తలకాడు కర్ణాటకలో, కావేరి నది ఎడమ ఒడ్డున ఉన్న ఒక పట్టణం. ఇది మైసూరు నుంచి 45 కి.మీ దూరంలోనూ, బెంగళూరు నుంచి 133 కి.మీ దూరంలోనూ ఉంది. ఒకానొక కాలంలో ఇక్కడ సుమారు 30కి పైగా దేవాలయాలుండేవి. ప్రస్తుతం ఇవి చాలా వరకు ఇసుకలో కూరుకుపోయాయి. ఈ ప్రదేశంలో తూర్పువైపుకు పారే కావేరి నది దిశను మార్చుకుని చుట్టుపక్కల విశాలమైన ప్రదేశంలో ఇసుక మేటలు వేసి ఉంటుంది.[1]
తలకాడు మూలాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ ఒక సాంప్రదాయం ప్రకారం తలకాడు అనే పేరు తల, కాడు అనే ఇద్దరు కిరాత సోదరుల పేరు మీదుగా వచ్చింది. వీరు ఒకానొక కాలంలో అడవి ఏనుగులు పూజిస్తున్న చెట్టును నరకగా అందులోనుంచి ఒక శివలింగం బయట పడింది. వెంటనే ఆ ఏనుగులు ఋషులుగా మారారు. ఆ చెట్టు మామూలుగా కావడమే కాకుండా వారందరికీ మోక్షం సిద్ధించింది. అప్పటి నుంచీ ఈ ప్రాంతం పేరు తలకాడుగా మారింది. సంస్కృతంలో దీనిని దళ-వన అని పిలిచారు. వీరభద్ర స్వామి గుడి వెలుపల ఉన్న రెండు విగ్రహాలు ఈ కిరాతులవే అని ఒక విశ్వాసం.
లిఖిత ఆధారాలు కలిగిన చరిత్ర మొదటిగా పశ్చిమ గాంగుల పరిపాలనలో కనిపిస్తుంది. సా.శ 11వ శతాబ్దం మొదట్లో చోళులు, పశ్చిమ గంగ వంశ రాజులను ఓడించి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని రాజరాజపురం అనే పేరు పెట్టారు. ఒక శతాబ్దం తర్వాత హొయసాల రాజైన విష్ణువర్ధనుడు చోళులను పారద్రోలి ఈ ప్రాంతాన్ని వశం చేసుకున్నాడు.