జేమ్స్ అఖిలీస్ కర్క్‌పాట్రిక్ | |
---|---|
![]() జేమ్స్ అఖిలీస్ కర్క్‌పాట్రిక్, 1805లో జార్జ్ చిన్నెరీ గీసిన తైలవర్ణ చిత్రం | |
జననం | 1764 ఫోర్ట్ సెయింట్ జార్జ్, మద్రాసు |
మరణం | 15 అక్టోబరు 1805 కలకత్త, బెంగాల్ ప్రెసిడెన్సీ |
జాతీయత | బ్రిటీషు |
వృత్తి | లెఫ్టెనెంట్ కల్నల్ హైదరాబాదు రాజ్యంలో బ్రిటీషు రెసిడెంటు |
ప్రసిద్ధి | హైదరాబాదులో చారిత్రక కోఠి బ్రిటీషు రెసిడెన్సీని నిర్మించాడు. హైదరాబాదులో ప్రముఖ కుటుంబానికి చెందిన ఖైరున్నీసా బేగంతో జాత్యాంతర ప్రేమ, వివాహము. |
భార్య / భర్త | ఖైరున్నీసా |
పిల్లలు | కిట్టీ కర్క్‌పాట్రిక్ విలియం కర్క్‌పాట్రిక్ |
తండ్రి | కల్నల్ జేమ్స్ కర్క్‌పాట్రిక్ |
లెఫ్టినెంట్-కల్నల్ జేమ్స్ అఖిలీస్ కర్క్‌పాట్రిక్ (1764-15 అక్టోబర్ 1805) ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి, దౌత్యవేత్త. 1798 నుండి 1805 వరకు హైదరాబాద్ దక్కన్ రాజ్యంలో బ్రిటీషు రెసిడెంట్‌గా పని చేశాడు. కర్క్‌పాట్రిక్ హైదరాబాదులో కోఠి రెసిడెన్సీ నిర్మాణానికి ఆదేశించాడు. ఇది అప్పటి నుండి నగరంలో ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది.[1]
జేమ్స్ అఖిలీస్ కర్క్‌పాట్రిక్ 1764లో మద్రాసు ఫోర్ట్ సెయింట్ జార్జ్లో జన్మించాడు.[2] ఈయన తన సోదరుడు విలియం స్థానంలో 1795లో హైదరాబాద్ వచ్చి, తనకు ముందు తన సోదరుడి ఆధీనంలో ఉన్న బ్రిటీషు రెసిడెంట్ పదవిని చేపట్టాడు. హైదరాబాదులో తన ప్రారంభమైన కొన్ని నెలల్లోనే, జేమ్స్ హైదరాబాద్ నిజాం ఆస్థానంలో ఇండో-పర్షియన్ సంస్కృతి పట్ల ఆకర్షితుడయ్యాడు. తన యూరోపియన్ దుస్తులకు బదులుగా పర్షియన్ దుస్తులకు ధరించడం ప్రారంభించాడు.[3]
ప్రెసిడెన్సీ సైన్యంలో కల్నల్ అయినప్పటికీ, కర్క్‌పాట్రిక్ ఇంట్లో మొఘలాయి దుస్తులను ధరించేవాడు, హుక్కాతో ధూమపానం చేసేవాడు, పాన్ నమిలేవాడు, నాచ్ పార్టీలను ఆస్వాదించేవాడు. తన జననాఖానాలో ఒక చిన్న అంతఃపురాన్ని కూడా నిర్వహించేవాడు. భారతదేశంలో జన్మించిన కర్క్‌పాట్రిక్ బ్రిటన్‌లో చదువుకున్నాడు. తమిళాన్ని తన ప్రాథమిక భాషగా మాట్లాడేవాడు. ఉర్దూలో కవిత్వం రాశాడు. పర్షియన్, హిందుస్తానీ భాషలను తన "భాషా అమ్ములపొదికి" జోడించాడు.[4]
హిందుస్తానీ, పర్షియన్ భాషలలో ఉన్న పట్టుతో, ఆయన హైదరాబాద్లోని సామాజిక ఉన్నత వర్గాలతో బహిరంగంగా కలిసిమెలిసి ఉండేవాడు. కర్క్‌పాట్రిక్ ను హైదరాబాద్ నిజాం దత్తత తీసుకుని, ఈయనకు అనేక బిరుదులను ప్రసాదించాడు: ముతామినుల్ ముల్క్ ('రాజ్య రక్షణ') హష్మత్ జంగ్ ('యుద్ధంలో ధైర్యవంతుడు') నవాబ్ ఫ్రక్రుద్దౌలా బహదూర్ ('గవర్నర్, రాజ్య గర్వము, హీరో').[5]
కింగ్ జార్జ్ III పాలనలో, కర్క్‌పాట్రిక్ యొక్క హుక్కా-బార్దార్ (హుక్కా సేవకుడు / సిద్ధంచేసేవాడు) కర్క్‌పాట్రిక్ ను దోచుకుని మోసం చేసి, ఇంగ్లాండుకు వెళ్లి, తనను తాను సిల్హెట్ యువరాజూగా ప్రకటించుకున్నట్లు చెప్పబడింది. ఆ వ్యక్తిని ప్రధాన మంత్రి విలియం పిట్ ది యంగర్ వేచి ఉండి, డ్యూక్ ఆఫ్ యార్క్ తో విందు చేయించి, తరువాత రాజదర్శనానికి తీసుకువెళ్ళారు.[6]
1800లో, ఖైరున్నీసా అనే స్థానిక హైదరాబాదీ సయ్యిదా కులీన మహిళతో ప్రేమలో పడిన తరువాత, ఆమెను వివాహం చేసుకోవడమే కాకుండా, కర్క్‌పాట్రిక్ ముస్లిం షరియా చట్టం ప్రకారం "మొఘల్ దుస్తులు, జీవన విధానాలను స్వీకరించడమే" కాకుండా, "ఇస్లాం మతంలోకి మారాడు". ఈస్ట్ ఇండియా కంపెనీకి, హైదరాబాదీలకు ఇరుపక్షాలతో పనిచేసే డబుల్ ఏజెంట్ అయ్యాడు.[7]
కర్క్‌పాట్రిక్ చాలా సన్నిహిత, గోప్యమైన ముస్లిం వివాహ వేడుకలో పద్నాలుగు సంవత్సరాల వయసున్న ఖైరున్నీసాను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహ వయస్సు, అప్పటి హైదరాబాదీ సమాజంలో ఆమె సామాజిక వర్గానికి చెందిన అమ్మాయికి అసాధారణం కాదు. ఖైరున్నీసా హైదరాబారు ప్రధాని నవాబ్ మహమూద్ అలీఖాన్ మనవరాలు. ఏదేమైనా, ఈ వివాహం నమోదు చేయబడలేదు. అంతే కాకుండా చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యేదిగా కనిపించలేదు. కర్క్‌పాట్రిక్ తన వీలునామాలో ఈ వివాహం ద్వారా కలిగిన సంతానాన్ని తన "సహజమైన" పిల్లలు అని వర్ణించాడు. ఇది చట్టవిరుద్ధమైన సంబంధాల ద్వారా కలిగిన పిల్లలను తండ్రి తన సొంత సంతానంగా గుర్తించాడనటానికి మర్యాదపూర్వకమైన సభ్యోక్తి.[8] తన వీలునామాలో, కర్క్‌పాట్రిక్ ఖైరున్నీసా పట్ల తన భక్తిని నొక్కిచెప్పాడు. ఆమె ఆభరణాలతో పాటు, తండ్రి నుండి వారసత్వంగా పొందిన పెద్ద భూస్వామ్య సంపదను కలిగి ఉన్నందున, ఆమెకు చిన్న నామమాత్రపు వారసత్వాన్ని మాత్రమే వదిలిపెట్టానని చెప్పాడు. బదులుగా వారి ఇద్దరు పిల్లలకు తన సంపదనంతా వదిలిపెట్టాడు. వారి తండ్రి ఊహించని, అకాల మరణానికి ముందు, పిల్లలిద్దరినీ 3, 5 సంవత్సరాల వయస్సులలో, ఆ కాలంలో భారతదేశంలోని ఇతర బ్రిటిష్ కుటుంబాలలాగే, ఇంగ్లాండ్లోని కర్క్‌పాట్రిక్ బంధువులచే పెంచడానికి పంపారు.[9]
"హష్మత్ జంగ్ ముస్లిం సిబ్బంది, వధువు యొక్క స్త్రీ బంధువులు, ఈయన షియా ముజ్తాహిద్ ముందు రహస్యంగా ఇస్లాం స్వీకరించాడని నమ్మారు. ఈయన తన నుండి ఒక ధృవీకరణ పత్రాన్ని ఖైరున్నీసా బేగంకు సమర్పించాడని చెబుతారు. ఆమె దానిని తన తల్లికి పంపింది". 1801 శరదృతువు చివరలో, హైదరాబాద్ కోర్టులో కర్క్‌పాట్రిక్ ప్రవర్తనపై కలకత్తాలో ఒక పెద్ద దుమారం చెలరేగింది.[10] ఈ జాత్యాంతర, వర్ణాంతర వివాహం కారణంగా ఒక వివాదం తలెత్తింది.[9]
కర్క్‌పాట్రిక్ రెసిడెంట్‌గా పనిచేసిన పరిస్థితులు, భారత గవర్నర్ జనరల్‌గా లార్డ్ రిచర్డ్ వెల్లెస్లీ నియామకం వల్ల ప్రభావితమయ్యాయి. వెల్లెస్లీ నిజాంతో దృఢమైన దౌత్య వైఖరిని అవలంబించాలని భావించాడు. దీనిలో భాగంగా నిజాం స్వయంప్రతిపత్తిని తగ్గించడం కూడా ఒక వ్యూహం. దానితో పాటు, ఖైరున్నీసాతో కర్క్‌పాట్రిక్ వివాహాన్ని వెల్లెస్లీ తీవ్రంగా వ్యతిరేకించాడు.[9]
కర్క్‌పాట్రిక్ 1805 అక్టోబరు 15న కలకత్తాలో మరణించిన తరువాత, అప్పటికి కేవలం 19 సంవత్సరాల వయస్సులో ఉన్న ఖైరున్నీసా, కర్క్‌పాట్రిక్ సహాయకుడైన హెన్రీ రస్సెల్తో కొంతకాలం ప్రేమ వ్యవహారం కలిగి ఉన్నది. హెన్రీ రస్సెల్ ఆ తర్వాత 1810లో హైదరాబాద్ రెసిడెంటు అయ్యాడు. రస్సెల్ ఈ తాత్కాలిక సంబంధం తరువాత, ఖైరున్నీసాను విడిచిపెట్టి, ఒక అర్ధ-పోర్చుగీస్ మహిళను వివాహం చేసుకున్నాడు. దానితో ఆమె పరువు నాశనమవడంతో పాటు, ఆమె తండ్రి నుండి వారసత్వంగా పొందిన విలువైన భూస్వామ్యాలను అత్యాశగల బంధువులు స్వాధీనం చేసుకోకుండా నిరోధించలేకపోయారు.[11] రస్సెల్‌తో ప్రేమ వ్యవహారం ఫలితంగా అవమానకరమైన మహిళగా, అజ్ఞాతంలోకి వెళ్లిన ఖైరున్నీసాను ఆమె కుటుంబం కొన్ని సంవత్సరాలు పాటు హైదరాబాదుకు తిరిగి రావడానికి అనుమతించనప్పటికీ, ఒక పెద్దాయన మరణం తరువాత ఆమె చివరికి తిరిగి రావడానికి అనుమతి పొందింది. ఖైరున్నీసా 1813 సెప్టెంబర్ 22 న 27 సంవత్సరాల వయసులో హైదరాబాద్లో మరణించింది.[5]
కర్క్‌పాట్రిక్, ఖైరున్నీసాలకు ఇద్దరు పిల్లలు కలిగారు: ఒక కుమారుడు, మీర్ గులాం అలీ సాహిబ్ అల్లమ్, ఒక కుమార్తె, నూరున్నీసా సాహిబ్ బేగం. కర్క్‌పాట్రిక్ చిన్న వయస్సులోనే ఆయన ఊహించని మరణం సంభవించడానికి కొంతకాలం ముందు, పిల్లలను తన తండ్రి కల్నల్ జేమ్స్ కర్క్‌పాట్రిక్ తో కలిసి లండన్ లో, కెస్టన్, కెంట్ లో నివసించడానికి ఇంగ్లాండుకు పంపారు. ఈ ఇద్దరు పిల్లలు 1805 మార్చి 25న మార్లీబోన్ రోడ్ లోని సెయింట్ మేరీ చర్చిలో బాప్తిస్మం పొందారు, ఆ తరువాత నుండి కొత్తగా ఇచ్చిన క్రైస్తవ పేర్లతో విలియం జార్జ్ కర్క్‌పాట్రిక్, కేథరీన్ అరోరా "కిట్టి" కర్క్‌పాట్రిక్ అని పిలువబడ్డారు. 1812లో వేడినీటి రాగి గంగాలంలో పడటంతో విలియం వికలాంగుడయ్యాడు. అతని చేయిని తొలగించాల్సి వచ్చింది. విలియం వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలను కలిగి ఉన్నాడు, కానీ 1828లో 27 సంవత్సరాల వయసులో మరణించాడు.[12] కిట్టీ కొన్ని సంవత్సరాలు స్కాటిష్ రచయిత, తత్వవేత్త థామస్ కార్లైల్ తో ప్రేమ వ్యవహారం నడిపింది. కానీ అప్పట్టికి పెద్దగా సంపాదనలేక, ట్యూషన్లు చెప్పుకుంటూ బ్రతుకుతున్న యువకుడిగా, పెద్ద కుటుంబపు వారసురాలితో పొసగలేదు. ఆమె కెప్టెన్ జేమ్స్ విన్స్లో ఫిలిఫ్స్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఏడుగురు సంతానం కలిగారు. ఆమె 1889లో డెవాన్ లోని టోర్క్వేలో మరణించింది.[13]
చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ రాసిన శ్వేత మొఘలులు (వైట్ మొఘల్స్) పుస్తకంలో ఎక్కువ భాగం ఖైరున్నీసాతో కర్క్‌పాట్రిక్ సంబంధంతో ముడిపడి ఉన్నది.
{{cite book}}
: ISBN / Date incompatibility (help)