తిరువారూర్ భక్తవత్సలం | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | తిరువారూర్, తమిళనాడు, భారతదేశం | 1956 నవంబరు 25
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వాయిద్యాలు | మృదంగం |
తిరువారూర్ భక్తవత్సలం[1] ఒక మృదంగ విద్వాంసుడు.[2]
ఇతడు తంజావూరుకు చెందిన సంప్రదాయ సంగీతవిద్వంసుల కుటుంబంలో 1956, నవంబరు 25వ తేదీన తిరువారూర్‌లో జన్మించాడు. ప్రస్తుతం ఇతడు చెన్నైలో నివసిస్తున్నాడు.
ఇతడు ప్రాథమిక సంగీత శిక్షణ తన మేనమామ తిరువారూర్ కృష్ణమూర్తి వద్ద తీసుకున్నాడు. తరువాత సంగీత విద్వాంసురాలైన ఇతని తల్లి టి.ఆర్.ఆనందవల్లివద్ద తన సంగీతానికి మెరుగులు దిద్దుకున్నాడు. కర్ణాటక, హిందుస్తానీ విద్వాంసులతో ఇతడు జుగల్‌బందీ కచేరీలు చేశాడు.
ఇతడు అమెరికా, బ్రిటన్, ఐరోపా, కెనడా, జపాన్, హాంగ్ కాంగ్, సింగపూరు, మలేసియా, ఫిలిప్పైన్స్, శ్రీలంక, అరబ్బు దేశాలు పలువురు సంగీతవిద్వాంసులతో కలిసి సందర్శించి అక్కడ అనేక కచేరీలు చేశాడు. ఇతడు విదేశాలలో జరిగే అనేక సంగీతోత్సవాలకు భారతదేశం తరఫున హాజరయ్యాడు. ఇతడు గత నాలుగు దశాబ్దాలుగా సంగీత కచేరీలు మూడు తరాలకు చెందిన కళాకారులతో కలిసి చేశాడు.
ఇతడు మృదంగ సహకారం అందించిన సంగీత విద్వాంసులలో ఎం.ఎల్.వసంతకుమారి, కె.జె.ఏసుదాసు, మదురై సోము, ఎన్.రమణి, వి.జి.జోగ్, భీమ్‌సేన్ జోషి, మహారాజపురం సంతానం, కె.వి.నారాయణస్వామి, టి.ఎన్.కృష్ణన్, టి.వి.శంకరనారాయణన్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మైసూర్ మంజునాథ్, ఉప్పలపు శ్రీనివాస్ మొదలైనవారున్నారు.
గణపతి సచ్చిదానంద స్వామి 68వ జన్మదినం సందర్భంగా 2010 మే నెలలో ఇతడు మైసూరులోని అవధూత దత్త పీఠంలో "లయమధుర మృదంగ యజ్ఞం" పేరుతో ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈ యజ్ఞంలో 108 మంది మృదంగ వాద్య కళాకారులు నాలుగు గుంపులుగా ఏర్పడి స్వామీజీకి అంకితం చేసిన "సచ్చిదానంద" అనే క్రొత్త రాగం ఆధారంగా కచేరీ నిర్వహించారు.
ఇతడు ఇలాంటి యజ్ఞమే కంచి కామకోటి పీఠంలో 76 మృదంగ విద్వాంసులతో ఇటీవల నిర్వహించాడు.
ఇతడు 2000లో "లయ మధుర స్కూల్ ఆఫ్ మ్యూజిక్" అనే సంగీత శిక్షణా సంస్థను స్థాపించి దానికి డైరెక్టర్‌గా ఉన్నాడు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. దీని శాఖలు కోయంబత్తూరు, టొరాంటో, కెనడా లలో ఉన్నాయి. ఔత్సాహికులైన యువ కళాకారులకు మృదంగంలో శిక్షణ ఇచ్చి వారిని విద్వాంసులుగా తీర్చిదిద్దే ఆశయంతో ఈ సంస్థ ఆరంభించబడింది. ఈ సంస్థ ప్రతియేటా లయమధుర సంగీతోత్సవం నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాల సందర్భంగా ఏటా ఒక అనుభవశాలి అయిన సంగీతవిద్వాంసుని సత్కరిస్తున్నది. ఈ ఉత్సవాలలో పేరుపొందిన కళాకారులచే సంగీత కచేరీలు నిర్వహిస్తారు.
మృదంగ వాద్యంలో ఇతడు చేసిన కృషికి ఇతడికి అనేక పురస్కారాలు లభించాయి. వాటిలో కొన్ని:
భక్తవత్సలం 1985 మార్చి 22వ తేదీన రాజంను పెళ్ళి చేసుకున్నాడు. ఇతని భార్య రాజం భరతనాట్య కళాకారుడు వళువూర్ రామయ్య పిళ్ళై మనుమరాలు. మరో భరతనాట్య విద్వాంసుడు వళువూర్ సామ్రాజ్ కుమార్తె. ఈ దంపతులకు హరిణి, మహాలక్ష్మి, లావణ్య అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. హరిణి, లావణ్య గాత్ర సంగీతం నేర్చుకుంటున్నారు. మహాలక్ష్మి దంతవైద్యురాలు. ఆమె భరతనాట్య కళాకారిణి కూడా.