టైగర్ వరదారి | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | కందాడై వరదాచారి |
జననం | కొళత్తూర్ | 1876 ఆగస్టు 1
మరణం | 1950 జనవరి 31 | (వయసు 73)
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | ప్రిన్సిపాల్, సంగీత కళాశాల, అన్నామలై విశ్వవిద్యాలయం, చెన్నై |
వాయిద్యాలు | గాత్రం |
టైగర్ వరదాచారి (1876–1950) తమిళనాడుకు చెందిన కర్ణాటక సంగీత గాత్రవిద్వాంసుడు.
వరదాచారి మద్రాసు ప్రెసిడెన్సీ, చెంగల్పట్టు జిల్లా కొలత్తూర్ గ్రామంలో 1876, ఆగష్టు 1వ తేదీన జన్మించాడు. ఇతని తండ్రి కందాడై రామానుజాచారి తెలుగు,తమిళ, సంస్కృత పండితుడు. తల్లి కళ్యాణి అమ్మాళ్.
మసిలమణి, పెద్ద సింగరాచార్యుల ప్రోద్బలంతో ఇతడు సంగీతాన్ని అభ్యసించాడు. ఇతడు తన 14వ యేట పట్నం సుబ్రమణ్య అయ్యరు వద్ద చేరి మూడు సంవత్సరాలు సంగీతాభ్యాసం చేశాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇతడు కాలికట్ లో సర్వే డిపార్టుమెంట్‌లో నెలకు 12 రూపాయల జీతంతో ఉద్యోగానికి చేరాడు. ఉద్యోగం చేస్తూనే ఇతడు తన సంగీతం పట్ల ఉన్న మక్కువను పెంచుకోసాగాడు. మైసూరులో ఉన్నప్పుడు మైసూర్ మహారాజు కృష్ణరాజ ఒడయార్ దృష్టిలో పడ్డాడు. మహారాజు ఇతనికి "టైగర్" బిరుదును, "తోడా"ను ప్రదానం చేశాడు.
ఇతడు చాలా కాలం సేలం జిల్లా (ప్రస్తుతం కృష్ణగిరి జిల్లా) కావేరీపట్నంలో నివసించాడు. ఇతడు కావేరీపట్నం పెరియార్ వీధిలో నివసించిన ఇల్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.
ఇతని కుటుంబ సభ్యులకు సంగీతంలో ప్రావీణ్యం ఉంది. ఇతని తండ్రి రామానుజాచారి సంగీతం గురించి ప్రసంగాలు చేశాడు. ఇతని సోదరుడు కె.వి.శ్రీనివాస అయ్యంగార్ సంగీతశాస్త్ర ప్రవీణుడు. మరొక సోదరుడు కె.వి.కృష్ణమాచారి వీణ విద్వాంసుడు. వరదాచారి తన సోదరి నుండి పాటలు పాడటం గురించి ఎక్కువగా నేర్చుకున్నాడు.[1][2] ఇతడు మద్రాసు సంగీత అకాడమీ నిర్వహిస్తున్న సంగీత అధ్యాపకుల కాలేజీకి ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. ఆ పదవిలో 5 సంవత్సరాలు గడిపిన తరువాత ఇతడు మద్రాసు విశ్వవిద్యాలయం సంగీత శాఖకు అధిపతిగా, అన్నామలై విశ్వవిద్యాలయం సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. చివరకు "కళాక్షేత్ర" సంగీత విభాగానికి ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు.
వేగవంతమైన సంగతులు పాడటం ఇతని ప్రత్యేకత. ఇతడు మంచి వాగ్గేయకారుడు కూడా. ఇతడు గీతాలు, వర్ణాలు, కృతులు ఎన్నో రచించి సంగీత ప్రపంచానికి అందించాడు. 1.1948లో చక్రవర్తి రాజగోపాలాచారి గవర్నర్ జనరల్ హోదాలో "కళాక్షేత్ర"ను సందర్శించినప్పుడు ఇతడు "ఈ దినమే సుదినము" అనే కృతిని స్వరపరిచి పాడాడు. 2.రుక్మిణీదేవి అరండల్ జన్మదినం సందర్భంగా "వందనము నొనరించి" అనే వర్ణాన్ని వాచస్పతి రాగంలో కూర్చాడు.
ఇతని శిష్యులలో పేర్కొన దగిన కొంత మంది:
1932లో మద్రాసు సంగీత అకాడమీ ఇతనికి సంగీత కళానిధి పురస్కారం ప్రదానం చేసింది.