స్థానిక పేరు | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ |
---|---|
పరిశ్రమ | బస్ సర్వీసు |
స్థాపన | 2015 |
ప్రధాన కార్యాలయం | , బస్ భవన్ భారతదేశము |
సేవ చేసే ప్రాంతము | తెలంగాణ, పొరుగు రాష్ట్రాలు |
సేవలు | ప్రజా రవాణా |
ఉద్యోగుల సంఖ్య | 43,971 (2023 ఫిబ్రవరి) [1] |
మాతృ సంస్థ | రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ, తెలంగాణ ప్రభుత్వం |
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) అనేది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వంత రోడ్డు రవాణా సంస్థ. ఇది 2015లో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నుండి వేరుపడి యేర్పడింది,[2] రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ వంటి రాష్ట్రాలలోని నగరాలకు, పట్టణాలకు ఈ సంస్థ రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఈ సంస్థ ద్వారా రోజుకు సుమారు 9.2 మిలియన్ల ప్రజలకు సౌకర్యం కలుగుతుంది. ఈ సంస్థలో మూడు జోన్లు, వాటిలో 97 డిపోలు ఉన్నాయి.[3]
2023, జూలై 31న హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోగా,[4] ఈ ప్రతిపాదన బిల్లుకు ఆగస్టు 6న శాససభసలో ఆమోదం లభించింది.
1932లో నిజాం రాష్ట్ర రైల్వేలో భాగంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశారు. దీని పేరు ‘నిజాం రాష్ట్ర రైల్వే - రోడ్డు రవాణా శాఖ’ (ఎన్‌ఎస్‌ఆర్-ఆర్‌టీడీ) గా ఉండేది. ఈ సంస్థను 1951 నవంబరు 1 హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేసారు. 1932లో ప్రభుత్వమే రహదారులను జాతీయం చేసి బస్సులను నడిపింది. ఎన్‌ఎస్‌ఆర్-ఆర్‌టీడీ సంస్థను హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేసిన తేది. మొదటగా 27 బస్సులు, 166 మంది కార్మికులతో ప్రారంభమైంది.[5]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంనుండి తెలంగాణ విభజించబడిన తరువాత, 2015 జూన్ 3న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక సంస్థగా పనిచేయడం ప్రారంభించింది. తదనంతరం 1950 రోడ్డు రవాణా సంస్థ చట్టం ప్రకారం 2016 మార్చి 27న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్థాపించబడింది.
మంత్రివర్గ ఆమోదం
టీఎస్‌ఆర్టీసీని కాపాడుకుంటూ, ప్రజా రవాణాను విస్తృతపరిచి మరింత పటిష్ఠం చేయాలన్న సంకల్పంతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న నిర్ణయానికి 2023, జూలై 31న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని 2019లో ఆర్టీసీ కార్మికులు సమ్మెచేసిన నేపథ్యంలో ఆ కార్మికుల కోరికను మన్నిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.[6]
సబ్ కమిటీని ఏర్పాటు
ఇందుకు అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటుచేశారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఆర్‌అండ్‌బీ, రవాణాశాఖ కార్యదర్శులు, జీఏడీ, లేబర్‌తోపాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ తదితరలు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ పూర్తి నివేదికను సత్వరమే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.[7]
రాజ్ భవన్ కు బిల్లు
ఇది ఆర్థికపరమైన బిల్లు కావడంతో అందుకు అనుగుణంగా శాసనసభలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై నుంచి అనుమతి కోసం ఆగస్టు 2వ తేదీన మధ్యాహ్నం 3.30కు బిల్లు రాజ్ భవన్ కు పంపబడింది. అయితే, బిల్లు పరిశీలనకు కాస్త టైం కావాలని, దీనిపై న్యాయపరమైన సలహా తీసుకోవాలని ఉందని గవర్నర్ కార్యాలయం తెలుపుతూ ఆర్టీసీ ఉద్యోగులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఐదు అంశాలపై వివరణ కోరింది.[8]
కార్మికుల నిరసన
దాంతో గవర్నర్ నుంచి అనుమతి రాకపోవటంతో ఆగస్టు 5న ఆర్టీసీ ఉద్యోగులు డిపోల ముందు రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేపట్టి, మధ్యాహ్నం 12 గంటల వరకు బస్సుల బంద్ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు ఛలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించారు.[9]
గవర్నర్ ఆమోదం
గవర్నర్ వివరణ కోరిన ఐదు అంశాలపై 5వ తేదీ సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం తగిన విధంగా స్పందించి వివరణలు అందించింది. ఆగస్టు 6న మధ్యాహ్నం ఆర్టీసీ ఉన్నతాధికారులు గవర్నర్ ను కలిసి బిల్లులోని అంశాలపై స్పష్టత ఇవ్వగా, బిల్లుపై సమగ్ర నివేదిక తీసుకున్న అనంతరం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ ఆమోదం తెలిపింది.[10]
అసెంబ్లీలో ఆమోదం
గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఖజానాపై ప్రతి ఏడాది 3000 కోట్ల రూపాయల అదనపు భారం పడనుందని. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్సీనే ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుందని, ఆర్టీసీ కార్మికుల బకాయిలను చెల్లిస్తామని, ఆర్టీసీ కార్పొరేషన్, ఆస్తులు అలాగే ఉంటాయని, ఈ బిల్లుతో 43,055 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం ఆర్టీసీ కార్పొరేషన్ నిబంధనల ప్రకారమే కొనసాగుతారని మంత్రి తెలియజేశాడు.[11]
తుది ఆమోదం
అసెంబ్లీలో విలీన బిల్లును ప్రవేశపెట్టిన తరువాత, తుది ఆమోదం కోసం గవర్నర్ కు పంపించారు. బిల్లును పరిశీలించిన గవర్నర్, ప్రభుత్వారిని 10 సిఫారస్ లను చేసింది. వాటికి కూడా ప్రభుత్వం వివరణలు ఇచ్చింది. ఆ వివరణలతో సంతృప్తి చెందిన గవర్నర్ 2023, సెప్టెంబరు 14న తుది ఆమోదం తెలిపింది. దాంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.[12][13]
ఈ సంస్థకి మూడు జోన్లు ఉన్నాయి: హైదరాబాద్ రూరల్, గ్రేటర్ హైదరాబాద్, కరీంనగర్. ఇది 13 ప్రాంతాలు, 25 విభాగాలుగా విభజించబడింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో 10,460 బస్సులు ఉండగా, వీటిలో దాదాపు 2000 అద్దె వాహనాలు ఉన్నాయి. 36,593 రూట్లలో బస్సులు నడుపబడుతున్నాయి.
టి.ఎస్.ఆర్.టి.సిలో హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాదు, కరీంనగర్ అనే మూడు జోన్లు ఉన్నాయి. ఈ సంస్థలో 11 రీజన్లలో 95 డిపోలు, వాటికి చెందిన 357 బస్ స్టేషన్లు ఉన్నాయి.[14]
ఈ సంస్థలో లహరి బస్సు, వెన్నెల, గరుడ, గరుడ ప్లస్, రాజధాని,[15] ఇంద్ర, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, హైదరాబాదు సిటీ బస్సులు మొదలైన సర్వీసులు ఉన్నాయి. హైదరాబాద్ లో ట్యాంకుబండు చుట్టూ డబుల్ డెక్కర్ బస్సులను కూడా నడుపుతుంది, [16]టి.ఎస్.ఆర్.టి.సి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నడిపే బస్ సర్వీసు "పుష్పక్" అనే పేరుతో సేవలనందుస్తుంది.
ఈ సంస్థ ఆన్ లైన్ రిజర్వేషన్ సిస్టం ద్వారా అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తుంది.
రకం | సర్వీసు సంఖ్య |
---|---|
ఈ-గరుడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు | 10 |
గరుడ ప్లస్ (AC Semi-Sleeper Multi Axle) | 32 |
గరుడ (AC Semi-Sleeper Volvo/Isuzu) | 36 |
ఏసీ స్లీపర్ బస్సులు | 16 |
ఇంద్ర/రాజధాని (2 + 2 AC Semi-Sleeper) | 109 |
వెన్నెల (AC Sleeper) | 4 |
సూపర్ లగ్జరీ (2 + 2 Non-AC Pushback) | 504 |
డీలక్స్ (2 + 2 Non-AC) | 149 |
ఎక్స్‌ప్రెస్ (3 + 2 Non-AC) | 185 |
డబుల్ డెక్కర్ బస్సులు | 3 |
NOTE: ALL BUSES ARE RESERVED by tsrtconline.in
https://www.tgrtc.telangana.gov.in[17]
సంస్థ ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2019 అక్టోబరులో కార్మికులు సమ్మె చేసారు.
2020 జూన్ నెలలో, ఈ సంస్థ తన కార్గో సేవలను ప్రారంభించింది.[18] పాతవి, ఉపయోగించని బస్సులును పునరుద్దరించి ఈ కార్గో వాహనాలుగా మార్చారు. ప్రభుత్వ వస్తువులైన పుస్తకాలు, డిపార్ట్‌మెంటల్ మెటీరియల్‌లు, ప్రశ్నపత్రాలు, విద్యాసంస్థలకు సమాధాన పత్రాలు, ప్రభుత్వం సరఫరా చేసే ఇతర వస్తువులను రవాణా చేసే లక్ష్యంతో ఈ కార్గో సేవలు ప్రారంభించబడ్డాయి. ప్రతి డిపోకు 2 కార్గో వాహనాలు సరఫరా చేయబడ్డాయి.
కరోనా-19 సమయంలో ఔషధాలు, ఔషధ సామాగ్రి, వ్యవసాయ వస్తువులు, కిరాణా సామాగ్రి, ప్రభుత్వానికి ఇతర లాజిస్టిక్‌లను రవాణా చేయడానికి ఈ కార్గో వాహనాలు విస్తృతంగా ఉపయోగించబడ్డాయి.[19]
బస్సుకోసం గంటల తరబడి ఎదురిచూసే పని లేకుండా బస్సు ఎక్కడున్నది? ఎప్పుడు వస్తుందనేది ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ‘టీఎస్ ఆర్టీసీ బస్ ట్రాకింగ్’ పేరుతో గూగుల్ ప్లేస్టోర్‌లో మొబైల్ యాప్‌ను సంస్థ వైస్ చైర్మన్, ఎండీ వీసీ సజ్జనార్ 2022 జూలై 26న ప్రారంభించాడు. కంటోన్మెంట్, మియాపూర్-2 డిపోలకు చెందిన 40 ఏసీ పుష్పక్ బస్సులు, శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇతర సుదూర ప్రాంతాలకు నడుపుతున్న మియాపూర్-1 డిపోకు చెందిన 100 బస్సుల్లో ఈ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటుచేయబడింది. రాష్ట్రవ్యాప్తంగా 96 డిపోలు, 4,170 బస్సుల్లో ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకరానుండగా, ఈ యాప్ ద్వారా హైదరాబాద్ సిటీ, మెట్రో లగ్జరీ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్‌తోపాటు డిస్ట్రిక్ట్ సర్వీస్‌లకు వేర్వేరుగా ట్రాక్ చేయవచ్చు.[20]
హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు బాగా ప్రాచూర్యం పొందాయి. హైదరాబాద్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆ బస్సుల్లో ప్రయాణాన్ని ఇష్టపడడమేకాకుండా వాటిని చూసేందుకు కూడా జనాలు ఆసక్తిని కనబరిచేవారు. అయితే ఆ బస్ ప్రయాణికులు ప్రత్యేక అనుభూతిని ఆస్వాదించేవారు. కొంతకాలం తరువాత ఆ డబుల్ డెక్కర్ బస్సులు కనుమరుగయిపోయాయి. 2020 నవంబరు 7న ఒక ట్విటర్ యూజర్ పాత డబుల్ డెక్కర్ బస్సు ఫొటోను షేర్ చేసి, సిటీ పర్యాటకులు లేదా జనాల కోసం ఆ బస్సులను మళ్ళీ పునఃప్రారంభించాలని ఐటీశాఖామంత్రి కేటీఆర్ను కోరాడు. డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి హైదరాబాద్‌లో పున:ప్రవేశపెట్టేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని కేటీఆర్ హామీఇచ్చాడు.
ఇచ్చిన హామీ మేరకు 2023 ఫిబ్రవరి 7న మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను మంత్రి కేటీఆర్ ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎంపీ జి. రంజిత్ రెడ్డి, మజ్లీస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కో ఎలక్రిక్ బస్సు ధర 2.16 కోట్ల రూపాయలు. బస్సుల్లో డ్రైవర్‌తోపాటు 65 మంది ప్రయాణికులు కూర్చునేలా సీటింగ్ సామర్థ్యం ఉంది. బస్సు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.[21][22]
ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ హంగులతో తొలిసారిగా 'లహరి-అమ్మఒడి అనుభూతి' పేరుతో ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. మొదటి విడతగా కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులను నడుపుతుంది. హైదరాబాదు ఎల్బీనగర్‌లోని విజయవాడ మార్గంలో 2023 మార్చి 27న ఉదయం 9.30 గంటలకు తెలంగాణ రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి కొత్త ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించాడు.[23]
ప్రయాణికుల భద్రత కోసం ఈ బస్సుల్లో ట్రాకింగ్ సిస్టంతోపాటు పానిక్ బటన్ సదుపాయాన్ని కల్పించబడింది. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైతే పానిక్ బటన్‌ను నొక్కగానే టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్ రూంనకు సమాచారం అందుతుంది, అప్పుడు అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారు.
12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉంది. బెర్త్‌ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతోపాటు మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం, డిండ్ ల్యాంప్‌లు, ఉచిత వై-ఫై సౌకర్యం, గమ్యస్థానాల వివరాలు తెలిపేలా బస్సు ముందు, వెనక ఎల్ఈడీ డిస్ ప్లే బోర్డులు, బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాలు, రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా వంటి సదుపాయాలు ఉన్నాయి. బస్సులో మంటల చెలరేగగానే వెంటనే అప్రమత్తం చేసేందుకు అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం (ఎఫ్ డీఏఎస్) కూడా ఏర్పాటుచేయడం జరిగింది.[24]
పర్యావరణ అనుకూల ప్రజారవాణా కోసం ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చిన 10 ఈ -గరుడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను 2023 మే 16న హైదరాబాద్ మియాపూర్‌లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్యెల్యే అరికెపూడి గాంధీ, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు బస్ సర్వీస్‌లకు దీటుగా అత్యాధునిక సౌకర్యాలతో తయారుచేసిన ఈ బస్సులను 20 నిమిషాలకో ఈ-గరుడ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించగా, వచ్చే రెండేండ్లలో 1,860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటు తేనున్నారు. హైదరాబాద్ నగరం ప్రతిరోజు దాదాపు 50వేలమంది విజయవాడ, రాజమండ్రికి ప్రయాణిస్తుండడంతో మొదటగా విజయవాడకు ఈ సర్వీసులను ప్రారంభించారు. హైదరాబాద్-విజయవాడ మధ్య ఛార్జింగ్ కోసం సూర్యాపేటలో 20 నిమిషాలు ఆగుతాయి.[25][26]
రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్న ఉద్యోగులు, చిరువ్యాపారులకు ఆర్థిక భారం తగ్గించేందుకు “పల్లెవెలుగు టౌన్ బస్‌పాస్”ను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ 2023, జూలై 17న ఆవిష్కరించాడు. 10 కిలోమీటర్ల పరిధికి రూ.800, 5 కిలో మీటర్ల పరిధికి రూ.500గా పాస్ ధరను నిర్ణయించింది. మొదటిదశలో కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో జూలై 18 నుండి అమలుచేసింది.[27][28]
బస్సు ఎక్కడున్నదో, ఎప్పుడొస్తుందో తెలుసుకోవడానికి అత్యాధునిక ఫీచర్లతో 'గమ్యం' పేరుతో బస్ ట్రాకింగ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. 2023 ఆగస్టు 12న హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ ప్రాంగణంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఈ బస్ ట్రాకింగ్ యాప్‌ను ఆవిష్కరించాడు. సిటీ బస్సుల వివరాలను రూట్ నంబర్ ద్వారా, దూరప్రాంత సర్వీసుల వివరాలను రిజర్వేషన్ నంబర్ ఆధారంగా ట్రాకింగ్ చేయవచ్చు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్, ఈడీలు పురుషోత్తం, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, సంగ్రామ్ సింగ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.[29]
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)