జోతి వెంకటాచలం | |
---|---|
![]() జోతి వెంకటాచలం | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | మేమ్యో, బ్రిటిషు బర్మా (ఇప్పటి మయన్మార్) | 1917 అక్టోబరు 27
వృత్తి | కేరళ గవర్నరు |
పురస్కారాలు | పద్మశ్రీ (1974) |
జోతి వెంకటాచలం (జననం 1917 అక్టోబరు 27, మరణించిన తేదీ తెలియదు) కేరళ గవర్నరుగా, తమిళనాడు శాసనసభ సభ్యురాలిగా. తమిళనాడు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకురాలు.
జోతి వెంకటాచలం బ్రిటిషు బర్మా (ప్రస్తుతం మయన్మార్)లో హిల్ సిటీ అయినమేమియోలో 1917 అక్టోబరు 27 న జి. కుప్పురం, మీనా పాయ్ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి బ్రిటిషు బర్మా సెక్రటరీ కార్యాలయంలో పనిచేసేవాడు. ఆ సమయంలో బర్మాలో రాజకీయ గందరగోళం కారణంగా రాజీనామా చేసి 1930 లో చెన్నైకి తిరిగి వచ్చారు. జోతి చెన్నైలోని వెప్పేరిలోని ఎవార్ట్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో తన చదువును కొనసాగించింది.
జోతి సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పడింది. ఆమె 1953 అక్టోబరు 10 - 1954 ఏప్రిల్ 12 మధ్య సి. రాజగోపాలాచారి మంత్రివర్గంలో మద్యపాన నిషేధం, మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసింది. ఆ విధంగా స్వతంత్ర భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన మొదటి మహిళగా జోతి వెంకటాచలం గుర్తింపు పొందింది. [1] ఆ కొద్ది సమయంలో, ఆమె మద్యపాన నిషేధ విభాగాన్ని పోలీసు శాఖతో కలిపింది.
తరువాత ఆమె 1962 ఎన్నికలలో ఎగ్మోర్ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా, 1971 ఎన్నికలలో శ్రీరంగం నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ (సంస్థ) అభ్యర్థిగా తమిళనాడు శాసనసభకు ఎన్నికైంది.[2][3] ఈసారి ముఖ్యమంత్రి కె. కామరాజ్ ఆమెను 1962 నుండి ప్రజారోగ్య మంత్రిగా నియమించాడు. ఆ తరువాత 1967 వరకు ఎం. భక్తవత్సలం మంత్రివర్గంలో కొనసాగింది.[4][5][6]
తరువాత ఆమె 1977 అక్టోబరు 14 నుండి 1982 అక్టోబరు 26 వరకు కేరళ గవర్నర్‌గా పనిచేసింది.[7]1974 లో, ప్రజా వ్యవహారాల రంగంలో ఆమె చేసిన కృషికి గాను జోతి వెంకటాచలంను ' పద్మశ్రీ ' పురస్కారంతో సత్కరించారు. 1961 జూలై 19 న ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.[8]