తంజావూరు రంగనాయకి రాజకుమారి | |
---|---|
జననం | తంజావూరు రంగనాయకి రజాయి 1922 |
మరణం | సెప్టెంబరు 20, 1999 (వయసు 77) |
క్రియాశీల సంవత్సరాలు | 1939–1963 |
జీవిత భాగస్వామి | లేరు |
పిల్లలు | లేరు |
తంజావూరు రంగనాయకి రాజకుమారి తమిళ సినిమా నటి, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో 'డ్రీమ్‌గర్ల్' అని పిలిపించుకున్న మొదటి తార టి.ఆర్.రాజకుమారి.[1] ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఆమె వసంతసేనగా 'జీవించింది'. ఈ చిత్రాన్ని ఆంధ్రదేశంలో నాటకంగా ప్రదర్శించినప్పుడల్లా ఆ పాత్రని జి.వరలక్ష్మి వేసేది.
రాజకుమారి 1922లో జన్మించింది. తన పిన్ని ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి (తమిళనటి) వల్ల సినిమారంగానికి పరిచయమైంది. రాజకుమారి మొదటి సినిమా 'కుమార కుళోత్తుంగన్' (1941). 'కచదేవయాని' చిత్రంతో తారాపథానికి వెళ్లింది. 'మంత్రావతి', 'సూర్యపుత్రి', 'మనోన్మణి', 'హరిదాస్', 'కృష్ణభక్తి' చిత్రాలు రాజకుమారిని ఆనాటి కుర్రకారుకు కలలరాణిని చేశాయి. 1948 లో విడుదలై సంచలనాత్మక విజయం సాధించిన జెమినీ వారి 'చంద్రలేఖ'లో ఈమే కథానాయిక. ఈ చిత్రం అటు తమిళనాడులోనే కాక, ఆంధ్రదేశంలోనూ రజతోత్సవం జరుపుకుంది. దాంతో రెండు భాషల్లోనూ రాజకుమారి పేరు మారుమ్రోగింది.
ఈమె కుటుంబమంతా సినిమా కుటుంబమే. అక్క ఒక తమిళనటి. అక్క కూతురు కుచలకుమారి ప్రసిద్ధ సినీ నర్తకి. సోదరుడు టి.ఆర్.రామన్నతో పాటు మరో సోదరుడు టి.ఆర్.చక్రపాణి కూడా నిర్మాతే. రామన్న భార్యలు బి.ఎస్.సరోజ, ఇ.వి.సరోజ ఇద్దరూ నటీమణులే. శృంగార తారలు జ్యోతిలక్ష్మి, జయమాలిని రాజకుమారి చెల్లెలి కూతుళ్లే. రాజకుమారి వైభవంగా బతికిన రోజుల్లో మద్రాసు టి.నగర్ పాండీబజార్‌లో తన పేరిట 'రాజకుమారి టాకీసు' అని ఒక సినిమాహాలు కట్టించింది. ఇప్పుడు ఆ థియేటర్ స్థానంలో పెద్ద పెద్ద వాణిజ్య సముదాయాలు వెలిసినా, ఇప్పటికీ 'రాజకుమారి థియేటర్ దగ్గర' అని చెప్పుకుంటారు.
శిల్పసుందరిలా తీర్చినట్టుండే రాజకుమారికి చివరి రోజుల్లో కుష్ఠు వ్యాధి వచ్చింది. దీంతో ఎవరినీ కలిసేది కాదామె. మరీ ఆత్మీయులెవరైనా వస్తే తెర చాటు నుంచి మాట్లాడేది. రాజసం, దర్పం, హొయలు, కవ్వించే కళ్లు, పదే పదే చూడాలనిపించే స్ఫురద్రూపం ఇవన్నీ కలబోసినట్లుండే రాజకుమారి 1999 సెప్టెంబరు 20న మరణించింది. నటించింది తక్కువ చిత్రాలే అయినా కొన్ని దశాబ్దాలకు తరగని కీర్తిని ఆర్జించుకున్న నటి ఆమె.[2]