చిరాగ్ పాశ్వాన్ (1983 అక్టోబరు 31) ఒక భారతదేశ రాజకీయవేత్త, లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షుడు. అతను భారతదేశ పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ స్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు.[1][2] 2021 నుండి లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడిగా ఉన్నాడు.
అతను 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో బీహార్ లోని జమూయ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికలలో అతని తండ్రి హాజ్పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. వీరిరువురూ లోక్‌జనశక్తి పార్టీ నుండి పోటీ చేసారు.[3]
అతను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్.[4][5] అతను బాలీవుడ్ లో "మిలే నా మిలే హం" చిత్రంలో 2011లో నటించాడు.[6] ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విఫలమైంది. అందువల్ల అతని సినిమా కెరీర్ ఆగిపోయింది. [7]
పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ తరపున 2014 ఎన్నికలలో జాముయ్ నియోజకవర్గం నుండి పోటీ చేసాడు. సమీప రాష్ట్రీయ జనతాదళ్ కు చెందిన ప్రత్యర్థి సుధాంసు భాస్కర్ పై 85,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు. 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో అతను మొత్తం 528,771 ఓట్లను సాధించి, సమీప ప్రత్యర్థి భూడియో చౌదరిని ఓడించి పాశ్వాన్ తన స్థానాన్ని నిలుపుకున్నాడు.[8]
తన రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు అతను చిరాగ్ కా రోజ్గార్ అనే ఎన్జీఓను స్థాపించాడు.[9]
బీహార్ ఫస్ట్ బీహారీ ఫస్ట్ - రాబోయే బీహార్ ఎన్నికలకు ముందు చిరాగ్ పాస్వాన్ బీహార్ యువత దృష్టిని ఆకర్షించేందుకు "బీహార్ ఫస్ట్ బీహారీ ఫస్ట్ క్యాంపెయిన్" ను ప్రారంభించాడు. ఈ క్యాంపైన్ బీహార్ రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సృష్టించబడినది. బీహార్‌ను 'నంబర్ వన్' రాష్ట్రంగా మార్చడం చాలా అవసరమని అతను అన్నాడు.[10]