చెంబై వైద్యనాథ భాగవతార్ | |
---|---|
![]() చెంబైలోని వైద్యనాథ భాగవతార్ విగ్రహం | |
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | వైద్యనాథ అయ్యర్ |
జననం | [1] చెంబై, పాలఘాట్, కేరళ, భారతదేశం | 1896 ఆగస్టు 28
మరణం | 1974 అక్టోబరు 16 ఒట్టపాలం, కేరళ | (వయసు: 78)
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | గాయకుడు |
క్రియాశీల కాలం | 1904–1974 |
లేబుళ్ళు | HMV, Inreco, BMG, Vani Cassettes |
చెంబై వైద్యనాథ భాగవతార్ (28 ఆగస్టు 1896 – 16 అక్టోబరు 1974) పాలక్కాడుకు చెందిన కర్ణాటక సంగీత విద్యాంసుడు. ఇతడు తన గ్రామం పేరు "చెంబై" పేరుతో లేదా "భాగవతార్" పేరుతో సుపరిచితుడు. ఇతడు ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో అనంత భాగవతార్, పార్వతీ అమ్మాళ్ దంపతులకు 1890 సంవత్సరంలో జన్మాష్టమి నాడు పాలక్కాడ్ సమీపంలోని "కొట్టాయ్" గ్రామంలో జన్మించాడు.[2] ఇతడి తొమ్మిదేళ్ళ వయసులో 1904లో మొట్టమొదటి కచేరీ చేశాడు. ఇతడు ఎన్నో బహుమానాలు, బిరుదులు పొందాడు. ఇతడు కొత్తవారిలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేవాడు. [2]ఇతని మరణానంతరం 1974 నుండి ప్రతి యేటా ఇతని స్మరిస్తూ చెంబై సంగీతోత్సవాలను నిర్వహిస్తున్నారు.
ఇతని పూర్వీకులు ఐదు శతాబ్దాలకు పైగా కర్ణాటక సంగీతంతో సంబంధం కలిగి ఉన్నారు. ఇతని తండ్రి వయోలిన్ విద్వాంసుడు, గాయకుడు. అతనికి పాలక్కాడు మహారాజు "ఘనచక్రతానం" అనే బిరుదును ఇచ్చాడు. అతడు పెదవులు కదల్చకుండా 'తానం'ను ఆలపించేవాడు.[3] చెంబై వైద్యనాథ భాగవతార్ తన మూడవ యేటి నుండి కర్ణాటక సంగీతాన్ని గురుశిష్య పరంపరలో భాగంగా తన తండ్రి వద్ద నేర్చుకోవడం ప్రారంభించాడు.[2] 1912 నుండి వయోలిన్ కూడా నేర్చుకున్నాడు.
1904లో ఇతడు ఒట్టపాలంలో తన తొలి కచేరీ చేశాడు. 1907లో వైకోమ్, గురువాయూరులలో ఇతడు చేసిన కచేరీలు పలువురి ప్రశంసలను పొందాడు. 1913-1927 మధ్యకాలంలో ఇతడు అనేక సంగీతోత్సవాలలో, మద్రాసు మ్యూజిక్ అకాడమీ, జగన్నాథ భక్తసభ వంటి అనేక సంగీత సభలలో పాల్గొన్నాడు. ఇతడు 1932 నుండి 1946 మధ్యకాలంలో వందల కొద్దీ గ్రామఫోన్ రికార్డులను తీసుకువచ్చాడు.[4] 1945లో ఇతని స్నేహితుడు టి.జి.కృష్ణ అయ్యర్ తమిళ, మలయాళ, సంస్కృత భాషలలో లలిత దాసర ముద్రతో రచించిన 155 కృతులకు ఇతడు విస్తృత ప్రచారం కల్పించాడు. ధాన్యరాశి, శంకరాభరణం, హంసానందిని, ఆరభి మొదలైన రాగాలలో ఈ కృతులను స్వరపరిచి దాదాపు ప్రతి కచేరీలోను లలితదాసర కీర్తనలు ఆలపించాడు.[2] ఇతని గొంతు చలా శ్రావ్యంగా, ధృడంగా, స్పష్టంగా, ప్రతిధ్వనిస్తూ ఉండేది. ఇతడు రాగాలాపనలో ఖచ్చితమైన కాలప్రమాణాన్ని పాటించేవాడు.[5]ఇతడు ఒకే రోజు మూడు ముఖ్యమైన కచేరీలలో పాల్గొనడం చూసి సంగీత కళానిధి జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం ఇతడు అసామాన్యుడని ప్రశంసించాడు.[6] పుదుక్కోటై దక్షిణా మూర్తి పిళ్ళై ఇతడికి లయబ్రహ్మ అనే బిరుదును ఇచ్చాడు.[6] సంగీత కళానిధి కె.వి.నారాయణస్వామి కూడా ఇతడి ప్రతిభను మెచ్చుకున్నాడు..[7]
వైద్యనాథ భాగవతార్‌కు ఎంతో మంది శిష్యులున్నారు. వారిలో కె. జె. ఏసుదాసు, టి.వి.గోపాలకృష్ణన్,[8]పి.లీల,[9] జయ - విజయ (కవలలు),[10] కుడుమారు వెంకటరామన్, చెంబై నారాయణ భాగవతార్, మంగు తంపురన్, గురువాయూర్ పొన్నమ్మాళ్,వి.వి.సుబ్రహ్మణ్యం, కె.జి.జయన్, కె.జి.విజయం, టి.వి. గోపాలకృష్ణన్ బాబు పరమేశ్వరన్, వి.వి. రవి, నేరలట్టు రామ పొడువల్[11] మొదలైన వారు ఉన్నారు.
ఇతడు 1974, అక్టోబరు 16వ తేదీన తన 78వ యేట గుండెపోటుతో మరణించాడు. అంతకు కొద్ది రోజుల ముందే ఇతడు తన చివరి కచేరీని పూళిక్కున్న శ్రీకృష్ణ దేవాలయం, ఒట్టపాలంలో నిర్వహించాడు. యాధృచ్ఛికంగా ఇదే చోట ఇతని మొదటి కచేరీ కూడా జరిగింది. ఇతడు తన శిష్యుడు ఓలప్పమన్న వాసుదేవన్ నంబూదిరిపాద్‌తో మాట్లాడుతూ ఆకస్మికంగా గుండెనొప్పితో మరణించాడు.[12] ఇతని అంత్యక్రియలు స్వగ్రామంలో జరిగాయి. ఇతనికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. తరువాత వారిద్దరూ మరణించారు. పాలక్కాడులోని ప్రభుత్వ సంగీత కళాశాలకు ఇతని జ్ఞాపకార్థం "చెంబై స్మారక ప్రభుత్వ సంగీత కళాశాల"గా పేరు మార్చారు.
ఇతడు తన జీవితంలో ఎన్నో అవార్డులు, సన్మానాలు, బిరుదులు పొందాడు. వాటిలో ముఖ్యమైనవి:
చెంబై వైద్యనాథ భాగవతార్ 1924 నుండి తన స్వగ్రామంలో సంగీతోత్సవాలను నిర్వహించేవాడు. అతని తర్వాత అతని కుటుంబం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నది. ప్రస్తుతం చెంబై శ్రీనివాసన్, చెంబై సురేష్ (సి.ఎ.సుబ్రమణియన్) ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. చెంబై ఏకాదశి సంగీత ఉత్సవాలు అనే పేరుతో నిర్వహించే ఈ ఉత్సవాలు ప్రతి యేటా ఫిబ్రవరి మార్చి నెలలలో జరుగుతాయి. ఇతడు గురువాయూరులో నవంబరు నెలలో గురువాయూరు ఏకాదశిరోజున సంగీత ఉత్సవాలను నడిపేవాడు. ప్రస్తుతం ఈ ఉత్సవాలు చెంబై సంగీతోత్సవం పేరుతో గురువాయూరు దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు.[16]
చెంబై వైద్యనాథ భాగవతార్ సంస్మరణార్థం గురువాయూరులోని శ్రీకృష్ణ దేవస్థానం "గురువాయూరప్పన్ చెంబై పురస్కారం"ను ఏర్పాటు చేసింది. ఈ పురస్కారం క్రింద 50,001 రూపాయల నగదు, గురువాయూరప్పన్ బంగారు లాకెట్టు, ప్రశంసా పత్రం, శాలువా బహూకరిస్తారు. ఈ పురస్కారం సాధారణంగా చెంబై సంగీతోత్సవంలో ప్రదానం చేస్తారు.
గురువాయూరప్పన్ చెంబై పురస్కారం పొందిన కొందరు కళాకారులు:
నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి