జింబాబ్వేలో హిందూమతం మైనారిటీ మతం. [1]
జింబాబ్వేలో హిందూమతం 19వ శతాబ్దం చివరలో, 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వలసపాలకులు తీసుకువచ్చిన ఒప్పంద కార్మికులతో ప్రవేశించింది. జింబ్వేను బ్రిటిష్ సౌత్ ఆఫ్రికా కంపెనీ అనీ ఆ తరువాత రోడేషియా అనీ పిలిచేవారు. [2] జింబాబ్వే లోకి హిందూ వలసలు కెన్యా, ఉగాండా వంటి తూర్పు ఆఫ్రికా దేశాల్లోకి వచిన వలసల వంటివి కావు. ఆ దేశాల్లో హిందువులు ఉద్యోగాల కోసం స్వచ్ఛందంగా వలస వెళ్ళారు. వారిని కట్టిపడవేసిన పరిమిత కాలపు ఒప్పందాలేమీ లేవు. జింబాబ్వే లోకి హిందువులు దక్షిణాఫ్రికా, మారిషస్, గయానా, ట్రినిడాడ్, టొబాగోలకు వెళ్ళిన భారతీయ కార్మికుల లాగానే బానిసత్వం లాంటి ఒప్పందాలకు లోబడి వచ్చారు. [3] [4] ఈ ఒప్పంద తోటల పని కోసం వచ్చిన చాలా మంది హిందువులు ఉత్తర ప్రదేశ్, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు నుండి వచ్చారు. 1860ల నుండి 1910ల వరకు వలసరాజ్య బ్రిటిష్ ఇండియాలో ఏర్పడుతున్న పెద్ద కరువుల నుండి వాళ్ళు తప్పించుకున్నారు. ఈ కార్మికులు నిర్ణీత కాల వ్యవధిలో రద్దు చేయలేని ప్రత్యేక దాస్య ఒప్పందాలకు లోబడి వలస వచ్చారు. ఒప్పందం ముగిసాక, యజామని ఖర్చుతో భారతదేశానికి తిరిగి వెళ్లవచ్చు లేదా కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత స్థానికంగా స్థిరపది పోనూ వచ్చు. [4] చాలా మంది జీతం కోసం అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. [3]
జింబాబ్వే, స్వాహిలి తీరప్రాంతాల్లోని పురావస్తు అధ్యయనాలు రోమన్ సామ్రాజ్య కాలంలో (సా.పూ. 1వ సహస్రాబ్ది) భారతీయ వ్యాపారులు కొద్దిస్థాయిలో ఉండేవారని, ఆఫ్రికన్ ప్రజలతో వారికి అప్పుడప్పుడు పరస్పర సంపర్కం ఉండేదని తెలుస్తోంది. యూరోపియన్ వలసవాద శకానికి చాలా కాలం ముందు నుంచే వారు అక్కడ ఉండేవారని సూచించే ఆధారాలు లభించాయి. [5] [6] [7] అదేవిధంగా, జన్యు అధ్యయనాలు ప్రత్యక్ష ప్రాచీన ఆఫ్రికన్-భారతీయ వాణిజ్యాన్ని, సహకారాన్ని సూచిస్తున్నాయి. ఎందుకంటే సా.పూ. 1వ సహస్రాబ్ది నాటికే ఆఫ్రికా పంటలను భారతదేశంలో పండించారు. భారతీయ పంటలతో పాటు పెంపుడు జంతువులైన జీబు ఆవు (బాస్ ఇండికస్) ఆఫ్రికాలో ప్రవేశించింది. అయితే ఆ కాలంలో ఇవి ఉత్తర ఆఫ్రికాలో లేవు. [8] జింబాబ్వే హైలాండ్స్‌లోని షోనా ప్రజలలో బంగారు గనులు, ప్రాసెసింగ్ పద్ధతుల అభివృద్ధి చెందడంతో 12వ శతాబ్దానికి ముందు సోఫాలా నగరం ద్వారా భారతదేశంతో దాని వ్యాపార కార్యకలాపాలను పెరిగాయి. [9] అయితే, ఈ వ్యాపారులు మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనలేదు; తమ మతాన్ని తమ వ్యక్తిగత అంశం గానే ఉంచుకున్నారు. [9] [10]
హిందూమతం జింబాబ్వేకు తీసుకువచ్చిన ఒప్పంద కార్మికులతో వచ్చింది. స్థానిక నైపుణ్యం కలిగిన కార్మికులు అందుబాటులో లేనందున తోటల పెంపకం లోను, మైనింగ్ ప్రాజెక్టుల లోనూ సహాయం చేయడానికి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించడానికి, సేవలు, రిటైల్ మార్కెట్లను స్థాపించడానికీ పరిపాలనా మద్దతు కోసమూ వీరిని తీసుకువచ్చారు.. [11] [12] [13] వలసదారులు, కొంతమంది విద్యావంతులు, నైపుణ్యం ఉన్నవారు. కానీ చాలా వరకు పేదలు, భారతదేశంలోని కరువు పీడిత ప్రాంతాలలో అల్లాడుతున్నవారు. ఆకలి నుండి తప్పించుకోవడానికి యూరోపియన్ల యాజమాన్యంలోని తోటలలో పని చేయడానికి వచ్చారు. [12]
ప్రొఫెసరు ఎజ్రా చిటాండో ప్రకారం, జింబాబ్వేలో హిందూమతం, ఆఫ్రికన్ సాంప్రదాయ మతాలు రెండింటితో యూరోపియన్ క్రైస్తవుల మధ్య 19వ శతి లోను, 20వ శతాబ్దపు ప్రారంభంలోనూ జరిగిన సంబంధాలు సంక్లిష్టమైనవి. సాధారణంగా హిందూమతం, ఆఫ్రికన్ మతాలు రెండింటినీ దెయ్యాలుగాను, అమానవీయంగానూ చిత్రించేవారు. అయితే క్రైస్తవ మిషనరీలు హిందూ మతాన్ని లేదా ఆఫ్రికన్ మతాలను పూర్తిగా తిరస్కరించలేదు. [14] ఈ రెండింటిలోనూ ఉన్న కొన్ని సానుకూల అంశాలను గుర్తించారు. అయితే హిందూ భారతీయ కార్మికులు, స్థానిక ఆఫ్రికన్‌లను "వారి సంప్రదాయాలను విడిచిపెట్టి, క్రైస్తవ వాస్తవికతను స్వీకరించాలని" పిలుపునిచ్చారని చిటాండో అన్నాడు. [15] క్రిస్టియన్ మిషనరీ విధానానికి విరుద్ధంగా, హిందూమతం లేదా ఆఫ్రికన్ సాంప్రదాయ మతాలు తమ విధానాలు లేదా లక్ష్యాలలో మిషనరీల పద్ధతులు లేవు. [16]
1995 నాటికి జింబాబ్వేలో దాదాపు 16,200 మంది హిందువులు ఉన్నారు. తరువాతి కాలంలో ఇది 3,000 కు తగ్గింది. వారు ఎక్కువగా హరారే రాజధాని నగరంలో ఉన్నారు. [17]
జింబాబ్వేలోని హిందువులకు హిందు సొసైటీ హరారే (HSH) ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది 1916 లో నమోదైన హిందూ మతం సంక్షేమ సంస్థ [18] హిందూ మత, సాంస్కృతిక సంస్థ (HRCI) ను 60 సంవత్సరాల క్రితం స్థాపించారు. ఇది జింబాబ్వేలోని హిందూ కుటుంబాలలో జన్మించిన పిల్లలకు సనాతన ధర్మాన్ని బోధించడానికి అంకితమైన సంస్థ. హిందువులు కానివారు కూడా అక్కడ చదువుకోవచ్చు. [19]
జింబాబ్వేలో రెండు హిందూ దేవాలయాలు ఉన్నాయి. హరారేలోని ఓంకార్ దేవాలయం జింబాబ్వేలోని మొదటి హిందూ దేవాలయం. 1929 లో దీని నిర్మాణం మొదలైంది [20]
హరారేలోని "హిందూ మత, సాంస్కృతిక సంస్థ" జింబాబ్వేలోని హిందూ కుటుంబాలలో జన్మించిన పిల్లలకు సనాతన ధర్మాన్ని నేర్పిస్తుంది. హిందువులు కాని వారిని స్వాగతించింది. హరారేలో దాదాపు 3,000 మంది ఉన్న హిందూ సమాజపు ప్రధాన కేంద్రాలలో వివిధ పాఠశాలలు, గోవానీస్ అసోసియేషన్, హిందూ సొసైటీ, తమిళ్ సంగం, బ్రహ్మ కుమారీస్ యోగా కేంద్రాలు, రామకృష్ణ వేదాంత సొసైటీ ఉన్నాయి . [21] [22] [23] ఇస్కాన్‌కు మరోండేరాలో ఒక కేంద్రం ఉంది.