చుట్టుప్రక్కల గ్రామాలలో వ్యవసాయం ముఖ్య జీవనోపాధి. అంతే కాకుండా ఉపాధి కలిపించే మరి కొన్ని పరిశ్రమలున్నాయి - ఉదా - మహీంద్ర & మహీంద్ర, ట్రైడెంట్ షుగర్స్ (పాత పేరు నిజాం షుగర్స్), ముంగి (బస్ బాడీ బిల్డింగ్ యూనిట్). ఈ పరిశ్రమలకు తగినట్లుగా వాణిజ్య సదుపాయాలున్నాయి.అనేక గోడౌన్లు ఉన్నాయి.చుట్టుప్రక్కల గ్రామాలలో చెరకు ముఖ్యమైన పంట. జహీరాబాద్-బీదర్ దారిలో ఉన్న సిద్ధి వినాయక ఆలయం ప్రసిద్ధి చెందింది. తెలంగాణ ఊటీగా పేరొందిన గొట్టం గుట్ట ప్రాంతం ఇక్కడికి సమీపంలోనే ఉంది.
సాయినాథుని మందిరం: సర్వమతాల సారం ఒక్కటేనని, సబ్ కా మాలిక్ ఏక్ అని ప్రవచించిన సద్గురువు శ్రీ సాయినాధుడు కొలువుదీరిన మందిరం ఇక్కడ నెలకొని ఉంది. వర్ణరంజిత ప్రాకారాదులతో శోభిల్లే ఈ మందిరం, వివిధ ఉపాలయాల సమాహారంగా భాసిల్లుతోంది.
కేతకి సంగమేశ్వర ఆలయం: జహీరాబాదు పట్టణానికి సుమారు 18 కి.మీ. దూరంలో చాలా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర దేవాలయం కలదు, ఈ ఆలయం నుండి వారణాసిగంగా నదికి కాశీ లోని ఆలయం నుండి ఇక్కడి ఈ ఆలయంలోని జల ద్వారం నకు కలసి అంతర్వేదిగా ఉందని ప్రసిద్ధి. కాశీ ఆలయం లోని ఒక ఋషి ఒక కమండలాన్ని ఆ జల ద్వారంలో వదిలితే ఇక్కడి కేతకి సంగమేశ్వర ఆలయంలో తేలిందని ప్రసిద్ధి. సంవత్సరం పొడవునా ఎల్లపుడు నీటితో నిండి జల ద్వారం కలకలలాడుతు ఉంటుంది.
జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో 511 ఎకరాల్లో 1000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న తొలి పరిశ్రమ వీఈఎం టెక్నాలజీస్ పరిశ్రమ నిర్మాణానికి 2022 జూన్ 22న తెలంగాణ రాష్ట్ర ఐటీ-మున్సిపల్-పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు భూమిపూజ చేశాడు. వాయు ఈవీ పరిశ్రమను, మహీంద్రా ట్రాక్టర్లు 3 లక్షల యూనిట్ల ఉత్పత్తి పూర్తయిన సందర్భంగా కంపెనీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్మారకాన్ని ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్, రాజ్యసభ సభ్యుడు కె.ఆర్. సురేష్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ జి.బాలమల్లు, జిల్లా పరిషత్ చైర్మన్ పి. మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జిల్లా కలెక్టర్ డా.ఎ. శరత్ పాల్గొన్నారు.[6][7]
తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటులో భాగంగా మహీంద్రా గ్రూపు - ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం 1000 కోట్ల రూపాయలతో జహీరాబాద్ ప్లాంట్‌లో ఈవీ బ్యాటరీల యూనిట్ (లాస్ట్ మైల్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్) నిర్మాణానికి 2023 ఏప్రిల్ 24న కేటీఆర్ శంకుస్థాపన చేశాడు.[8][9]