాగా పోట్లాడుకుంటున్నట్లున్నా ఒకరిమీద మరొకరికి అభిమానం. గౌరి తన చెల్లెలు చదువుకోసం పశుపతి దగ్గర కొంత ధనం అప్పుచేసి ఉంటుంది. గౌరి చెల్లెలు చదువు పూర్తి చేసుకుని వచ్చి అదే ఊర్లో పాఠశాలలో పంతులమ్మగా చేరుతుంది. ఇది నచ్చని పశుపతి గౌరిని తన అప్పు ను ఉన్న ఫళంగా తీర్చేయమంటాడు. అందుకు తగ్గ సొమ్ము ఆమె దగ్గర ఉండదు. విషయం పంచాయితీకి వెళుతుంది. గౌరిని గ్రామంలో ఉండే అందరినీ విందుకు పిలిచి వాళ్ళకి తోచిన ధనాన్ని దానంగా తీసుకుని అప్పు తీర్చమని తీర్పునిస్తాడు. అందుకు గౌరి అయిష్టంగానే అంగీకరించి అలాగే చేస్తుంది. ఆ విందులోనే చినరాయుడు ఆమెను పెళ్ళిచేసుంటానని గుర్తుగా మంగళసూత్రం ఇస్తాడు. వాళ్ళిద్దరికీ పెళ్ళి జరుగుతుంది.
చేపల చెరువు వేలంలో చినరాయుడి మీద నెగ్గుతాడు పశుపతి. తర్వాత ఆ చెరువులోవిషం కలిపి ఆ నేరాన్ని చినరాయుడి మీదకు నెట్టడానికి ప్రయత్నిస్తాడు. అందుకు అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు ప్రకాష్ రావు అనే వ్యక్తిని నియమిస్తాడు పశుపతి. ప్రకాష్ రావు చిన్నప్పటి నుంచి చినరాయుడి దగ్గరే పెరిగినా అతన్ని అవమానించాడనే కోపంతో సాక్ష్యం చెప్పడానికి సిద్ధ పడతాడు. గంగ అడ్డుపడి చెప్పవద్దని వేడుకుంటుంది. కానీ అతను వినడు. చినరాయుడిని పరువు కాపాడ్డం కోసం ప్రకాష్ రావును కత్తితో నరుకుతుంది గంగ. ఆమెను పోలీసులు నిర్భందిస్తారు. చినరాయుడు వెళ్ళి ఆమె దగ్గరకు పోయి అసలు కారణం పశుపతి అని తెలుసుకుని అతని మీద కత్తిదూయడానికి వెళతాడు. కానీ అదే సమయానికి చెల్లెలికి శుభకార్యం జరుగుతుండటంతో వెనక్కి తిరిగి వచ్చేస్తాడు.
ఈ లోపు పెళ్ళి కాని గంగ గర్భవతి అవుతుంది. ఆమె గౌరవం కాపాడ్డం కోసం చినరాయుడు జరిగిన నేరం తనమీద వేసుకుంటాడు. దుర్గమ్మ కొడుకుని ఇంటి నుంచి బయటకు పంపేస్తుంది. జైలులో గౌరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుంది. చినరాయుడు ఆమెను ఆపి జరిగిన విషయం చెబుతాడు. గంగకు అలా జరగడానికి కారణం ప్రకాష్ రావు అనీ, వాళ్ళ కుటుంబ గౌరవం కాపాడ్డానికే అలా చేయవలసి వచ్చిందని ఆమెకు చెబుతాడు. అదే సమయానికి ప్రకాష్ రావు నిజానికి గౌరి నరకడం వలనే చనిపోలేదని, తర్వాత పశుపతి వచ్చి చంపేశాడనీ చినరాయుడికి తెలుస్తుంది. చినరాయుడు ఈ విషయాన్ని గౌరికి నిరూపిస్తాడు. గంగ ఒక బిడ్డకు జన్మనిచ్చి అందరికీ నిజం చెప్పి చనిపోతుంది. చినరాయుడు పశుపతిని పంచాయితీకి పిలిచి నేరం ఒప్పుకోమంటాడు. పశుపతి పశ్చాత్తాపపడి పోలీసులకి లొంగిపోవడంతో కథ ముగుస్తుంది.
ఈ సినిమాకు సంగీతాన్ని ఇళయరాజా సమకూర్చగా భువనచంద్ర పాటలు రచించారు.[3]
సంఖ్య | పాట | గాయనీగాయకులు |
---|---|---|
1 | బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలోని గువ్వపిట్ట | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి |
2 | బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలోని గువ్వపిట్ట | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, కె.ఎస్.చిత్ర |
3 | చెప్పాలని ఉంది | ఎస్.పి.బాలసుబ్రమణ్యం |
4 | చిట్టి చిట్టీ నీపైట కొంగు | ఎస్.పి.బాలసుబ్రమణ్యం |
5 | కంటి చూపు చాలునయ్యా చిన్నరాయుడు | ఎస్.పి.బాలసుబ్రమణ్యం |
6 | నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్య | ఎస్.పి.బాలసుబ్రమణ్యం |
7 | స్వాతిముత్యమాల ఒళ్ళుతాకి తుళ్ళిపోయింది | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, చిత్ర |
8 | నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్య | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, జానకి |