జయ జయహే తెలంగాణ

తెలంగాణ
అందె శ్రీ
ఎం.ఎం.కీరవాణి

జయ జయహే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర గీతం[1][2][3].ఈ గీతాన్ని అందెశ్రీ రచన చేశాడు.[4] ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన 'జయ జయహే తెలంగాణ' గీతం 9 చరణాలతో రాష్ట్ర గీతం ఉంటుంది. [5] పూర్తి గీతాన్ని 13:30 నిమిషాల నిడివితో ఒకటి, రాష్ట్ర అధికారిక కార్యక్రమాల్లో ఆలపించడానికి వీలుగా 2:30 నిమిషాల నిడివితో మరొక రాష్ట్ర గీతాన్ని అందె శ్రీ , ఎంఎం కీరవాణి రూపొందించారు. [6][7][8][9]

2.30 నిమిషాల రాష్ట్ర గీతం

[మార్చు]

పల్లవి:

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం[10]

ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

తరతరాల చరిత గల తల్లీ నీరాజనం

పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ


చరణం:(1)

జానపద జనజీవన జావళీలు జాలువార

కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు

జాతిని జాగృత పరచే గీతాల జనజాతర

అనునిత్యము నీగానం అమ్మనీవే మా ప్రాణం

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ


చరణం:(2)

గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగా

పచ్చని మా నేలల్లో పసిడిసిరులు పండంగా

సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి

ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ

13.30 నిమిషాల రాష్ట్ర గీతం

[మార్చు]

పల్లవి:

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం

ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

తరతరాల చరిత గల తల్లీ నీరాజనం

పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ


చరణం:(1)

పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి[11]

భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి

హాలుని గాథాసప్తశతికి ఆయువులూదిన నేల

బృహత్కథల తెలంగాణ కోటి లింగాల కోన

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ


చరణం:(2)

ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన

తెలుగులో తొలి ప్రజాకవి ‘పాలకుర్కీ’ సోమన్న

రాజ్యాన్ని ధిక్కరించి రాములోరి గుడిని గట్టి

కవిరాజై వెలిగె దిశల ‘కంచర్ల గోపన్న’

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ


చరణం:(3)

కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి

‘మల్లినాథసూరి’ మా మెతుకు సీమ కన్నబిడ్డ

ధూళికట్ట నేలినట్టి భౌద్ధానికి బంధువతడు

ధిజ్ఞాగుని గన్న నేల ధిక్కారమే జన్మహక్కు

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ


చరణం:(4)

‘పోతన’దీ పురిటిగడ్డ.. ‘రుద్రమ’దీ వీరగడ్డ

గండరగండడు ‘కొమురం భీముడే’ నీ బిడ్డ

కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప

గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగు చార్మినారు

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ


చరణం:(5)

రాచకొండ ఏలుబడిగ రంజిల్లిన రేచర్ల

‘సర్వజ్ఞ సింగ భూపాలుని’ బంగరుభూమి

వాణీ నా రాణి అంటూ నినదించిన కవి కులరవి

‘పిల్లలమర్రి పినవీరభద్రుడు’ మాలో రుద్రుడు

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ


చరణం:(6)

‘సమ్మక్క’లు ‘సారక్క’లు సర్వాయి పాపన్నలు

సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతు

ఊరూర పాటలైన ‘మీరసాబు’ వీరగాథ

దండు నిడిపే పాలమూరు ‘పండు గొల్ల సాయన్న’

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ


చరణం:(7)

కవిగాయక వైతాళిక కళల మంజీరాలు

డప్పు, ఢమరుకము, డక్కి, శారద స్వరనాదాలు

పల్లవుల చిరుజల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగ

అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ


చరణం:(8)

జానపద జనజీవన జావళీలు జాలువార

జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర

వేలకొలదిగా వీరులు నేల ఒరిగి పోతెనేమి

తరుగనిదీ నీ త్యాగం మరువనదీ శ్రమ యాగం

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ


చరణం:(9)

బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి

విరిసే జనవిజ్ఞానం నీ కీర్తిని పెంచాలి

తడబడకుండా జగాన తల ఎత్తుకొని బ్రతుక

ఒక జాతిగ నీ సంతతి ఓయమ్మ వెలగాలి.

జై తెలంగాణ  జైజై తెలంగాణ

జై తెలంగాణ  జైజై తెలంగాణ

మూలాలు

[మార్చు]
  1. "Jaya Jaya He Telangana: రాష్ట్ర గీతంగా 'జ‌య‌ జ‌య‌హే తెలంగాణ‌'." Sakshi Education. Retrieved 2024-08-09.
  2. "తెలంగాణ రాష్ట్ర గేయం ఇదే | Telangana state anthem: Jaya Jaya Hey Telangana Janani Jayakethanam Lyrics | Sakshi". www.sakshi.com. Retrieved 2024-08-09.
  3. "తెలంగాణ రాష్ట్ర గీతం ఖరారు | Telangana State New Anthem | Sakshi". www.sakshi.com. Retrieved 2024-08-10.
  4. Velugu, V6 (2024-06-02). "తెలంగాణ రాష్ట్ర గీతం రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అందెశ్రీ". V6 Velugu. Retrieved 2024-08-10.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Jaya Jayahe Telangana Lyrics: తెలంగాణ రాష్ట్ర గీతం సిద్ధం..! మార్పుల తర్వాత సరికొత్తగా 'జయ జయహే తెలంగాణ' పూర్తి పాట..!?". Samayam Telugu. Retrieved 2024-08-10.
  6. "telangana state song: 2 నిమిషాల 30 సెకన్లతో తెలంగాణ రాష్ట్ర గీతం?". EENADU. Retrieved 2024-08-09.
  7. Reddy, GV Krishna. "చరిత్రలో నిలిచిపోయేలా 'జయ జయహే తెలంగాణ' గీతం, పాడింది వీరే!". ABP Telugu. Retrieved 2024-08-10.
  8. ABN (2024-05-31). "TG: 2న ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతం జాతికి అంకితం." Andhrajyothy Telugu News. Retrieved 2024-08-10.
  9. "తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడిన యువ సింగర్స్‌ | Harika Narayan And Revanth Are Sung Telangana State Song | Sakshi". sakshi.com. Retrieved 2024-08-10.
  10. "Telangana State Anthem: తెలంగాణ రాష్ట్ర గేయం.. 13.30 నిమిషాలు.. 12 చరణాలు". Sakshi Education. Retrieved 2024-08-09.
  11. Jukanti, Prasad (2024-05-30). "తెలంగాణ రాష్ట్ర గీతం రెడీ! కొత్తగా చేపట్టిన మార్పులు చేర్పులు ఇవే". www.dishadaily.com. Retrieved 2024-08-10.