తెన్నేటి హేమలత | |
---|---|
జననం | జానకీరామ కృష్ణవేణి హేమలత[1] నవంబరు 15, 1935 విజయవాడ |
మరణం | 1997 |
నివాస ప్రాంతం | విజయవాడ |
ఇతర పేర్లు | లత |
ప్రసిద్ధి | నవలా రచయిత్రి |
భార్య / భర్త | తెన్నేటి అచ్యుతరామయ్య |
తండ్రి | నిభానుపూడి నారాయణ రావు |
తల్లి | నిభానుపూడి విశాలాక్షి |
లత గా ప్రసిద్ధిచెందిన తెన్నేటి హేమాలత విజయవాడకు చెందిన నవలా రచయిత్రి . ఆవిడ చాలా నవలలు వ్రాశారు. ద్రౌపది అంతరంగాన్ని స్త్రీ కోణంలో చూపుతూ పాంచాలి పేరుతో ఒక నవలను వ్రాసారు. ఇది ప్రస్తుతం అందుబాటులో లేదు. 70 వ దశకం, 80 వ దశకం లలో ఈవిడ సాహిత్యం పై ఎన్నో చర్చలు జరిగాయి. ఈవిడ రాసిన రామాయణ విషవృక్ష ఖండన ప్రసిద్ధ రచన.
1935 నవంబరు 15 న విజయవాడలో నిభానుపూడి విశాలాక్షి, నారాయణరావు దంపతులకు జన్మించారు. ఆమెకు జానకి రమాకృష్ణవేణి హేమలత అని నామకరణం చేసారు. ఐదవ తరగతి వరకూ బడిలో చదువుకుని, ఆపైన తెలుగు, సంస్కృతం, ఆంగ్లం ఇంటి వద్దనే చదువుకున్నారు. తొమ్మిదోయేట ఆమెకు తెన్నేటి అచ్యుతరామయ్యతో వివాహం జరిగింది. ఆ సమయానికి అతడు ఆమెకన్నా ఏడేళ్ళు పెద్దవాడు, ఒక దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్నారు. ఈమె తండ్రి తన 32వ యేట మరణించేరు. అప్పటికి లతకి ఒక తమ్ముడు. ఆ తమ్మునిభారం తాను వహిస్తానని తండ్రికి మాట ఇచ్చేరామె ఆయన మరణసమయంలో. 1955లో విజయవాడలోని ఆకాశవాణి కేంద్రం నుండి అనౌన్సర్ గా ఈవిడ ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు. మొదట్లో రేడియో నాటకాల్లో పనిచేసి ఆపై సినిమాలలో కూడా నటించి, మాటలు వ్రాయటం మొదలుపెట్టారు. ఈవిడ మొదటి రేడియోనాటకం శిలాహృదయం (రాయి లాంటి మనస్సు). ఇది 1952 లో డెక్కన్ రేడియోలో ప్రసారం చేసారు. ఈమె మంగళంపల్లి బాలమురళీకృష్ణ అభిమాని, ఆయన సంగీతం కూర్చిన కొన్ని రాగాలకు సాహిత్య రచన కూడా చేసారు. భర్త ఆరోగ్యం క్షీణించడం ఒక పక్క, మరో పక్క ఇద్దరు పిల్లలు (మొదటి కొడుకు తెన్నేటి నారాయణరావు 1956 లో, రెండో కొడుకు తెన్నేటి మోహనవంశీ 1963 లో) సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పుట్టడంతో తీవ్రమయిన మానసిక క్షోభకు గురై, అదే విధంగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. జీవితంలో మొదటి నుండి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడానని (అంతరంగ చిత్రం) లో ఆవిడ చెప్పుకున్నారు. 1997 లో 65 యేట ఆమె కన్ను మూసారు.
లత గారు చాలా చిత్రమైన పరిస్థితిలో మరణించారు. విజయవాడలో ఆవిడ హెర్నియా (ఆడవారికీ వస్తుంది) ఆపరేషన్ కు ఒక ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆపరేషన్ సవ్యంగానే జరిగింది కాని, మత్తుమందు ఎక్కువగా ఇచ్చెయ్యటం వల్ల ఆవిడ తెరుకోలేకపోయ్యారు. ఆ మత్తు మందు వల్ల ఆవిడ మరణించారు.
లత తన నవల గాలిపడగలు-నీటి బుడగలులో వేశ్య ల దుర్భర బ్రతుకు చిత్రించారు. వారు మగాళ్ళ వద్ద అనుభవించే హింస, వారికి సంక్రమించే వ్యాధుల గురించి చర్చించారు.[2] ఎంత నిరసన వ్యక్తమయినా, ఆమె ఇదే విషయాన్ని తన రక్త పంకం అనే నవలలో మరింత లోతుగా విశ్లేషించారు. మోహనవంశీ, అంతరంగ చిత్రం అనే నవలలలో ఈమె జీవితానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు తెలుస్తాయి. 1980 లో ఈమె రామాయణ విషవృక్ష ఖండన అనే పుస్తకాన్ని రంగనాయకమ్మ రామాయణవిషవృక్షానికి విమర్శ-గ్రంథంగా వ్రాసారు. రామాయణ విషవృక్షం, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షానికి విమర్శ అని కొందరి వాదన. ప్రియతముడు అనే నవల హైదరాబాదు ఆరవ నిజాము మీర్ మహ్బూబ్ ఆలీ ఖాన్ జీవితం ఆధారంగా వ్రాసారు. లత ప్రకారం, ఆవిడ మాటల్లోనే, "నేను 105 నవల లు, 700 రేడియో నాటకాలు , 100 చిన్నికథలు , పది రంగస్థల నాటకాలు , 5 సంపుటాల సాహిత్య వ్యాసాలు , రెండు సంపుటాల సాహిత్య విమర్శలు , ఒక సంపుటి "లత వ్యాసాలు", ఇంకా 25 చరిత్రకందని ప్రేమకథలు అనే కవితలు వ్రాసాను."
ఈమె జీవితచరిత్రను ఘట్టి ఆంజనేయశర్మ సాహితీలత అనే పేరుతో రచించాడు.
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)