టి.బృంద | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | 1912, నవంబర్ 5 |
మూలం | మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా |
మరణం | 1996 ఆగస్టు 6 | (వయసు 83)
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | భారతీయ శాస్త్రీయ సంగీతం గాత్ర విద్వాంసురాలు |
వాయిద్యాలు | గాత్రం, సరస్వతి వీణ |
తంజావూరు బృంద (5 నవంబర్,1912-6 ఆగష్టు 1996) కర్ణాటక సంగీత విద్వాంసురాలు. ఈమె గాత్ర విద్వాంసురాలైనప్పటికీ వీణను కూడా వాయించగలదు.[1] ఈమెను అభిమానులు ఆప్యాయంగా "బృందమ్మ" అని పిలుస్తారు.[2][3][4]
ఈమె 1912, నవంబర్ 5న సంగీతకళాకారుల కుటుంబంలో జన్మించింది. ఈమె అమ్మమ్మ వీణ ధనమ్మాళ్ సంగీత ప్రపంచంలో తనదైన బాణీని ప్రవేశపెట్టింది. బృంద తన తల్లి కామాక్షమ్మ వద్ద సంగీతం తొలి పాఠాలు నేర్చుకుంది. తరువాత ఈమె కాంచీపురం నయన పిళ్ళై, లక్ష్మీరత్నం, వీణ ధనమ్మాళ్ల వద్ద కూడా సంగీత శిక్షణ తీసుకుంది. ఈమె బేగడ, ముఖారి, సహన, సురటి, వరాళి, యదుకుల కాంభోజి వంటి కష్టమైన రాగాలను ఆలపించడంలో నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈమె క్షేత్రయ్య పదాలు, జావళీలు, కర్ణాటక సంగీత త్రిమూర్తులు, పట్నం సుబ్రమణ్య అయ్యరు మొదలైన వారి కీర్తనలను అవలీలగా ఆలపించేది. ఈమె తన తొలి సంవత్సరాలలో తన చెల్లెలు టి.ముక్తతో కలిసి జంటగా ప్రదర్శనలు ఇచ్చింది. తరువాతి కాలంలో తన కుమార్తె వేగవాహిని విజయరాఘవన్‌తో జంటప్రదర్శనలు ఇచ్చింది.
ఎందరో సంగీత విద్వాంసులు ఈమె వద్ద సంగీతంలో శిక్షణను తీసుకున్నారు. అలాంటి వారిలో సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, ఆర్.కె.శ్రీకాంతన్, పురాణం పురుషోత్తమశాస్త్రి, రామనాథ కృష్ణన్, అరుణా సాయిరాం, చిత్రవీణ రవికిరణ్, బి.కృష్ణమూర్తి, చిత్రవీణ గణేష్, కె.ఎన్.శశికిరణ్, కిరణవలి విద్యాశంకర్, గీతా రాజ,రాధా విశ్వనాథన్, బి.బాలసుబ్రమణియన్, మైసూర్ నాగమణీ శ్రీనాథ్ తదితరులున్నారు. ఈమె మనుమడు తిరువరూర్ ఎస్.గిరీష్ కూడా ఈమ వద్ద నేరుగా శిక్షణ పొంది కర్ణాటక విద్వాంసునిగా పేరు గడించాడు. ఈమె తన పాటలను వ్యాపారదృష్టితో రికార్డు చేయడానికి ఇష్టపడలేదు. ఈమె కీర్తనలు కొన్ని ప్రైవేటు రికార్డులు మాత్రమే లభ్యమౌతున్నాయి.
ఈమె సియాటెల్ లోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు విజిటింగ్ ఆర్టిస్ట్‌గా 1968-69, 1977-78 సంవత్సరాలలో సందర్శించింది.