జతీంద్రనాథ్ దాస్ যতীন দাস | |
---|---|
జననం | జతీంద్రనాథ్ దాస్ 1904 అక్టోబరు 27 కలకత్తా, బ్రిటీష్ ఇండియా |
మరణం | 1929 సెప్టెంబరు 13 లాహోర్, బ్రిటీష్ ఇండియా | (వయసు 24)
మరణ కారణం | ఆమరణ నిరాహారదీక్ష |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | జతిన్, జతిన్ దాస్ |
వృత్తి | స్వాతంత్ర్య సమరయోధుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కారాగారంలో 62 రోజుల కఠిన నిరాహారదీక్ష; హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ సభ్యుడు |
జతిన్ దాస్ గా సుపరిచితుడైన జతీంద్రనాథ్ దాస్ (Bengali: যতীন দাস) (1904 అక్టోబరు 27-1929 సెప్టెంబరు 13), ఒక స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ వీరుడు. ఇతడు లాహోరు జైలులో 64 రోజుల కఠోర నిరాహారదీక్ష తరువాత మరణించాడు.
జతీంద్రనాథ్ దాస్ కలకత్తాలో 1904లో జన్మించాడు. ఇతడు చిన్నవయసులోనే బెంగాల్లోని అనుశీలన్ సమితి అనే విప్లవసంస్థలో చేరాడు. మహాత్మా గాంధీ నడిపిన సహాయ నిరాకరణోద్యమంలో కూడా పాల్గొన్నాడు.
ఇతడు కలకత్తాలోని విద్యాసాగర్ కాలేజిలో బి.ఎ.చదివే సమయంలో 1925 నవంబరులో ఇతడి రాజకీయ కార్యకలాపాల కారణంగా అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నాడు. అక్కడ రాజకీయ ఖైదీలపట్ల చూపుతున్న దురుసు ప్రవర్తనకు నిరసనగా నిరాహారదీక్ష చేపట్టాడు. 20రోజుల నిరాహారదీక్ష తరువాత జైలు సూపరింటెండెంట్ క్షమాపణ కోరడంతో ఇతడు దీక్ష విరమించాడు. దేశంలోని అన్ని ప్రాంతాలనుండి విప్లవకారులు బాంబుల తయారీకి ఇతడిని సంప్రదించేవారు. సచీంద్రనాథ్ సన్యాల్ వద్ద ఇతడు బాంబులను తయారు చేయడం నేర్చుకున్నాడు.[1]. భగత్ సింగ్, మరికొందరు విప్లవవీరులకు ఇతడు బాంబులను తయారుచేశాడు.ఇతని విప్లవ కార్యకలాపాల కారణంగా ఇతడిని 1929 జూన్ 14న అరెస్ట్ చేసి లాహోర్ జైలులో పెట్టారు.
లాహోర్ జైలులో భారతీయ ఖైదీల పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది. వారు అనేక రోజులపాటు ఉతకని, మాసిన దుస్తులను ధరించవలసి వచ్చేది. వంటశాలలో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతూ ఆహార పదార్థాలను తినడానికి హానికరంగా మార్చేవి. భారతీయ ఖైదీలకు వార్తాపత్రికలను, వ్రాసుకోవడానికి కాగితాలు ఇచ్చేవారు కాదు. కానీ అదే జైలులో బ్రిటిష్ ఖైదీల పరిస్థితి దీనికి భిన్నంగా ఉండేది. జతీంద్రనాథ్ దాస్ ఈ పరిస్థితులను గమనించి యూరోపియన్ ఖైదీలకు సమానంగా భారతీయ ఖైదీలకు సదుపాయాలను కల్పించాలని కోరుతూ మరికొందరు విప్లవకారులతో కలిసి ఆమరణ నిరాహారదీక్షను చేపట్టాడు.
ఇతని దీక్ష 1929 జూలై 13 న ప్రారంభమై 63 రోజులపాటు కొనసాగింది. జైలు అధికారులు బలవంతంగా ఇతడి దీక్షను ఇతరుల దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నించారు. చివరకు జైలు కమిటీ ఇతడిని బేషరతుగా విడుదల చేయాలని సిఫారసు చేసింది. కానీ ప్రభుత్వం దానిని త్రోసి పుచ్చుతూ బెయిల్ మీద విడుదల కావచ్చని సూచించింది.
ఇతడు 1929, సెప్టెంబరు 13వ తేదీన తుది శ్వాస విడిచాడు.[2] విప్లవ వనిత దుర్గావతి దేవి నేతృత్వంలో ఇతని అంతిమయాత్ర లాహోర్ నుండి కలకత్తా వరకు రైలులో కొనసాగింది. వేలాదిమంది ఇతడికి శ్రద్ధాంజలి ఘటించడానికి రైల్వే స్టేషన్లకు తరలివచ్చారు. హౌరా రైల్వే స్టేషన్‌లో శవపేటికను సుభాష్ చంద్రబోస్ స్వీకరించి శవయాత్రకు నేతృత్వం వహించాడు. కలకత్తాలో రెండుమైళ్ళ పొడుగున ప్రజలు బారులు తీరి ఇతడికి తుది వీడ్కోలు చెప్పారు. జతిన్ దాస్ నిరాహారదీక్ష అక్రమ నిర్బంధాలపై ప్రతిఘటనలో ఒక కీలకఘట్టంగా నిలిచింది.[3]దేశంలోని దాదాపు అందరు నాయకులు ఇతడి బలిదానానికి శ్రద్ధాంజలి ఘటించారు. సుభాష్ చంద్రబోస్ ఇతడిని "భారతదేశపు యువ దధీచి"గా అభివర్ణించాడు.