గణపతి వెంకటరమణ అయ్యర్ | |
---|---|
ಗಣಪತಿ ವೆಂಕಟರಮಣ ಅಯ್ಯರ್ | |
జననం | |
మరణం | 2003 డిసెంబరు 21 ముంబై, భారతదేశం | (వయసు 86)
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు |
|
వృత్తి | నటుడు, దర్శకుడు, రచయిత |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సంస్కృత సినిమాల దర్శకుడు |
గుర్తించదగిన సేవలు | ఆది శంకరాచార్య (1983) భగవద్గీత (1993) స్వామి వివేకానంద (1998) |
కన్నడ చలనచిత్ర భీష్మునిగా ప్రసిద్ధి చెందిన జి.వి.అయ్యర్ (సెప్టెంబర్ 3, 1917 - డిసెంబర్ 21, 2003) స్వర్ణకమల పురస్కారాన్ని పొందిన ప్రసిద్ధ చలనచిత్ర దర్శక నిర్మాత.
జి.వి.అయ్యర్ (గణపతి వెంకటరమణ అయ్యర్) కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా నంజనగూడు పట్టణంలో సెప్టెంబరు 3, 1917లో జన్మించాడు. ఇతడు తొలినాళ్లలో "సదారమ" నాటక కంపెనీలో, గుబ్బి నాటకకంపెనీలో నౌకరుగా, పోస్టర్లను వ్రాసేవాడిగా పనిచేశాడు. తరువాత అవకాశాన్ని చేజిక్కించుకున్న అయ్యర్ పూనా వెళ్లి అక్కడ హోటళ్లలో పనిచేస్తూ సినిమా అవకాశాలకై ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నాలు ఫలించక స్వంత రాష్ట్రం కర్ణాటకకు తిరిగి వచ్చాడు..
1943లో "రాధారమణ" చిత్రంలో కేశిదైత్యుని పాత్ర ద్వారా ఇతడు కన్నడ చిత్రరంగంలో కాలుమోపాడు. 1954లో విడుదలైన బేడర కణ్ణప్ప సినిమాలోని కైలాసం పాత్రలో అభినయం ద్వారా ఇతనికి ప్రజాదరణ లభించింది. సినిమాలలో నటిస్తూ నాటకాలలో కూడా క్రియాశీలకంగా ఉండేవాడు. ఇతడు 1955లో విడుదలైన "సోదరి" చిత్రానికి సంభాషణలు, పాటలు వ్రాయడం ద్వారా సినిమా రచయితగా పని చేయడం ప్రారంభించాడు. "భూదాన"(1962) చిత్రం ద్వారా దర్శకుడిగా మారాడు. కన్నడ సినిమా కళాకారులు సంకట స్థితిలో ఉన్నప్పుడు ఇతడు రాజ్‌కుమార్, బాలకృష్ణ (కన్నడ నటుడు), నరసింహరాజు (కన్నడ నటుడు) మొదలైన వారితో కలిసి "కన్నడ కలావిదర సంఘ"(కన్నడ కళాకారుల సంఘం)ను స్థాపించి కన్నడ చిత్రపరిశ్రమ నిలదొక్కుకోవడానికి మార్గాన్ని సుగమం చేశాడు. ఈ సంస్థ ద్వారా "రణధీర కంఠీరవ" అనే సినిమాను నిర్మించి దర్శకత్వం వహించాడు.
నటుడిగా, రచయితగా, నిర్మాతగా కన్నా ఇతడు దర్శకుడిగా ఎక్కువ ప్రసిద్ధి చెందాడు. సుమారు 65 సినిమాలకు దర్శకుడిగా లేదా నిర్మాతగా పనిచేశాడు. మొదటిలో విజయవంతమైన కన్నడ సినిమాలకు దర్శకత్వం వహించినా 1975 నుండి బాక్సాఫీసును ఖాతరు చేయకుండా కళాత్మక చిత్రాల నిర్మాణం చేపట్టాడు. సంస్కృత భాషలోను, హిందీ భాషలోను సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతడు దర్శకత్వం వహించిన మొదటి సంస్కృత సినిమా "ఆది శంకరాచార్య" ఉత్తమ సినిమాగా స్వర్ణకమలాన్ని తెచ్చిపెట్టింది.
ఇతని కలం నుండి జాలువారిన కొన్ని ప్రసిద్ధ కన్నడ చిత్రగీతాలు
1975లో "ఆచార్య" బిరుదును పొందిన అయ్యర్ తన జీవనశైలిని మార్చుకున్నాడు. ఆనాటి నుండి చెప్పులను త్యజించి వట్టికాళ్లతో నడిచేవాడు. ఇతడు బాణభట్టుని "కాదంబరి" కావ్యాన్ని, రామాయణ మహాకావ్యాన్ని వైజ్ఞానిక దృష్టికోణంలో చలనచిత్రాలుగా మలిచే ప్రయత్నంలో భాగంగా చర్చలకోసం ముంబై వెళ్లినప్పుడు అక్కడ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ 2003, డిసెంబర్ 21న తన 86వ యేట మరణించాడు.