జడ్చర్ల, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల మండలానికి చెందిన జనగణన పట్టణం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] ఇది 7 వ నెంబరు జాతీయ రహదారి పై ఉన్న ముఖ్య కూడలి. హైదరాబాదు నుంచి కర్నూలు, బెంగుళూరు వైపు వెళ్ళు అన్ని ఆర్టీసీ బస్సులు ఇచ్చట ఆపుతారు. ఇది బాదేపల్లి జంట పట్టణం. ప్రస్తుతం ఈ రెండు పట్టణాల గ్రామపంచాయతీలు వేరువేరుగా ఉన్ననూ భౌగోళికంగా ఈ పట్టణాల మధ్య సరిహద్దు గుర్తించడం కష్టం. ఇది జడ్చర్ల పురపాలకసంఘంగా ఏర్పడింది.[3]
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా మొత్తం 1,02,766 - పురుషులు 51,240 - స్త్రీలు 51,526.అక్షరాస్యుల సంఖ్య 61056.[4] అందులో జడ్చర్ల పట్టణ జనాభా 50366 కాగా, గ్రామీణ జనాభా 52191.
11వ శతాబ్ది నాటికే జడ్చర్ల ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉండేది. 19వ శతాబ్ది తొలి అర్థభాగంలో ఈ పట్టణంలో తన కాశీయాత్రలో భాగంగా మజిలీచేసిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ పట్టణాన్ని గురించి తన కాశీయాత్రచరిత్రలో వ్రాశారు. ఆయన వర్ణించినదాని ప్రకారం 1830నాటికే ఇది చక్కని బస్తీగా ఉండేది. రమణీయమైన కొలను, చుట్టూ మండపాలతో మంచి దేవాలయం ఉండేదన్నారు. పట్టణంలో సంపన్న వర్తకులైన ఉండేవారని వ్రాశారు. అప్పటికే జడ్చర్లలో సకల పదార్థాలూ దొరికేవన్నారు. ఆ ఊరు ఆరువేల నియోగి రాజగోపాలరావు అనే వ్యక్తికి తరతరాలుగా జమీందారీ కింద ఉండేదన్నారు. అయితే అతని వయస్సు అప్పటికి 12 సంవత్సరాలు కావడంతో ఆయన తల్లి పరిపాలన చేసేవారు. 3 లక్షల వరకూ సంవత్సరానికి నవాబుకు కట్టుకునే ఆ సంపన్న జమీందారీ పాలకులు ధర్మపాలన చేసేవారని పేరున్నట్టు వీరాస్వామయ్య వ్రాశారు. వారికి రాచూరు అనే గ్రామం రాజధానిగా ఉండేదన్నారు.[5] ఆయూరున్ను ఇంకా 36 గ్రామాలున్ను రాజగోపాలరావు అనే ఆరువేల నియోగి బ్రాంహ్మణునికి కొన్నితరాలుగా జమీను నడుచుచున్నది. 3 లక్షల రూయాయీలు గోలకొండ నవాబుకు కట్టుచున్నారు. ఇప్పుడు 12 సంవత్సరముల చిన్నవాడు తల్లికి సహాయముగా దొరతనము చేయుచున్నాడు. ధర్మ సంస్థాన మని చెప్పబడుచున్నది. రాచూరు అనేయూరు వారికి రాజధానిగా నున్నది.
7 వ నెంబరు జాతీయ రహదారిపై ముఖ్యకూడలి కావడంతో బస్సు సౌకర్యం మంచి స్థితిలో ఉంది. హైదరాబాదు నుంచి దక్షిణం వైపుగా కర్నూలు, బెంగుళురు వైపు వెళ్ళు మార్గమే కాకుండా మహబూబ్ నగర్ నుంచి తూర్పు వైపున దేవరకొండ, నల్గొండ వెళ్ళు మార్గం కూడా ఈ పట్టణం ద్వారానే వెళ్తుంది. అంతేకాకుండా ఈ పట్టణానికి రైలు సదపాయము కూడా ఉంది. రోడ్డు మార్గములో హైదరాబాదు నుంచి 83 కిలోమీటర్లు, రైలు మార్గంలో సికింద్రాబాదు నుంచి 96 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జడ్చర్ల పట్టణంలో 4 సినిమా థియేటర్లు ఉన్నాయి.
మండలంలో 9 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 766 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[6]
2023, మే 27న జడ్చర్ల పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే సి. లక్ష్మారెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[9][10]
పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకంలో భాగంగా ఈ గ్రామంలో 42 కోట్ల రూపాయలతో నిర్మించిన 560 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ సముదాయాన్ని 2023, జూన్ 9న తెలంగాణ రాష్ట్ర ఐటీ-మున్సిపల్-పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించి, లబ్ధిదారులకు అందించాడు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖామంత్రి సిహెచ్. మల్లారెడ్డి, ఎక్సైజ్ శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నరసింహ, కార్పొరేషన్ చైర్మన్లు ఇతర ప్రజాపతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[11][12]
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)