తిండిపోతు రాముడు (1971 తెలుగు సినిమా) | |
![]() సినిమాపోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి.మాధవన్ |
తారాగణం | శివాజీ గణేశన్, కె.ఆర్.విజయ |
సంగీతం | ఎం.ఎస్.విశ్వనాథన్, ఎ.ఎ.రాజ్ |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీ గణేశ్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
తిండిపోతు రాముడు 1971, సెప్టెంబరు 4వ తేదీన వెలువడిన తెలుగు డబ్బింగ్ సినిమా. శ్రీ లక్ష్మీ గణేశ్ పిక్చర్స్ బ్యానర్‌పై కె.రంగాచలం నిర్మించిన ఈ సినిమాకు పి.మాధవన్ దర్శకుడు.[1] రామన్ ఎతనై రామనాడి అనే తమిళ సినిమాను తిండిపోతు రాముడు పేరుతో తెలుగులోనికి డబ్ చేశారు. తమిళభాషలో ఈ సినిమా 100 రోజులకు పైగా ఆడింది. ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని కూడా దక్కించుకుంది.[2] ఇదే సినిమాను పి.మాధవన్ దర్శకత్వంలోనే హిందీలో రామ్ తేరే కిత్నే నామ్ పేరుతో రీమేక్ చేయబడింది.
రాముడు భోజనప్రియుడు. స్నేహితులు అందుకే అతనికి తిండిపోతు రాముడు అని పేరుపెట్టారు. అతనికి అవ్వ తప్ప ఎవరూ లేరు. జమీందారు చెల్లెలు జానకి ఒకసారి ప్రమాదం నుండి రాముడిని రక్షించింది. మిత్రులు ఆమె నిన్ను ప్రేమించింది అన్నారు. ఆ మాట నమ్మి అర్ధరాత్రి జమీందారు గారి మేడలో ప్రవేశించి ఆమెకు ఫలహారాలిచ్చి తన ప్రేమను వెల్లడించి నీకోసం ఏమైనా చేస్తానంటూ మేడమీది నుండి క్రిందకు దూకి ఆసుపత్రి పాలవుతాడు. జానకి చూడటానికి వచ్చింది. జాలిపడి ప్రేమించింది. జమీందారు దగ్గరికి వెళ్ళగా అతడు కొట్టి అవమానించి లక్షాధికారికి తప్ప తన చెల్లెల్ని ఎవరికీ ఇచ్చి పెళ్ళి చేయనటాడు. జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు రాముడు. పట్నం వెళ్ళి సినిమాలలో చేరి పెద్ద నటుడౌతాడు. అతని సినిమాలన్నీ సిల్వర్ జూబ్లీలు జరుపుకుంటాయి. ఇప్పుడతని పేరు విజయకుమార్. తిరిగి గ్రామం వస్తాడు. అవమానించిన జమీందారు బ్రహ్మరథం పడతాడు. దానికి అతడిని తిరిగి అవమానించి ప్రతీకారం తీర్చుకుంటాడు. జానకి కోసం వెదుకుతాడు. ఆమె కనబడలేదు. పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిందని వింటాడు. పట్నంలో తాను కారులో వెళుతూంటే జానకి కనిపిస్తుంది. గుడిసెలో పేదరికంతో జీవిస్తుంటుంది. తనను మోహన్ పెళ్ళి చేసుకుని అన్ని విధాలా అవమానించగా సంసారానికి స్వస్తి చెప్పి వచ్చానని, తనకు ఆడపిల్ల అని చెబుతుంది. తనకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా చేస్తానని మాట ఇస్తాడు రాముడు. ఒకనాడు తనపై అత్యాచారం జరిపినవాడిని చంపి బిడ్డతో పారిపోయి రాము ఇంటికి వచ్చి ఆ బిడ్డను పెంచమని, తాను హంతకురాలినని ఆ బిడ్డకు తెలియనివ్వ వద్దని ప్రాధేయపడి జానకి జైలుకు వెళుతుంది. ఆ బిడ్డను రాముడు పెంచి పెద్దచేసి పెళ్ళి కూడా చేస్తాడు. జానకి జైలు నుండి విడుదలై వచ్చి తన బిడ్డను చూస్తుంది. తల్లిని బిడ్డను ఏకం చేసిన సమయంలోనే మోటర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న మోహన్‌ను తీసుకువచ్చి జానకిచే క్షమాభిక్ష ఇప్పిస్తాడు. ఆ బిడ్డపై అత్యాచారం జరపబోయిన వాడిని చంపి వేస్తాడు రాముడు. తను ప్రేమించిన పడతి సంతోషం కోసం, సౌఖ్యం కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, చివరకు సంతోషంగా జైలుకు వెళతాడు రాముడు.[3]