ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
జెన్నీ | |
---|---|
జననం | పోలాప్రగడ జనార్ధన రావు |
పిల్లలు | 2 |
తల్లిదండ్రులు |
|
జెన్నీ గా పేరుగాంచిన పోలాప్రగడ జనార్ధనరావు ఒక ప్రముఖ సినీ, టీవీ నటుడు, మూకాభినయ (మైమ్) కళాకారుడు.[1] 400 కి పైగా సినిమాలు, 1000 కి పైగా టీవీ కార్యక్రమాల్లోనూ నటించాడు. 100 దాకా రేడియో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.[2]
జనార్ధన రావు రాజమండ్రికి సమీపంలోని ఆలమూరు లో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పోలాప్రగడ సుబ్బారావు, లక్ష్మీదేవి దంపతులకు పదిమంది సంతానంలో ఒకడుగా జన్మించాడు. మచిలీపట్నంలో పీయూసీ చదివాడు. బడిలో ఉన్నప్పుడు ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో జాతీయ స్థాయిలో పాల్గొన్నాడు. భీమవరంలో బీ.కాం, హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.కాం చదివాడు. తరువాత ఆయనకు ఇసిఐఎల్ లో అసిస్టెంటు డైరెక్టరుగా ఉద్యోగం లభించింది.[3] ఉద్యోగ బాధ్యతల వలన సినీరంగం పై ఎక్కువ దృష్టి సారించలేదు. 2000 లో తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశాక సినిమాల మీద దృష్టి కేంద్రీకరించేందుకు సమయం చిక్కింది. ఆయనకు ఇద్దరు పిల్లలు; ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అబ్బాయి బ్యాంకింగ్ రంగంలో స్థిరపడ్డాడు. అమ్మాయికి వివాహమైంది.
ఆయన పదో ఏటనే నాటకాల్లో నటించడం మొదలుపెట్టాడు. యువనటుడిగా ఎదిగిన తర్వాత సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ప్రముఖ దర్శకుడు జంధ్యాల ఈయన ప్రదర్శిస్తున్న ఒక నాటకానికి అతిథిగా వచ్చి అహ నా పెళ్ళంట సినిమాలో అవకాశం ఇచ్చాడు. అప్పుడే తెలుగు సినీ పరిశ్రమ నెమ్మదిగా మద్రాసు నుండి హైదరాబాదుకు మారుతుంది. నటులను మద్రాసు నుండి హైదరాబాదుకు తీసుకురావడం ఖర్చుతో కూడుకున్న పని అవడంతో హైదరాబాదులో ఉన్న నటులకు అవకాశాలు పెరిగాయి. అప్పట్లో అక్కడ ఈసీఐఎల్ లో ఉద్యోగం చేస్తున్న జెన్నీకి వరుసగా అవకాశాలు వచ్చాయి.
యమలీల లో ఆయన పోషించిన పత్రికా సంపాదకుడి పాత్ర మంచి పేరు తీసుకు రావడంతో వరుసగా అలాంటి పాత్రల్లోనే అవకాశాలు వచ్చాయి. మరొక సినిమాలో చర్చి ఫాదర్ వేషం ఆదరణ పొందడంతో ఆయన నటించిన దాదాపు 400 సినిమాల్లో సుమారు 100 సినిమాల్లో చర్చి ఫాదర్ వేషం వేయాల్సి వచ్చింది.[4]
ఆయన సినిమా రంగానికి వచ్చిన కొత్తల్లో సహాయ దర్శకులుగా ఉన్న శ్రీను వైట్ల, వి. వి. వినాయక్ లాంటి దర్శకులు ఆయన్ను గుర్తుంచుకుని ఇప్పటికీ తమ సినిమాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు.
శంకరమంచి పార్థసారధి అనే రచయిత, తల్లావజ్జల సుందరం అనే నాటక దర్శకుడితో కలిసి శ్రీమురళీ కళా నిలయం పేరుతో ఇప్పటికీ నాటక ప్రదర్శనలిస్తున్నాడు. మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లోను, నిజాం కాలేజీలోనూ థియేటర్ ఆర్ట్స్ ఫ్యాకల్టీగా కూడా పనిచేస్తున్నాడు. రచయితగా యాభైకి పైగా కథలు రాశాడు. అందులో ఓ పదిహేను కథలు బహుమతిని గెలుచుకున్నాయి.