మొత్తం జనాభా | |
---|---|
2,40,100 (2011) 18.2% of the Trinidad and Tobago Population | |
Regions with significant populations | |
ట్రినిడాడ్, టొబాగో, అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్ | |
మతాలు | |
హిందూమతం | |
భాషలు | |
సంస్కృతం (liturgical language) · ఇంగ్లీషు · హిందీ · హింగ్లీషు · ఇతర భారతీయ భాషలు |
ట్రినిడాడ్, టొబాగోలో హిందూమతం రెండవ అతిపెద్ద మతం. 1845లో హిందూ సంస్కృతి ట్రినిడాడ్, టొబాగోకు చేరుకుంది. [1] 2011 జనాభా లెక్కల ప్రకారం ట్రినిడాడ్, టొబాగోలో 2,40,100 మంది హిందువులు ఉన్నారు. దేశంలో వివిధ హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి.
1834లో బానిసత్వం రద్దు చేయబడిన ఒక దశాబ్దం తర్వాత, బ్రిటీష్ ప్రభుత్వం వలసవాదుల ఎస్టేట్‌లలో పని చేయడానికి భారతదేశం నుండి ఒప్పంద కార్మికులను దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. మిగిలిన శతాబ్దంలో, ట్రినిడాడ్ జనాభా పెరుగుదల ప్రధానంగా భారతీయ కార్మికుల వలననే జరిగింది. 1871 నాటికి దేశంలో 27,425 మంది భారతీయులు ఉన్నారు, ఆనాటి ట్రినిడాడ్, టొబాగో జనాభాలో ఇది దాదాపు 22 శాతం; 1911 నాటికి ఆ సంఖ్య 1,10,911కి పెరిగింది. ఇది మొత్తం జనాభాలో దాదాపు 33 శాతం.
భారతీయ ఒప్పందపు తొలి దశాబ్దాలలో, భారతీయ సాంస్కృతిక రూపాల పట్ల హిందూయేతర మెజారిటీ చిన్నచూపును, ఉదాసీనతనూ ప్రదర్శించింది. [2] దేశంలో హిందువులను రెండవ తరగతి పౌరులుగా పరిగణించినప్పటికీ, ట్రినిడాడ్ చరిత్ర, సంస్కృతికి హిందువులు తమవంతు చేర్పులు చేశారు. ట్రినిడాడ్‌లోని హిందువులు వోటు హక్కు కోసం, హిందూ వివాహ బిల్లు, విడాకుల బిల్లు, దహన సంస్కారాల ఆర్డినెన్సు తదితర అంశాల కోసం పోరాడారు. [2] 1953లో దహన సంస్కారాలకు అనుమతి పొందారు. [3]
తమను పక్కనబెట్టడం పట్ల హిందువులలో నిరంతర అసంతృప్తి ఉంది. చాలా సమూహాలు హిందువులను "కులవృత్తివారని, వెనుకబడినవారని, నీచస్థాయి వారనీ" చిత్రీకరిస్తాయి. 1986 సార్వత్రిక ఎన్నికల సమయంలో, అవసరమైన ప్రమాణం కోసం పోలింగ్ స్టేషన్‌లలో భగవద్గీత, ఖురాన్ లు లేకపోవడం హిందువులు, ముస్లింలను ఘోరంగా అవమానించినట్లని వ్యాఖ్యానించారు. 1986లో కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసే సమయంలో ట్రినిడాడ్, టొబాగో అధ్యక్షుడి అధికారిక నివాసంలో హిందూ మత గ్రంథాలు లేకపోవడం మైనారిటీ వర్గాలకు జరిగిన మరో అవమానంగా భావించారు. ఇటువంటి మెజారిటీ-ఆధారిత ప్రతీకల నేపథ్యంలోనే జాతీయ విద్యా వ్యవస్థ, పాఠ్యాంశాలపై పదేపదే ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో వివక్షతో కూడిన ప్రార్థనలను ఉపయోగించడం, ఆమోదించబడిన పాఠశాల పాఠ్యపుస్తకాల్లో హిందూమతానికి ప్రాతినిధ్యం లేకపోవడం, హిందూమత పరమైన ఆచారాలకు ప్రాధాన్యత లేకపోవడం పట్ల హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహం కలిగించింది. 1980వ దశకంలో చేసిన తీవ్ర నిరసనల కారణంగా హిందువుల పట్ల దేశ వైఖరిలో మెరుగుదల ఏర్పడింది. [2]
ఎవాంజెలికల్, పెంటెకోస్టల్ వంటి క్రిస్టియన్ మిషనరీలు చేసే మతమార్పిడులకు హిందువులు కూడా గురయ్యారు. ఆఫ్రో-ట్రినిడాడియన్, ఇండో-ట్రినిడాడియన్ సమాజాల మధ్య అప్పుడప్పుడూ తలెత్తే జాతి ఉద్రిక్తతలకు ఇటువంటి కార్యకలాపాలే కారణం. [4]
చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1990 | 2,92,786 | — |
2000 | 2,85,517 | −2.5% |
2011 | 2,40,100 | −15.9% |
సంవత్సరం | శాతం | మార్పు |
---|---|---|
1962 | 23.8 | - |
2000 | 22.5% | -1.03% |
2011 | 18.2% | -4.3% |
2011 జనాభా లెక్కల ప్రకారం, ట్రినిడాడ్, టొబాగోలో 2,40,100 మంది హిందువులు ఉన్నారు. వీరిలో 2,32,104 మంది భారతీయులు, 2,738 మంది డగ్లా (మిశ్రమ ఆఫ్రికన్/భారతీయులు), 2,466 మంది మిక్స్‌డ్/ఇతర, 1,887 తెలియని జాతి, 346 ఆఫ్రికన్, 175 చైనీస్, 27 యూరోపియన్, 302 దేశీయ అమెరిండియన్, 46 ఇతర వ్యక్తులు. జాతి సమూహాలలో నిష్పత్తి గురించి మాట్లాడితే, ఈస్ట్ ఇండియన్లలో 49.54% మంది, స్థానికులలో 21.66% మంది హిందువులు. అలాగే చైనీస్‌లో 4.37%, డగ్లస్‌లో 2.70% (మిశ్రమ ఆఫ్రికన్/ఈస్ట్ ఇండియన్), మిక్స్‌డ్/ఇతరుల్లో 1.23% , ఆఫ్రికన్‌లలో 0.08% మందీ హిందువులు. [5]
పరిపాలనా విభాగం ప్రకారం హిందూ జనాభా ఇలా ఉంది: పోర్ట్ ఆఫ్ స్పెయిన్- 1.45%, శాన్ ఫెర్నాండో- 10.70%, అరిమా- 4.39%, చగువానాస్- 30.04%, పాయింట్ ఫోర్టిన్- 3.87%, కూవా- 31.26%, డియెగో మార్టిన్- 1.83%, మయారో- 22.46%, పెనాల్- 42.98%, ప్రిన్సెస్ టౌన్- 26.99%, శాన్ జువాన్- 8.35%, సంగ్రే గ్రాండే- 15.41%, సిపారియా-23.37%, తునాపునా- 14.07%, టొబాగో- 0.67%. [5]
ట్రినిడాడ్, టొబాగోలోని ప్రధాన హిందూ సంస్థ సనాతన్ ధర్మ మహా సభ. దీన్ని భదాసే సాగన్ మారాజ్ స్థాపించాడు. గతంలో అతని అల్లుడు సెక్రటరీ జనరల్ సత్నారాయణ్ మహారాజ్, అతని మనవడు, సెక్రటరీ జనరల్ విజయ్ మహారాజ్ నాయకత్వం వహించారు. హిందూ పండుగైన దీపావళి ట్రినిడాడ్, టొబాగోలో ప్రభుత్వ సెలవుదినం ఫాగ్వాతో పాటు దీపావళిని అన్ని జాతులు, జాతులు, సంస్కృతులు, మతాల ప్రజలు విస్తృతంగా జరుపుకుంటారు. ఇతర హిందూ పండుగలు : శ్రీరామ నవమి, సీతా నవమి, వివాహ పంచమి, మహా శివరాత్రి, నవరాత్రి, చత్ పూజ, కృష్ణ జన్మాష్టమి, రాధాష్టమి, దసరా, కార్తీక పూర్ణిమ, గురు పూర్ణిమ, వ్యాట్ పూర్ణిమ, తులసీ వివాహ్, మకర సంక్రాంతి, అహోయి అష్టమి, హనుమాన్ జయంతి, గణేష్ చతుర్థి, రక్షా బంధన్, గాంధీ జయంతి, వసంత పంచమి, మేష సంక్రాంతి.
కరీబియన్ లోని ఇతర ప్రాంతాలు, దక్షిణాఫ్రికా, ఫిజీ, మారిషస్ వలె , ట్రినిడాడియన్ హిందువులలో కుల భేదాలు సమసిపోయాయి. భారతీయ ఒప్పంద కార్మికులలో చాలా తక్కువ మంది స్త్రీలు ఉన్నందున జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో కులానికి సంబంధించిన పరిగణనలు అంతగా ముఖ్యమైనవి కావు.
మాఫెకింగ్ (మయారో-రియో క్లారో), సౌత్ ఒరోపౌచె (సిపారియా), వాటర్‌లూ (కౌవా-టబాక్విట్-తల్పారో), ఫెలిసిటీ (చగువానాస్), కరోని (తునాపునా-పియార్కో)లోని ఐదు దహన వాటికల వద్ద దహన సంస్కారాలను అనుమతించారు.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)