జై లవకుశ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.రవీంద్ర |
రచన | కె.ఎస్.రవీంద్ర కోన వెంకట్ కె.చక్రవర్తి |
నిర్మాత | నందమూరి కళ్యాణ్‌రాం |
తారాగణం | జూనియర్ ఎన్.టి.ఆర్ రాశి ఖన్నా నివేదా థామస్ |
ఛాయాగ్రహణం | ఛోటా కె.నాయుడు |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు తమ్మిరాజు |
సంగీతం | దేవిశ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(నైజామ్)[1] |
విడుదల తేదీ | 21 సెప్టెంబరు 2017 |
సినిమా నిడివి | 153 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | est. అంచనా ₹129 కోట్లు [2] |
జై లవకుశ 2017లో విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా చలనచిత్రం. ఈ సినిమాకు కథను, దర్శకత్వాన్ని కె.ఎస్.రవీంద్ర (బాబీ) అందించాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్.టి.ఆర్ త్రిపాత్రాభనయం చేశాడు. రాశి ఖన్నా, నివేదా థామస్ ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ సినిమా ద్వారా హిందీ చలనచిత్ర, టెలివిజన్ నటుడు రోనిత్ రాయ్ తెలుగు తెరకు విలన్‌గా పరిచయం అయ్యాడు. ఈ చిత్రాన్ని జూనియర్ ఎన్.టి.ఆర్. అన్న నందమూరి కళ్యాణ్‌రాం ఎన్.టి.ఆర్.ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించాడు. ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు ఛాయాగ్రాహకుడు కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పనిచేశాడు.
జై, లవ, కుశ (ఎన్టీఆర్) ముగ్గురు కవలలు. నాటకాలు వేయడం అంటే ముగ్గురికి ప్రాణం. తన మేనమామ (పోసాని కృష్ణమురళి) నేతృత్వంలో నాటకాలు ఆడుతుంటారు. అయితే జైకి పుట్టుకతోనే నత్తి. నత్తి కారణంగా జైని తన మేనమామ తొక్కేస్తాడు. తనకు గుర్తింపు లేకుండా పోవడంతో, జై తన సోదరులు లవ, కుశలపై కోపం పెంచుకొంటాడు. ఓ నాటకం ప్రదర్శిస్తుండగా వారిని చంపడానికి సిలెండర్ పేల్చుతాడు. ఆ ఘటన వల్ల ముగ్గురు సోదరులు విడిపోతారు. వారు అలా వేర్వేరు ప్రదేశాల్లో పెరిగి పెద్దవుతారు. లవ బ్యాంక్ ఆఫీసర్‌గా, కుశ చిల్లర దొంగగా మారుతారు. ఆ క్రమంలో కష్టాల్లో ఉన్న లవ, కుశ ఓ ప్రమాదం సందర్భంగా కలుసుకొంటారు. మంచితనం ఎక్కువగా ఉండే లవ అడిగిన వారందరికీ అప్పులు ఇచ్చి ఇబ్బందుల్లో కూరుకుంటాడు. దొంగతనాలు చేసి డబ్బు సంపాదించి అమెరికాకు వెళ్లాలన్న కుశ ప్రయత్నానికి నోట్ల రద్దు గండికొడుతుంది. తమ్ముడిని మోసగించి డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేసి సక్సెస్ అవుతాడు. కానీ చివరి క్షణంలో డబ్బు మాయం అవుతుంది. అలా కథ నడుస్తున్న క్రమంలో ప్రియ (రాశిఖన్నా)తో లవ ప్రేమలో పడుతాడు. పెళ్ళి చేసుకొందామనే క్రమంలో ప్రియ అదృశ్యమవుతుంది. లవకు తమ్ముడు కుశుడి మీద, కుశుడికి అన్న లవ మీద అనుమానం కలుగుతుంది. కానీ వారిద్దరూ తప్పు చేయలేదని గ్రహిస్తారు. తన మాదిరిగానే ఉండే వ్యక్తి తన ప్రియను ఎత్తుకెళ్లి ఉంటారని గ్రహిస్తారు. అంటే తమ అన్న ఇంకా బతికి ఉన్నాడనే నమ్మకం కలిగిన నేపథ్యంలో జై పాత్ర ప్రవేశిస్తుంది. అంతలోనే లవ, కుశలను జై కిడ్నాప్ చేస్తాడు. చిన్నతనంలో తనకు గుర్తింపు లేకుండా చేసిన తమ్ముళ్లపై జై కక్ష పెంచుకొంటాడు. జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలన్న లక్ష్యానికి సహకరించాలని వారిని జై ఆదేశిస్తాడు. సొంత సోదరులను, ప్రియను జై ఎందుకు కిడ్నాప్ చేశాడు.. జై లక్ష్యం ఏమిటి? అన్నయ్య లక్ష్యానికి తమ్ముళ్లు చేసిన ఎలాంటి సహకారం అందించారు. తమ్ముళ్లు, మేనమామ వివక్ష కారణంగా రావణుడిగా మారిన జై మళ్లీ మంచివాడిగా మారతాడా? రావణుడిగా మారిన తన అన్నను రాముడిగా మార్చాలన్న లవ, కుశల ప్రయత్నం ఫలించిందా? రావణుడు మళ్లీ రాముడిగా మారాడా? ముగ్గురు అన్నదమ్ములు ఒక్కటవుతారా? ప్రియతో లవ్ పెళ్ళి అవుతుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.[3]
జనతా గ్యారేజ్ విజయం తర్వాత జూనియర్ ఎన్.టి.ఆర్. రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ ఒక సినిమా తీయబోతున్నట్లు 2016 మే 20న ప్రకటించాడు.[6] అయితే నందమూరి సోదరులకు (కళ్యాణ్‌రాం, ఎన్టీఆర్) స్క్రిప్టు నచ్చని కారణంగా ఆ ప్రాజెక్టు అటకెక్కినట్లు సెప్టెంబరు 2016 నాటికి వార్తలు వెలువడ్డాయి.[7] తరువాత "పటాస్", "సుప్రీమ్" చిత్రాల ఫేమ్ అనిల్ రావిపూడి ఎన్టీఆర్‌తో సినిమా తీయడానికి ఉత్సాహం చూపి ఒక కథను ఆయనతో చర్చించాడు. దానిలో ఎన్టీఆర్ అంధుని పాత్ర వేయాల్సి ఉంది. అయితే ఆ కథ నచ్చక మరొక కొత్త అయిడియాతో రమ్మని అనిల్‌ను కోరాడు. దానికి అతడు వెంటనే స్పందించాడు.[8] తరువాతి పరిణామాలలో పవర్ దర్శకుడు కె.ఎస్.రవీంద్ర కూడా ఎన్టీఆర్ సినిమాను డైరెక్ట్ చేసేందుకు పోటీకి రావడంతో అనిల్, రవీంద్రలలో ఒకరిని ఎన్నుకునే పరిస్థితి ఎన్టీఆర్‌కు ఏర్పడింది.[9] చివరకు ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 27వ చిత్రానికి కె.ఎస్.రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నట్లు నందమూరి కళ్యాణ్‌రాం ట్విట్టర్‌లో ప్రకటించాడు. తమ సోదరుని 27వ చిత్రం స్వంత బ్యానర్ ఎన్.టి.ఆర్.ఆర్ట్స్ ద్వారా భారీ బడ్జెట్, ఉత్తమ సాంకేతిక విలువలతో నిర్మాణం చేపట్టడం తనకు ఆనందంగా ఉందని, నిర్మాణం 2017 సంక్రాంతి తర్వాత ప్రారంభమౌతుందని ఆ సందేశంలో కళ్యాణ్‌రాం పేర్కొన్నాడు..[10]
కె.ఎస్.రవీంద్ర ఈ సినిమాకు సంతకం చేశాక, ఛాయాగ్రాహకుడిగా 3 ఇడియట్స్, పి.కె. సినిమాలకు పనిచేసిన సి.కె.మురళీధరన్‌ను తీసుకుంటున్నట్టు సినిమా టీమ్ ప్రకటించింది.[11] రాశి ఖన్నా ఎన్.టి.ఆర్‌కు జంటగా ప్రధాన పాత్రను పోషించడానికి అంగీకారం తెలిపింది.[12] కొన్ని రోజుల తర్వాత ఎన్.టి.ఆర్.ను కొత్త రూపంలో చూపేందుకు బాలీవుడ్ నిపుణుడు వాన్స్ హార్ట్‌వెల్‌ను ఎన్నుకున్నారు. [13] దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకునిగా ఎంపికయ్యాడు.
ఏప్రిల్ నెలలో నివేదా థామస్ రెండవ హీరోయిన్‌గా నటించడానికి ఒప్పందం కుదుర్చుకుంది.[14] నందిత రాజ్ ఒక ప్రత్యేక పాత్రలో నటించడానికి ఎన్నుకున్నారు.[15] అలాగే హంసా నందిని కూడా ఒక పాత్రను పోషించడానికి ఒప్పందం కుదుర్చుకుంది.[16] ప్రియదర్శి పుల్లికొండ ఈ టీములో చేరాడు. బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ శత్రువు పాత్రకు ఎంపిక కాబడ్డాడు. ఇది ఇతనికి మొట్టమొదటి తెలుగు సినిమా.[17] అద్వైత క్రియేటివ్ స్టూడియోస్ కు చెందిన అనిల్ పాడూరి విజ్యువల్ ఎఫెక్ట్స్‌ను పర్యవేక్షించగా ఎ.ఎస్.ప్రకాష్ ఈ చిత్రానికి కళాదర్శకునిగా పనిచేశాడు.
ఈ చిత్రం 2017 ఫిబ్రవరి 10వ తేదీన ఎన్.టి.ఆర్. ఆర్ట్స్ నూతన కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో నందమూరి హరికృష్ణ, నందమూరి రామకృష్ణ, వి.వి.వినాయక్, దిల్ రాజు మొదలైనవారు హాజరయ్యారు. మొదటి క్లాప్ జూనియర్ ఎన్.టి.ఆర్. కొట్టగా నందమూరి హరికృష్ణ కెమెరా స్విచ్‌ఆన్ చేశాడు. తొలి షాట్ దేవతల ఫోటోలపై చిత్రించగా వి.వి.వినాయక్ ఆ షాట్‌కు దర్శకుడిగా వ్యవహరించాడు.[18] ఈ సినిమా ప్రధాన చిత్రీకరణ 2017 ఫిబ్రవరిలో మొదలయ్యింది.[19] ఎన్.టి.ఆర్., రాశిఖన్నాల వివాహ సన్నివేశం చిలుకూరు పరిసర ప్రాంతాలలో చిత్రీకరించారు.[20] ఈ సినిమా బృందం ₹2 crore (US$2,50,000) ఖర్చు పెట్టి రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ సెట్టింగును నిర్మించింది. అధిక భాగం షూటింగ్ అక్కడే జరిగింది.[21] కొన్ని కారణాల వల్ల సి.కె.మురళీధరన్ మే నెలలో ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఇతని స్థానంలో ఛోటా కె.నాయుడు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేశాడు.[22] బాలీవుడ్ నటుడు జూన్ నెలలో షూటింగులో పాల్గొన్నాడు. హైదరాబాదులోని ఒక క్వారీలో కొన్ని సన్నివేశాలను ఇతనిపై చిత్రించారు.[23] ప్రధానమైన షెడ్యూలు రామోజీ ఫిలిం సిటీలో పూర్తి అయ్యాక ఈ సినిమా బృందం కొన్ని పాటలను చిత్రీకరించడానికి పూణే వెళ్లింది.[24]
ఈ సినిమాకు పాటలకు, నేపథ్య సంగీతానికీ దేవీశ్రీ ప్రసాద్ సారథ్యం వహించాడు. ఈ సినిమా ఆడియో లహరి మ్యూజిక్ సంస్థ ద్వారా 2017 సెప్టెంబరు 3వ తేదీన విడుదలయ్యింది.[25]
సం. | పాట | పాట రచయిత | గాయకుడు(లు) | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "రావణా" | చంద్రబోస్ | దివ్యకుమార్ | 4:18 |
2. | "ట్రింగ్ ట్రింగ్" | రామజోగయ్య శాస్త్రి | జస్ప్రీత్ జాస్ & రానీనా రెడ్డి | 4:27 |
3. | "నీ కళ్ళలోన" | చంద్రబోస్ | హేమచంద్ర | |
4. | "దోచేస్తా" | చంద్రబోస్ | నకష్ అజీజ్ | |
5. | "స్వింగ్ జరా" | రామజోగయ్య శాస్త్రి | నేహా భాసిన్, దేవిశ్రీ ప్రసాద్ | |
మొత్తం నిడివి: | 16:52 |
మొదట ఈ సినిమాను 2017 ఆగస్టు 11 లేదా సెప్టెంబరు 1 న విడుదల చేయాలని అనుకున్నారు.[26] చివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2017 సెప్టెంబరు 21 న థియేటర్లలో విడుదలైంది.[27]