డి'ఒలివెరా వివాదం అన్నది 1968-69లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు ప్రారంభమైన సుదీర్ఘమైన రాజకీయ, క్రీడా వివాదం. ఇంగ్లండ్ సెలెక్టర్లు 1966 నుండి టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టులో ప్రాతినిధ్యం వహించిన మిశ్రమ జాతి దక్షిణాఫ్రికా ఆటగాడు బాసిల్ డి'ఒలివెరాను జాతివివక్షాపూరితమైన దక్షిణాఫ్రికా పర్యటనలో చేర్చుకుంటారా లేదా అనేది వివాదాస్పద అంశం. దక్షిణాఫ్రికాలో అధికారికంగా, చట్టబద్ధంగా వర్ణవివక్ష (అపార్తీడ్) ఉన్నందున, ఇంగ్లండ్ జట్టులో శ్వేతజాతీయేతర దక్షిణాఫ్రికన్ క్రీడాకారుణ్ణి పర్యటన జట్టులో చేర్చుకోవడం రాజకీయ సమస్యగా మారింది.
భారతీయ - పోర్చుగీస్ పూర్వీకులను కలిగిన ఒక మిశ్రమ జాతి (కేప్ కలర్) వ్యక్తి అయిన డి'ఒలివేరా శ్వేతజాతీయులు మినహా మరెవ్వరూ క్రికెట్ జట్టులో ఉండే వీల్లేని దక్షిణాఫ్రికా వర్ణవివక్ష చట్టాలు తన కెరీర్ అవకాశాలను దెబ్బతీయడంతో దక్షిణాఫ్రికాను విడిచిపెట్టాడు.[1][2][3] 1964లో వోర్సెస్టర్‌షైర్ కంట్రీ క్రికెట్ క్లబ్‌కు రెసిడెన్సీ ద్వారా ఎంపికయ్యాడు. రెండేళ్ళ తర్వాత ఇంగ్లండ్ జట్టుకు మొట్టమొదటిసారిగా ఆడే అవకాశం పొందాడు.[2] 1966లోనే ఇంగ్లిష్ - దక్షిణాఫ్రికా క్రికెటింగ్ బాడీలు డీ'ఒలివెరాను 1968-69లో దక్షిణాఫ్రికాలో పర్యటించబోయే ఇంగ్లండ్ జట్టులో చేరిస్తే జరిగే పరిణామాల గురించి చర్చించాయి.[4] రెండు దేశాలకు చెందిన క్రికెట్ పరిపాలనా, రాజకీయ ప్రముఖుల ఎత్తులు, పైఎత్తులు కలసి వ్యవహారాన్ని నేరుగా తేల్చుకోనివ్వకుండా చేశాయి. దక్షిణాఫ్రికాతో, ఆ దేశపు క్రికెట్‌తో ఉన్న సంప్రదాయ సంబంధాలు దెబ్బతినకుండా కొనసాగించడం, ఏ సమస్యా లేకుండా సీరీస్‌ని నిర్వహించగలగడం అన్నది ఇంగ్లండ్ క్రికెట్ జట్టును ఆనాడు నిర్వహిస్తున్న మేరీలెబోన్ క్రికెట్ క్లబ్ ప్రాధాన్యత.[5] ఆనాటి దక్షిణాఫ్రికా ప్రధాని జాన్ వోస్టర్‌ది మరింత సంక్లిష్టమైన రాజకీయ విన్యాసం. పైకి డీ'ఓలివెరాను ఇంగ్లండ్ జట్టులో చేర్చుకోవడం తమకేమీ అభ్యంతరం కాదని సంకేతాలిస్తూ, తద్వారా అంతర్జాతీయ సమాజాన్ని తన వర్ణవివక్ష విధానాలపై తీవ్ర చర్యలు తీసుకోకుండా బుజ్జగిస్తూనే, రహస్యంగా అలా జరగకుండా అన్ని విధాలా అడ్డుకోవడం అతని ప్రాధాన్యత.[6][7]
ఇందుకు తగ్గట్టే డీ'ఒలివెరా బ్యాటింగ్ ఫామ్ 1968లో దెబ్బతిన్నది. ఈ కారణంగా ఇంగ్లండ్ జట్టు నుంచి తొలగించబడ్డాడు. అయితే, ఆస్ట్రేలియాతో ఓవల్‌లో యాషెస్ సీరీస్‌లో జరిగిన ఆఖరి టెస్ట్ మ్యాచ్‌లో అతనికి ఆడే అవకాశం లభించడంతో అనూహ్యంగా 158 పరుగుల స్కోరుతో తన క్రికెటింగ్ ప్రతిభను మళ్ళీ నిరూపించుకున్నాడు.[8]
ఇది జరిగిన కొన్నాళ్ళకు దక్షిణాఫ్రికా పర్యటనకు జరిగిన ఎంపిక నుంచి ఎంసీసీ సెలక్టర్లు డి'ఒలివెరాను తప్పించారు[9][10]; ఈ నిర్ణయం పూర్తిగా క్రికెట్ మెరిట్‌పైనే ఆధారపడిందని వారు నొక్కి చెప్పారు.[11] అ
యితే బ్రిటన్‌లో చాలామంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.[12][13][14] బహిరంగంగా నిరసన తెలిపారు. డీ'ఒలివెరా కూడా ఈ నిర్ణయానికి చాలా బాధపడ్డాడు. సెప్టెంబరు 16న గాయం కారణంగా టామ్ కార్ట్‌రైట్ జట్టు నుంచి వైదొలగడంతో, ఎంసీసీ డి'ఒలివెరాను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంది.[15] ఈ ఎంపిక రాజకీయంగా ప్రేరేపించబడిందని వోస్టర్ నుంచి, ఇతర దక్షిణాఫ్రికా రాజకీయ నాయకుల నుంచి ఆరోపణలు వచ్చాయి. వోస్టర్ తీవ్ర ఆరోపణలు చేస్తూ, డీ'ఒలివెరాతో కూడిన జట్టును దక్షిణాఫ్రికాలో పర్యటించనివ్వమని తేల్చిచెప్పాడు.[16] రాజీ కోసం ప్రయత్నాలు జరిగాయి కానీ అవి సఫలం కాలేదు. చివరకు ఎంసీసీ సెప్టెంబర్ 24న పర్యటన రద్దు అయినట్టు ప్రకటించింది.[17]
1968 నాటికి దక్షిణాఫ్రికాపై వివిధ క్రీడల్లో బహిష్కరణలు ప్రారంభమయ్యాయి, అయితే దక్షిణాఫ్రికా క్రికెట్‌పై డి'ఒలివెరా వివాదం తీవ్ర ప్రభావం చూపింది. దక్షిణాఫ్రికా క్రికెట్ కంట్రోల్ బోర్డ్ 1969లో దక్షిణాఫ్రికా క్రికెట్‌లో జాతిపరమైన అడ్డంకులను తొలగించాలన్న ఉద్దేశాన్ని ప్రకటించింది. అంతవరకూ తెల్లజాతివారికీ, నల్లజాతీయులూ, ఇతర మిశ్రమజాతుల వారికీ వేర్వేరుగా సాగుతున్న క్రీడను 1976లో అధికారికంగా ఏకీకృతం చేసింది. ఇంతలో, బహిష్కరణ ఉద్యమం తీవ్రంగా పెరిగింది. 1971 నుండి దక్షిణాఫ్రికా అంతర్జాతీయ క్రికెట్ నుండి దాదాపుగా పూర్తిగా ఏకాకి అయింది. అయితే దక్షిణాఫ్రికా 1980ల వరకు అంతర్జాతీయ రగ్బీలో ఆడటం కొనసాగించింది. 1970లలో రెండుసార్లు మిక్స్‌డ్-రేస్ న్యూజిలాండ్ రగ్బీ జట్లను దేశంలోకి అనుమతించింది.[18] డి'ఒలివెరా 1972 వరకు ఇంగ్లండ్ తరఫున, 1979 వరకు వోర్సెస్టర్‌షైర్ తరపున ఆడాడు.[19] వర్ణవివక్ష (అపార్తెడ్) విధానాలను తొలగించడం ప్రారంభించాకా 1991లో దక్షిణాఫ్రికా అంతర్జాతీయ క్రికెట్లోకి అధికారికంగా తిరిగివచ్చింది.[20]
{{cite book}}
: |work=
ignored (help)
{{cite book}}
: |work=
ignored (help)