తిరు. వి. కళ్యాణసుందరం | |
---|---|
![]() | |
జననం | తిరువారూర్ విదురాచల కళ్యాణ సుందరం 1883 ఆగస్టు 26 తుళ్ళం (ప్రస్తుతం తాండళం), మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా |
మరణం | 1953 సెప్టెంబరు 17 | (వయసు: 70)
వృత్తి | పండితుడు, ఉద్యమకారుడు |
భార్య / భర్త | కమలాంబిగై (మ. 1918) |
తిరు.వి. కా. గా ప్రసిద్ధి చెందిన తిరువారూర్ విరుదాచల కల్యాణసుందరం ( 26 ఆగస్టు 1883-17 సెప్టెంబర్ 1953) ఒక భారతీయ పండితుడు, వ్యాసకర్త తమిళ భాషోద్యమకారుడు. సంప్రదాయ తమిళ సాహిత్యం, తత్వశాస్త్రాలపై ఇతడు చేసిన లోతైన, స్పష్టమైన, విశ్లేషణాత్మకమైన వ్యాఖ్యానాల ద్వారా ఇతడు తమిళ సాహిత్యలోకానికి సుపరిచితుడు. వి. ఓ. చిదంబరం పిళ్ళై, మరైమలై అడిగల్, అరుముక నవలార్ రచనలతో పాటు ఇతని రచనలూ ఆధునిక తమిళ గద్య శైలికి నిర్వచనాలుగా భావిస్తారు.
తిరు వి.కల్యాణసుందరం దక్షిణ భారత దేశంలోని తమిళనాడు రాష్ట్రంలో చెన్నై సమీపంలోని చెంగల్పట్ జిల్లా కు చెందిన తుళ్ళం ( ప్రస్తుతం తాండళం) అని పిలువబడే గ్రామంలో 1883 ఆగస్టు 26న తుళువ వెల్లాల కుటుంబంలో జన్మించాడు. తండ్రి బదిలీ కావడంతో ఇతని కుటుంబం తిరువారూరుకు వలస వచ్చింది. ఇతడు అక్కడి వెస్లీ కళాశాల ఉన్నత పాఠశాలలో చదివాడు. జాఫ్నాకు చెందిన మరైమలై అడిగల్, ఎన్. కదిరవేల్ పిళ్ళైల వద్ద తమిళభాషను అధ్యయనం చేశాడు. ఇతడు కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసి, 1917లో జాతీయ తమిళ దినపత్రిక దేశభక్తన్‌లో సహాయ సంపాదకుడిగా చేరాడు. వెనువెంటనే తిరు వి. కా. స్వాతంత్ర్యోదమంలోని వివిధ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడు. ఈ కాలంలో, ఇతడు కార్మికుల హక్కుల కోసం బలంగా పోరాడాడు. 1918లో ఇతడు బి.పి. వాడియా సహచరుడిగా కార్మిక సంఘ ఉద్యమాలలో చురుకుగా పాల్గొని, దక్షిణ భారతదేశంలో మొదటి కార్మిక సంఘాలను నిర్వహించాడు.[1]
1920లో తిరు. వి. కా. నవశక్తి అనే పేరుతో కొత్త తమిళ వారపత్రికను ప్రారంభించాడు. నవశక్తి ఇతని జీవితాంతం ఇతడి ఆలోచనలకు వాహకంగా పనిచేసింది. తిరు వి. కా. తన పత్రికను తమిళ ప్రజలకు ఒక మార్గదర్శిలా తీర్చిదిద్దాడు. ఇతని రచనలు తన రాజకీయ, తాత్విక అభిప్రాయాలను ప్రతిబింబించాయి. ఇతడు మహాత్మా గాంధీ ఆలోచనలకు సంబంధించి తమిళ భాషలో మొట్టమొదటి వివరణాత్మక వ్యాసాన్ని ఒకదాన్ని ప్రచురించాడు. అది ఇప్పటికీ గాంధీ అధ్యయనాలలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణించబడుతోంది. 19వ శతాబ్దానికి చెందిన ప్రభావవంతమైన తమిళ శైవ తత్వవేత్త రామలింగ స్వామి ఆధ్యాత్మిక చింతనల గురించి ఇతడు అనేక రచనలు చేశాడు. శాస్త్రీయ తమిళ సాహిత్యంలోని అనేక రచనలపై వ్యాఖ్యానాలు వ్రాసి, నవశక్తిలో వాటిని ధారావాహినిగా ప్రచురించాడు.. తన రచనా వృత్తిలో భాగంగా, తిరు వి. కా. యాభైకి పైగా పుస్తకాలను ప్రచురించాడు. వీటిలో మానవ ప్రవర్తనపై గాంధీ ఆలోచనల ప్రభావాలపై అధ్యయనం చేసిన ' మనిత వళక్కైయం గాంధీయదిగలుమ్' కూడా ఉంది. ఇతడు రాసిన ' పెన్నిన్ పెరుమై అల్లాతు వాల్కయిత్ తునై నాలమ్' ఆ కాలంలో అత్యధికంగా చదవబడిన పుస్తకాల్లో ఒకటి. మరింత క్లిష్టమైన స్థాయిలో ఉన్నప్పటికీ, ' మురుగన్ అల్లదు ఆజాకు' గా ప్రచురించబడిన హిందూమతం లోని అందం అనే భావనపై ఇతడు చేసిన అధ్యయనం చాలా ప్రభావవంతంగా ఉంది. ఇతని రచనలు ఆ కాలంలోని భారతీయ మేధావుల అంతర్జాతీయ లక్షణాలను ప్రతిబింబించాయి.[2]
తన రచనలలో, తిరు వి. కా. తమిళ భాష అంతర్గతమైన లయలపై నిర్మించిన గద్య శైలిని అభివృద్ధి చేసి, లయబద్ధంగా ప్రవహించే వచనాన్ని రూపొందించాడు. తమిళ గద్య రచనలు ఇతడు అభివృద్ధి చేసిన శైలి ప్రభావంతో ఇప్పటికీ కొత్తగా ఉంటోంది. ఇతని రచనలు నేడు తమిళ భాషకు నూతన శక్తిని ఇచ్చాయని, ఆధునిక తమిళ గద్య శైలిని నిర్మించిన పునాదుల్లో భాగంగా పరిగణిస్తున్నారు.[3]
ఈ కాలంలో, తిరు వి. కా. రాజకీయాలలో, భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా కొనసాగాడు. తమిళనాడులో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మూడు స్తంభాలలో ఒకడిగా పరిగణించబడ్డాడు. 1926లో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు.[4] ఇతడు తమిళనాడులో విస్తృతంగా పర్యటించి, స్వాతంత్ర్య ఆవశ్యకతపై అనేక ప్రసంగాలు చేశాడు. ఇతడు తన అరవయ్యవ దశకంలో కూడా చురుకుగా ఉండి, 1947లో భారత స్వాతంత్ర్యం వచ్చే వరకు రాజకీయాల నుండి తప్పుకోలేదు.
తిరు వి. కా. 17 సెప్టెంబర్ 1953 న తన 71 సంవత్సరాల వయసులో మరణించాడు.[5]