తులుంగ్ లా | |
---|---|
ప్రదేశం | త్సోనా జిల్లా, టిబెట్, చైనా - తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్, |
శ్రేణి | హిమాలయాలు |
Coordinates | 27°52′57″N 92°15′04″E / 27.8825°N 92.2511°E |
![]() |
తులుంగ్ లా[a] అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలోని తవాంగ్ జిల్లానూ, టిబెట్ ప్రాంతంలోని త్సోనా జిల్లానూ కలిపే సరిహద్దు కనుమ.[4] ఇది రెండు జిల్లాల తూర్పు భాగంలో, గోరీ చెన్ పర్వతాల సమూహానికి దగ్గరగా, టిబెట్లోని త్సోనా చు నది, తవాంగ్ జిల్లాలోని తవాంగ్ చు పరీవాహక ప్రాంతాల మధ్య ఉంది. మెక్మహాన్ రేఖ ప్రకారం ఈ పరీవాహక ప్రాంత శిఖరం టిబెట్, భారతదేశాల మధ్య సరిహద్దును ఏర్పరుస్తుంది.[5][6] 1962 చైనా-భారత యుద్ధ సమయంలో చైనా దండయాత్ర తులుంగ్ లా గుండానే సాగింది. ఇక్కడ, ఇరుపక్షాల మధ్య అప్పుడప్పుడూ ఘర్షణలు జరుగుతూంటాయి.
తులుంగ్ లా, తవాంగ్ జిల్లాకు ఈశాన్య మూలలో ఉంది. 1912-1913లో టిబెట్ గుండా ప్రయాణించిన బ్రిటిషు అధికారి FM బెయిలీ, నామ్చా బార్వా లోని ఎత్తైన శిఖరాల నుండి తులుంగ్ లా వరకు నిరంతరాయంగా సాగే "ప్రధాన హిమాలయ శ్రేణి"ని గమనించాడు. ఇది పశ్చిమాన భూటాన్ సరిహద్దు వైపు కొనసాగుతుందని అతను గమనించాడు.[5] ఇది భారతీయ అన్వేషకుడు నైన్ సింగ్ గతంలో పేర్కొన్న మిలాకటాంగ్ లా (ప్రస్తుతం దీన్ని బుమ్ లా కనుమ అంటారు) గుండా వెళుతుంది. [7]
తులుంగ్ లాకు ఉత్తరాన సేతి చు నది ఉద్భవ స్థానాల్లో ఒకటి. ఇది లాంపగ్ (లాంగ్పో) పట్టణం సమీపంలో సోనా చు నదిలో కలుస్తుంది. సేతి చు మరొక ఉద్భవస్థానం పెన్ లా వద్ద ఉంది. ఇది ఈ లోయను సుబన్‌సిరి లోయతో కలుపుతుంది. తులుంగ్ లాకు దక్షిణంగా గోషు చు (గోరో చు అని కూడా పిలుస్తారు) నది ఉద్భవిస్తుంది. ఇది మాగో సమీపంలో మరో రెండు నదులను కలిసి తవాంగ్ చు నదిగా ఏర్పడుతుంది.
తులుంగ్ లా శిఖరం ఉత్తరాన సేతి చు, దక్షిణాన తవాంగ్ చు ఉపనదుల నీటిని విభజిస్తూ పశ్చిమ-నైరుతి దిశగా వెళుతుంది. ఇది యాంగ్ట్సే అని పిలువబడే ప్రదేశం వరకు వెళ్ళి, ఇక్కడ త్సోనా చు నది ఈ పర్వతాల గుండా పోతుంది. ఈ పర్వత శిఖరాలలో నిట్ట నిలువుగా ఉండే కొండపై నుండి పడిపోయే అద్భుతమైన చుమీ గ్యాట్సే జలపాతం ఉంటుంది. తులుంగ్ లా, యాంగ్ట్సే మధ్య ఉన్న మొత్తం రేఖను "యాంగ్ట్సే రిడ్జ్" అని కూడా అంటారు.
1914 నాటి సిమ్లా ఒప్పందం సందర్భంగా, బ్రిటిషు భారత విదేశాంగ కార్యదర్శి హెన్రీ మెక్‌మహాన్, టిబెట్ ప్లీనిపోటెన్షియరీ లోంచెన్ శాత్రా రెండు దేశాల మధ్య సరిహద్దు గురించి చర్చలు జరిపారు. ఈ సరిహద్దును మెక్‌మహాన్ రేఖ అని అంటారు.
సిమ్లా ఒప్పందంపై సంతకం చేయని రిపబ్లిక్ ఆఫ్ చైనా, 1935 నాటికి మెక్‌మహాన్ సరిహద్దును గుర్తించడానికి నిరాకరించింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కూడా దానిని అనుసరించింది. భారత్-చైనా మధ్య నేటికీ ఈ సరిహద్దు వివాదం కొనసాగుతోంది.
1962 లో చైనా, ఉత్తరం నుండి తవాంగ్ జిల్లాపై దాడి చేసి భారతదేశంపై యుద్ధం ప్రారంభించింది. చైనా దళాలు ప్రవేశించిన కనుమలలో తులుంగ్ లా ఒకటి. వారు పోషింగ్ లా గుండా వెళ్లి బోమ్‌దిలా, సె లా కనుమ ల మధ్య ఉన్న రహదారి మార్గాన్ని అడ్డుకున్నారు. ఈ చర్యతో సె లా వద్ద భారతీయ స్థానాలు నిలబడలేకపోయాయి.[8][9][10] యుద్ధంలో భారత్ ఓడిపోయింది. చర్చల ద్వారా సరిహద్దు పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించిన చైనా, యుద్ధం ముగిశాక పూర్వ స్థానాలకు ఉపసంహరించుకుంది.
1975 అక్టోబరులో తులుంగ్ లా వద్ద ఘర్షణ జరిగింది. అస్సాం రైఫిల్స్‌కు చెందిన భారత పెట్రోలింగ్‌పై చైనా సరిహద్దు దళాలు కాల్పులు జరపడంతో ఆరుగురిలో నలుగురు మరణించారు. భారతదేశం ప్రకారం, తులుంగ్ లాకు దక్షిణాన 500 మీటర్ల దూరంలో చైనా భారత సైనికులపై మెరుపుదాడి చేసింది. ఈ ఘర్షణ భారత భూభాగంలో జరిగింది. చైనా ఈ వాదనను ఖండిస్తూ, చైనా భూభాగంలోకి ప్రవేశించి ఘర్షణకు కారణమయ్యారని భారత సైనికులను నిందించింది.[11] వారం తర్వాత మృతదేహాలను స్వీకరించేందుకు వెళ్లిన భారత సైనికాధికారి, ఆ సైనికులు కాల్పుల్లో మరణించి ఉండకపోవచ్చని, చిత్రహింసలకు గురై మరణించారనీ అభిప్రాయపడ్డాడు.[12] తులుంగ్ లాలో మరణించిన సైనికుల స్మారకార్థం నిర్మించిన ఛెత్రీ యుద్ధ స్మారకాన్ని 2020 నవంబరులో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ప్రారంభించాడు.[13]
1975 తులుంగ్ లా సంఘటన 1962 యుద్ధానికి ముందు జరిగిన ఇతర శాంతికాల కాల్పుల సంఘటనలను - 1959 లాంగ్జు సంఘటన, 1959 కొంగ్కా పాస్ సంఘటన - గుర్తుచేస్తుంది. అవి యుద్ధానికి దారితీసేలా ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసాయి.[14] అయితే 1975 తర్వాత కాల్పుల ఘటనలు జరగలేదు. 1993లో, భారతదేశం, చైనాలు సరిహద్దుల పరిసరాల్లో తుపాకీలను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ సరిహద్దు శాంతి, ప్రశాంతత ఒప్పందంపై సంతకాలు చేశాయి.