గణపతి అగ్రహారం అన్నాదురై అయ్యర్ నటేశన్ (1873 ఆగష్టు 25 - 1948 ఏప్రిల్ 29) స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, పాత్రికేయుడు, ప్రచురణకర్త, రాజకీయ నాయకుడు. అతను G. A. నటేశన్ & కో అనే ప్రచురణ సంస్థను స్థాపించాడు. అది జాతీయవాద పుస్తకాలను ప్రచురించింది. వాటిలో ప్రముఖమైనది ది ఇండియన్ రివ్యూ.
నటేశన్ తంజావూరు జిల్లాలోని గణపతి అగ్రహారం గ్రామంలో 1873 ఆగష్టు 25 న జన్మించాడు. కుంభకోణంలో పాఠశాల విద్య అభ్యసించి, మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి ఆర్ట్స్‌లో పట్టభద్రుడయ్యాడు. ప్రచురణకర్తగా వృత్తిని ప్రారంభించాడు. 1897లో తన స్వంత పబ్లిషింగ్ కంపెనీ, G. A. నటేసన్ & కోని ప్రారంభించే ముందు అతడు గ్లిన్ బార్లో క్రింద శిక్షణ పొందాడు.[1][2]
నటేశన్ 1900 తొలి రోజుల నుండి భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. ఆంగ్లంలో ది ఇండియన్ రివ్యూ మాసపత్రికను ప్రారంభించాడు.[3] ఎక్కువగా జాతీయవాద ఇతివృత్తాలపై రచనలు చేసే ది ఇండియన్ రివ్యూలో సాహిత్య సమీక్షలు, దృష్టాంతాలు, ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయంపై కూడా రచనలు వేసేవారు. ఈ పత్రిక "ఆసక్తికరమైన అన్ని అంశాలపై చర్చకు అంకితం చేయబడింది" అని నటేశన్ మొదటి పేజీలో ప్రచారం చేశాడు.[3]
మహాత్మా గాంధీ 1915లో భారతదేశానికి వచ్చిన తర్వాత మొదటిసారిగా మద్రాసు సందర్శించినప్పుడు, అతను జార్జ్‌టౌన్‌లోని తంబు చెట్టి వీధిలో నటేశన్ ఇంట్లోనే బస చేశాడు.[4][5] అతని బస 1915 ఏప్రిల్ 17 నుండి 1915 మే 8 వరకు కొనసాగింది.[5]
తన తరువాతి జీవితంలో, నటేశన్ భావజాలంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దాంతో అతడు ఇండియన్ లిబరల్ పార్టీలో చేరాడు. 1922లో లిబరల్ పార్టీ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు.[6] 1923లో కౌన్సిల్ ఆఫ్ స్టేట్‌కు నాన్-అఫీషియల్ సభ్యునిగా నామినేట్ చేయబడ్డాడు. 1931లో రెండవసారి అతను కౌన్సిల్ ఆఫ్ స్టేట్ సభ్యునిగా ఉన్న సమయంలో, నటేశన్ కెనడాలోని ఎంపైర్ పార్లమెంటరీ అసోసియేషన్‌కు భారతీయ దళ సభ్యుడిగా పనిచేశాడు.[7][7] 1933-34లో ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ టారిఫ్ బోర్డు సభ్యునిగా కూడా నటేశన్ పనిచేశాడు.[6][8] 1938లో మద్రాసు షరీఫ్‌గా నియమితులయ్యాడు. నటేసన్ 1948 ఏప్రిల్ 29 న తన 74వ ఏట మరణించాడు. ఆయన మరణించే వరకు చురుకుగానే ఉన్నాడు.[6]