చైనా నాటకరంగం కు సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రస్తుతం దీనిని చైనీస్ ఒపెరా లేదా బీజింగ్ ఒపెరా లేదా కాంటోనీస్ ఒపేరా అని పిలుస్తారు.[1] అయితే, చైనాలో నాటకం ఎప్పుడు ప్రారంభమైందో చెప్పటానికి చారిత్రక ఆధారాలు దొరకలేదు. ఒక్కొక్కరు ఒక్కో చరిత్రను సూచించారు.[2]
క్రీ.పూ 2,500 సంవత్సరాల క్రితం మత పరమైన దైవ ప్రార్థనలు చేసినప్పుడుగానీ, యుద్ధంలో విజయం సాధించినప్పుడు ప్రకటించే ఆనందంలోగానీ, సంగీతంకు అనుగుణంగా మూకాభినయాలు, నృత్యాలు చేసేవారు. అలా పూజల సందర్భంగా జరిపేటువంటి తంతుల నుండే చైనా నాటకరంగం అభివృద్ధి చెందినదని చరిత్రకారుల అభిప్రాయం. క్రీ.పూ. 2205-1766 మధ్యకాలంలోనే చైనా ప్రజలు వారి వృత్తిపనులు చేసుకుంటూ పాటలు పాడేవాడుతూ, నృత్యాలు చేసేవారు. క్రీ.పూ. 1122-255 కాలంలో చైనాను పాలించిన చౌ (Chou) రాజవంశీయుల కాలంలో అక్కడ నృత్యాలకి ఆదరణ, పోషణ లభించడమేకాకుండా దేవాలయ ప్రాంగణాలలోనూ, పొలాల మధ్య, రహదారుల కూడళ్లలో ప్రదర్శించబడే ఈ నృత్యాలు, మూకాభినయాలు ఏకంగా రాజులు నిర్మించిన ఎత్తైన రంగస్థలాలకి చేరుకున్నాయి.
చైనా నాటకరంగానికి ఆదిగురువుగా పేరుపొందిన మింగ్ హూవాంగ్ అనే రాజు సా.శ. 8వ శతాబ్దంలో చైనాను పాలించినప్పుడు దర్బారులో సంగీత, నృత్య కళాకారుల్ని పోషించాడు. అంతేకాకుండా ఔత్సాహిక యువతీ యువకులకి సంగీతం, నృత్యం నేర్పించడంకోసం ఒక పాఠశాలను కూడా ప్రారంభించాడు. ఆనాటి ఆ పాఠశాల ఈనాడు పియర్ ఆర్చర్డ్ కాలేజీగా రూపుదిద్దుకుంది. అంతేకాకుండా మింగ్ హూవాంగ్ స్వయాన నటుడవడంతో తను నిర్మించిన రంగస్థలం మీద కూడా నటించాడు. అందుకే చైనాలోని నాటకశాలలో ఆయన ఫోటో ఉంటుంది. ఈయన కాలంలోనే చరిత్రకి తెలిసిన నాటక రచన, ప్రదర్శన మొదలైనదని, ఆ శతాబ్దాన్ని చైనా నాటక వికాసంలో ప్రాథమిక దశగా పేర్కొనవచ్చని పలువురి అభిప్రాయం. అయితే అప్పటి ప్రదర్శనలు రాజ ప్రస్థానాలకే పరిమితం కాబట్టి సా.శ.13వ శతాబ్దం వరకు సామాన్య ప్రజలకి అందుబాటులోకి రాలేదన్నది వాస్తవం.
మంగోలియాకి చెందిన కాబులాయ్ ఖాన్ సా.శ.1280లో చైనాపై దండయాత్ర చేసి యూవాన్ రాజవంశాన్ని నెలకొల్పినప్పటినుంచే చైనాలో నాటకం అభివృద్ధి చెందింది. యూవాన్ కాలంలో కళాకారులను, పండితులను ఉద్యోగాల నుంచి తొలగించడంతో వారంతా కోటదాటి బయటకు వచ్చారు. అలా వారితోపాటే చైనీయుల సాహిత్యం, నాటకం, ఇతర కళారూపాలు కూడా బయటకు వచ్చాయి.
యువానులకాలంలో ఏడువందల నాటకాలు రచింపబడ్డాయి. ప్రస్తుతం అందులో 170 వూత్రమే లభ్యమవుతున్నాయి. ఈ కాలంలో 550 మంది నాటక రచయితలు ఉన్నట్టుగా తెలుస్తున్నాగానీ, వారి గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆనాడు ఉత్తమ నాటక రచయితగా పేరుపొందిన కువాన్ హాన్ చింగ్ (1245-1332) ను చైనా నాటక పితామహుడుగా చెప్పుకుంటారు. ఈయన రాసిన 67 నాటకాలలో, 18 మాత్రమే లభ్యమవుతున్నాయి. ఒక నవల ఆధారంగా వాంగ్ షిపూ రాసిన రొమాన్స్ ఆఫ్ ది వెస్టర్న్ చాంబర్ (ఇరవై అంకాలు) నాటకం అప్పటి చైనా ఉత్తర బాణి నాటకాలలో అత్యుత్తమ నాటకంగా పేరు పొందింది. చీ చున్ షియాంగ్ రాసిన మరో అద్భుత నాటకం ఆర్ఫన్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ఛావో, ఈ నాటకాన్ని 1755లో ది ఆర్ఫన్ ఆఫ్ చైనా అనే పేరుతో వోల్టేయిర్ ఇంగ్లీషులోకి అనువదించాడు. పాశ్చాత్య నాటక రచయితలను బాగా ప్రభావితం చేసిన నాటకం లీహిస్సింగ్ టావో రచించిన ది స్టోరీ ఆఫ్ ది చాక్ సర్కిల్ . దీని ఆధారంగానే పాశ్చాత్య రచయితలైన ఎ.హెచ్ క్లాబండ్ ది సర్కిల్ ఆఫ్ చాక్ (1923), బెర్టోల్డ్ బ్రెహ్ ది కకేషియన్ చాక్ సర్కిల్ (1944) నాటకాలు రాశారు. వీరి కాలంలోనే చైనా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో నాటకశాలలు ఏర్పాటుకాబడ్డాయి. ఈ నాటకశాలల్లో పోషకులు కుర్చీల్లో కూర్చుని సామాన్య ప్రజలు నిలుచుని ప్రదర్శనలు చూసేవారు.
14వ శతాబ్దం మధ్య ప్రాంతంలో దక్షిణ చైనాలో ఉత్తర బాణీ నాటకాలకు భిన్నంగా ఉండే దక్షిణ బాణి నాటకం మొదలైంది. దక్షిణ బాణీలో కావోమింగీ రాసిన లూటసాంగీ (1350) బాగా ప్రసిద్ధి పొందింది. 1368లో మంగోలియా రాజులను జయించి మింగ్ రాజ్యవంశం అధికారంలోకి వచ్చిన తరువాత నాటకం అభివృద్ధి చెంది, అనేక 50 అంకాల నాటకాలు రాయబడ్డాయి. ఈకాలంలోనే నాలుగు అద్భుత నాటకాలు రాసిన టాంగ్ హిసిన్ త్సూ గొప్ప నాటక రచయితగా పేరుపొందాడు. ఈ నాలుగు నాటకాలలో ది పియోని పెవీలియన్ (55 అంకాలతో) నాటకం అనేకంగా ప్రదర్శించబడింది.[3][4][5][6][7]
1664లో ఉత్తర చైనా నుంచి దండయాత్ర చేసి చింగ్ రాజవంశం అధికారంలోకి వచ్చిన తరువాత దక్షిణ బాణీ నాటక ప్రదర్శనలు మళ్ళీ ప్రారంభమవ్వడంతో కుంగ్షంగ్ జన్, హంగ్ పంగ్, లీయూ మొదలైన రచయితలు ఎన్నో నాటకాలు రచించారు. 19వ శతాబ్దం మధ్యదాకా దక్షిణ బాణీ నాటకాలు విపరీతంగా ప్రదర్శించబడ్డాయి. ఈ నాటకాల ప్రభావంతోనే 19వ శతాబ్దం రెండవ భాగంలో పెకింగ్ ఒపేరా అనే నూతన సంగీత నాటకబాణీ ప్రారంభమై, అప్పటినుండి నేటివరకు చైనాలో పెకింగ్ ఒపేరా ప్రజాదరణ పొందుతోంది. కారణంగా సాహిత్యపరంగా కాకుండా ప్రదర్శనపరంగా నాటకాలు రాయబడ్డాయి. సంగీతం, నృత్యం, అభినయం, నటీనటుల కదలికలు, శారీరక విన్యాసాల మిలితంతో ఈ ప్రదర్శనలు ఉండేవి.
1920 మొదట్లో షేక్స్పియర్, చెకోవ్, ఇబ్సన్, బెర్నార్డ్ షా వంటి రచయితల నాటకాలు చైనీస్ భాషలోకి అనువాదంచేసి ప్రదర్శించి, కొంతకాలం తరువాత వీటి ప్రభావంతో స్వంత రచనలు చేశారు. అలాంటి వారిలో మొదటివాడైన ట్సయూ (1910) థండర్ స్టార్ (1933), సన్రైజ్ (1935), ది బ్రిడ్జ్ (1945) వంటి నాటకాలు రచించాడు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పెకింగ్ ఒపేరాతోపాటు, చైనీస్ నాటకరంగం అనేక మార్పులు చెందడంతో ఇతర రచయితలు కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ప్రాచుర్యం కలిగించే నాటకాలు రాశారు. అప్పటిదాకా ప్రదర్శింపబడుతున్న కొన్ని నాటకాలను కూడా ప్రభుత్వం నిషేధించింది. 1966 తరువాత వచ్చిన సాంస్కృతిక విప్లవం అనేక పరిణామాలకు దారి తీసి, ప్రభుత్వంచే అనేక రకాల సంప్రదాయ నాటక బాణీలను అణగదొక్కేందుకు కారణమయింది. దాంతో కొంతకాలం పాటు చైనాలో కొన్ని ప్రభుత్వ ప్రచార నాటకాలు తప్ప ఇతర నాటక ప్రదర్శనలన్నీ నిలచిపోయాయి. ప్రజా నిరసనల కారణంగా ప్రభుత్వం 1969 తరువాత నాటకరంగం మీద క్రమంగా ఆంక్షలు తొలగించింది.
1981 తరువాత రంగస్థలం, రంగాలంకరణ లేకుండా ప్రేక్షకులందరూ నటీనటులు చుట్టూ నేల మీద కూర్చుని చూసే లిటిల్ థియేటర్ ఉద్యమం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పాటలు, శారీరక కదలికలు, మూకాభినయం మొదలైన అంశాలతో ప్రదర్శనలు ఉండేవి.[8]