త్రిభంగ భారతీయ సంప్రదాయ శిల్పం, చిత్రకళ, ఒడిస్సీ వంటి సంప్రదాయ నాట్యకళల్లో నిలిచివుండే భంగిమ.[1] త్రిభంగమంటే మూడు వంపుల భంగిమ. త్రిభంగ అన్న పదానికి అర్థం మూడు వంపులు అని; అలాగే ఆ భంగిమ మెడ, నడుము, మోకాలు వద్ద మొత్తం శరీరంలో మూడు వంపులతో ఉంటుంది, శరీరం నడుము, మోకాలు వద్ద వ్యతిరేక దిశల్లో వంపు తిరగడంతో "S" అక్షరం ఆకృతిలో ఉంటుంది.[2] ఒడిస్సీ నృత్యరీతిలోని భంగమల్లో అత్యంత పొగసైన, ఆకర్షణీయమైన భంగమగా భావించబడుతూంటుంది.[3] ఈ భంగిమలో తరచుగా కృష్ణుని రూపం కనిపిస్తూంటుంది.[4]
భారతీయ సంప్రదాయ నృత్యరీతియైన ఒడిస్సీ వివిధ భంగాలు లేదా భంగిమలతో కూడివుంటుంది. అవి మొత్తం నాలుగు - భంగ, అభంగ, అతిభంగ, త్రిభంగ, వీటన్నిటిలోనూ త్రిభంగ అత్యంత ప్రాచుర్యాన్ని పొందింది.[5] త్రిభంగ అనే సంస్కృత పదానికి అర్థం మూడు భంగాలు, అయితే కె.ఎం.వర్మ ప్రకారం త్రిభంగ అనేదేమీ ప్రత్యేకించి ఒక భంగిమను సూచించకపోగా అభంగ, సమభంగ, అతిభంగ అనే మూడు భంగాల సముదాయాన్ని సూచించే పదం.[6]
భారతీయ సంప్రదాయ నృత్యాలైన ఒడిస్సీ, భరత నాట్యం, కటక్, కూచిపూడి వంటివాటిలోని పలు ఇతర భంగిమల్లాగా త్రిభంగ కూడా భారతీయ శిల్పకళలోనూ కనిపిస్తుంది. సంప్రదాయికంగా చెట్టుకొమ్మను యక్షిణి ముట్టుకున్న భంగిమలో త్రిభంగ భంగిమ కనిపిస్తుంది. అలాంటి సాలభంజిక సా.శ. 12వ శతాబ్దానికి చెందిన హోయసలలు నిర్మించిన బేలూరు ఆలయాల్లో కనిపించగా, సా.శ.9వ శతాబ్దంలో నిర్మించిన ఖజురహో ఆలయాల్లో విష్ణువు వివిధ ప్రదేశాల్లో సాధారణంగా కృష్ణుని రూపాన్ని మలిచే విధంగా త్రిభంగ భంగిమలో వేణువు మ్రోగిస్తున్నట్టు కనిపిస్తారు.[5][7] ఆగమ శాస్త్ర గ్రంథాల ప్రకారం శివుని విగ్రహాలు త్రిభంగ భంగిమలో తూర్పు ముఖంగా నెలకొల్పాలి, ఇలాంటివి సా.శ. 8 నుంచి 12 శతాబ్దాల నాటి ఆలయాల్లో కనిపిస్తాయి.[8]
సింహాచల క్షేత్రంలోని ప్రధాన అర్చామూర్తియైన వరాహ లక్ష్మీనారసింహ స్వామి నిజరూప విగ్రహం త్రిభంగ భంగిమలోనే ఉంటుంది. దాని వెనుక సా.శ.1098 నాటి చోళ రాజు కులోత్తంగుని కాలపు శాసనం దొరుకుతోంది. తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలోని తిరుమల రామ విగ్రహం కూడా అదే భంగిమలో ఉంటుంది.[9] ఈ శైలి భారతీయ ముద్రగా చైనాకు కూడా ప్రయాణించి కిన్ యుగంలో నిర్మించిన మైజిషాన్ గ్రోట్టెస్ లోని కొన్ని శిల్పాల్లో కూడా కనిపిస్తుంది. టిబెట్ బౌద్ధశిల్పకళలోని అవలోకితేశ్వర విగ్రహాలు చాలావరకూ ఇదే భంగిమలో కనిపిస్తాయి. థాయ్ లాండ్ లోని కొన్ని బౌద్ధ వర్ణచిత్రాలు కూడా త్రిభంగ భంగిమలోనే కనిపిస్తాయి. అలాగే నారా, జపాన్ లో హకుహో యుగంలో నిర్మించిన ప్రాచీన యకుషి-జి బౌద్ధాలయాల్లోనూ కొందరు బోధిసత్త్వుల రూపాలు త్రిభంగ భంగిమలోనే ఉంటాయి.