జె. డి. చక్రవర్తి | |
---|---|
![]() | |
జననం | నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి 1972 ఏప్రిల్ 16 |
ఇతర పేర్లు | జె. డి. , గడ్డం చక్రవర్తి |
వృత్తి | నటుడు, దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1989–ఇప్పటివరకు |
జీవిత భాగస్వామి | అనుకృతి గోవింద్ శర్మ |
జె. డి. చక్రవర్తి ఒక భారతీయ సినీ నటుడు, దర్శకుడు. అసలు పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. రామ్ గోపాల్ వర్మ మొదటి చిత్రం శివ సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు.[1] శివ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు తెలుగుతోను తమిళంతో పాటు హిందీలో కూడా అవకాశాలు వచ్చాయి. కొన్నాళ్ళు ప్రతినాయకుడిగా, సహనటుడిగా నటించాడు. వన్ బై టూ, మనీ మనీ, గులాబీ చిత్రాలతో కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత వచ్చిన మృగం, దెయ్యం, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా చిత్రాలతో మరిన్ని విజయాలు అందుకున్నాడు.[2]
హైదరాబాదు లోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో కర్ణాటక సంగీత విద్వాంసురాలైన డాక్టర్ శాంత కోవెల నాగులపాటి, నాగులపాటి సూర్యనారాయణ దంపతులకు జన్మించాడు. పాఠశాల విద్యను హైదరాబాదులోని సెయింట్ జార్జ్స్ గ్రామర్ పాఠశాల లో, ఇంజనీరింగ్ విద్యను చైతన్య భారతి కళాశాల లో పూర్తి చేశాడు.[3][4][5][6]
1989లో రాంగోపాల్ వర్మ చిత్రం శివ చిత్రంలో ప్రతినాయక పాత్ర అయిన విద్యార్థి నాయకుడు జె. డి. పాత్రను పోషించడంతో ఇతని సినీ నట ప్రస్థానము ప్రారంభమైంది. తర్వాత ఒక మలయాళ చిత్రం ఎన్నొందిష్టం కూడమో లో సహాయక పాత్రను పోషించాడు. 1998 జూలై 3 న తెలుగు, హిందీ భాషలలో విడుదలైన సత్య చిత్రం ఇతనికి మంచి పేరును తీసుకువచ్చింది.[7]