జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | భారతదేశం |
ప్రారంభం | 2010 |
జరుపుకొనే రోజు | 24 ఏప్రిల్ |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి ఏటా ఇదే రోజు |
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం ఏప్రిల్ 24న భారతదేశంలో ప్రతి ఏట నిర్వహిస్తారు. పంచాయితీ రాజ్ వ్యవస్థను పటిష్ఠం చేయడంకోసం కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ అధ్వర్యంతో ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది.[1][2]
1992లో భారత రాజ్యాంగం 73వ చట్ట సవరణ జరిగింది. ఈ సవరణ ద్వారా గ్రామ, జిల్లా స్థాయిలలో గ్రామ పంచాయతీల ద్వారా పంచాయితీ రాజ్ వ్యవస్థ ఏర్పడింది. ఆ సవరణ 1993, ఏప్రిల్ 24 నుండి అమలులోకి వచ్చింది.[3] భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2010, ఏప్రిల్ 24న తొలిసారిగా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ప్రారంభించాడు.[4] పంచాయితీ రాజ్ సంస్థలు (పిఆర్ఐలు) సక్రమంగా పనిచేసి, గ్రామస్తుల అభివృద్ధి ప్రక్రియలో పాల్గొంటే ఆయా గ్రామాలు మావోయిస్టుల బెదిరింపును ఎదుర్కొవచ్చని ఆయన పేర్కొన్నాడు.
2015, ఏప్రిల్ 24న జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోడి ఎన్నికైన ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ, మహిళా సర్పంచులు వారివారి బాధ్యతలను భర్తలకు అప్పగించకూడదని, వారి పనుల విషయంలో భర్తల ప్రభావం ఉండకుండా చూసుకోవాలని పిలుపునిచ్చాడు.[5][6][7]
ఈ రోజున ఆదర్శ గ్రామంగా నిలిచిన గ్రామ పంచాయితీలను, గ్రామ సభలను శక్తీకరణ్ అవార్డు, రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ అవార్డులతో సత్కరిస్తారు.