జస్సా సింగ్ అహ్లూవాలియా 1718లో జన్మించారు. ఆయన తండ్రి బదార్ సింగ్, ఆయన అహ్లూవాలియా నాలుగేళ్ళ వయసులో ఉండగా మరణించారు.[1] ఆయన తల్లి గురు గోబింద్ సింగ్ భార్య మాతా సుందరి వద్దకు ఆయనను చిన్నవయసులో ఉండగానే తీసుకువెళ్ళారు.[2][3] అప్పటికే నేర్చుకున్న మత పద్యాలు, కీర్తనలు మధుర స్వరంతో ఆలపిస్తూన్న అహ్లూవాలియా పట్ల, ఆయన గానం పట్ల మాతా సుందరి వాత్సల్యం పెంచుకున్నారు. తర్వాత జస్సా సింగ్ అహ్లూవాలియాను అప్పటికి సిక్ఖు జాతికి నాయకుడైన నవాబ్ కపూర్ సింగ్ వద్దకు మాతా సుందరి తీసుకువెళ్ళి, జస్సా సింగ్ తన కుమారుని వంటివాడని నిజమైన సిక్ఖులా పెంచమనీ కోరగా ఆయన బాధ్యత స్వీకరించారు.[4] అహ్లూవాలియా సిక్ఖు నాయకునికి అవసరమైన అన్ని లక్షణాలు అలవరుచుకుంటూ పెరిగారు. ఆయన అసా ది వర్ ఉదయాన్నే ఆలపించేవారు, ఆయన గానాన్ని దాల్ ఖల్సాకు చెందిన అందరూ అభిమానించేవారు. సిక్ఖులకు అత్యంత ప్రధానమైన సేవలోనూ అహ్లూవాలియా తనను తాను కాలం తెలియకుండా నియుక్తపరిచేవారు. ఆయన సిక్ఖుల సముదాయంలో వేగంగా ప్రాచుర్యం పొందిన వ్యక్తి అయిపోయారు. ఆయన ఢిల్లీలో పెరగడంతో, తన పగడీ (తలపాగా) ని మొఘల్ శైలిలో కట్టుకునేవారు. అహ్లువాలియా గుర్రపు స్వారీ, కత్తి సాము సుశిక్షితులైన గురువుల నుంచి నేర్చుకున్నారు.[5]
1748లో జస్సా సింగ్ అహ్లూవాలియా అన్ని మిస్ల్ లకు ప్రధాన సైన్యాధ్యక్షుడు అయ్యారు.[6] జస్సా సింగ్ అహ్లూవాలియాను సుల్తానుల్ కౌమ్ (జాతికే రాజు) అన్న బిరుదుతో గౌరవించారు.[7] జస్సా సింగ్ అహ్లూవాలియా అహ్లువాలియా మిస్ల్ కు నాయకుడు కాగా, అన్ని మిస్ల్ ల సంయుక్త రూపమైన దాల్ ఖల్సాకు అప్పటి నుంచీ నవాబ్ కపూర్ సింగ్ నాయకుడయ్యారు. ఖల్సాకు నాయకత్వం వహిస్తూ పంజాబ్ లో స్వయంపాలన వైపు నడపడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. 1761లో దాల్ ఖల్సా అహ్లూవాలియా నాయకత్వంలో చరిత్రలోనే తొలిసారిగా పంజాబ్ రాజధాని అయిన లాహోర్ను గెలిచి స్వాధీనం చేసుకుంది.[8] కొద్ది నెలల పాటు లాహోరు పాలకులై, గురు నానక్, గురు గోబింద్ సింగ్ ల పేర్ల మీద నానక్ షాహీ రూపాయి నాణాలు ముద్రించుకున్నారు.[9]
పంజాబ్, సింధ్ ప్రాంతాలు 1757 నుంచి ఆఫ్ఘాన్ పాలనలో ఉంటూవచ్చాయి. మరోవైపు పంజాబ్ లో సిక్ఖులు ఎదుగుతున్న ప్రబల శక్తి కాజొచ్చారు. తైమూర్ ఖాన్ అనే స్థానిక పాలకుడు సిక్కులను పంజాబ్ నుంచి పారదోలి, రామ్ రౌనీ అన్న వారి కోటను కూలగొట్టగలిగారు. కానీ అతని నియంత్రణ కొన్నాళ్ళకే ముగిసిపోయింది. సిక్ఖు మిసల్ లు తైమూర్ షాను, ఆయన ముఖ్యమంత్రి జలాల్ ఖాన్ ను గెలిచారు. ఆఫ్ఘాన్లు వెనక్కి తగ్గడంతో సిక్ఖులు 1758లో లాహోరును గెలుచుకున్నారు. జస్సా సింగ్ అహ్లూవాలియా సిక్ఖు సార్వభౌమాధికారాన్ని సాధించి, నాయకత్వం వహించి, ఆయన విజయాన్ని గుర్తించే నాణాలు ముద్రించారు. అహ్మద్ షా అబ్దాలీ మరాఠాలను 1761లో పానిపట్టు వద్ద యుద్ధంలో ఎదుర్కొంటూ వుండగా, సిర్హింద్, దియాల్ పూర్ ప్రాంతాలను జస్సా సింగ్ అహ్లూవాలియా దోచుకునిపోతున్నారు. జాగ్రోన్, కోట్ ఇసా ఖాన్ ప్రాంతాల్లో సట్లెజ్ ఒడ్డున విడిశారు. హోషియార్ పూర్, నారాయిన్ ఘర్ నగరాలను అంబాలాలో పట్టుకుని, కపూర్తలా పాలకుడి నుంచి కప్పం కట్టించుకున్నారు. ఆపైన ఝంగ్ వైపు దండయాత్ర సాగించారు. సియాల్ పాలకుడు గట్టి ప్రతిఘటన చేసినా, అహ్మద్ షా 1761 ఫిబ్రవరిలో దేశం విడిచి వెళ్ళేసరికి నవాబ్ జస్సా సింగ్ అహ్లూవాలియా తిరిగి సిర్హింద్ పై దాడిచేసి తన ప్రాంతాన్ని తర్ణ్ తారణ్ వరకూ విస్తరించుకున్నారు. ఆయన బియాస్ ను దాటగానే సుల్తాన్ పూర్ 1762లో గెలిచారు, అహ్మద్ షా వెనుతిరిగి వచ్చారు, గట్టి పోరాటం సాగింది. అప్పుడు జరిగిన మారణహోమాన్ని ఘలుఘరా అని పిలుస్తారు. సిక్ఖు దళాలపై పెద్ద ఎత్తున దాడి జరగగానే నవాబ్ జస్సా సింగ్ కంగ్రా కొండల్లోకి పారిపోయారు. అహ్మద్ షా అబ్దాలీ వెళ్ళిపోగానే అహ్లూవాలియా తిరిగి సిర్హింద్ ను దాడిచేసి, నేలమట్టం చేస్తూ, ఆఫ్ఘాన్ గవర్నర్ జెన్ ఖాన్ ను చంపారు. ఇది సిక్ఖులకు గొప్ప విజయంగా నిలిచి మొత్తం సిర్హింద్ ప్రదేశాన్నంతా గెలవగలిగారు.
అహ్మద్ షా 1773 జూన్లో మరణించారు. ఆయన మరణం తర్వాత పంజాబ్ లో ఆఫ్ఘాన్ బలం తగ్గిపోయింది. కాబూల్ సింహాసనం మీదికి తైమూర్ షా వచ్చారు. అప్పటికి మిస్ల్ లు పంజాబ్ లో సువ్యవస్థితం అయిపోయాయి. మిస్ల్ లు తూర్పున సహార్న్ పూర్, పశ్చిమాన అటక్, ఉత్తరాన కాంగ్రా జమ్ము ప్రాంతాలను పరిపాలించారు.