త్రిభువన్‌దాస్ కిషీభాయ్ పటేల్ (1903 అక్టోబరు 22 – 1994 జూన్ 3) స్వాతంత్ర్య సమరయోధుడు, రైతు ఉద్యమనాయకుడు. 1946లో కైరా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని నెలకొల్పి, తర్వాతి కాలంలో దాన్ని అమూల్ గా మార్చడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తిగా సుప్రఖ్యాతుడు.
1903 అక్టోబరు 22న గుజరాత్ లోని ఆనంద్ లో కిషీభాయ్ పటేల్ కుమారునిగా జన్మించారు. త్రిభువన్‌దాస్ పటేల్ సహాయ నిరాకరణ ఉద్యమం సందర్భంగా స్వాతంత్ర్య సమరంలో ప్రవేశిస్తూనే మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ల అనుచరునిగా ప్రవేశించారు. భారత జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన పలు ఉద్యమాలు, రాజకీయ ఆందోళనల్లో భాగంగా 1930, 1935, 1942 సంవత్సరాల్లో కారాగారం పాలయ్యారు.[1]
1940ల నాటికి వల్లభ్ భాయి పటేల్ మార్గనిర్దేశంలో ఖేడా జిల్లా రైతులతో కలిసి వివిధ ఉద్యమాల్లో పనిచేయడం ప్రారంభించారు. 1947 నాటికి కైరా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని ఏర్పరిచి, పాల రైతులు దళారీలు, మధ్యవర్తులైన వ్యాపారుల బారిన పడకుండా స్వయం సమృద్ధి సాధించేలా కృషిచేయడం ప్రారంభించారు. విదేశాల్లో డైరీ ఇంజనీరింగ్ భారత ప్రభుత్వం అందించిన స్కాలర్షిప్ తో చదువుకుని భారతదేశం తిరిగివచ్చిన వర్గీస్ కురియన్ అనే యువ ఇంజనీరు త్రిభువన్ దాస్ పటేల్ గ్రామంలోనే ప్రభుత్వ శాఖలో పనిచేసేవారు. ఆయన ప్రతిభను గుర్తించి ప్రభుత్వోద్యోగం మానుకుని వెళ్తున్న సమయంలో తమ సంఘానికి పనిచేయమని ఉద్యోగమిచ్చారు. ఆ క్రమంలో వారిద్దరి నేతృత్వం అమూల్ సంస్థ ఏర్పాటుకు తద్వారా భారతదేశంలో శ్వేత విప్లవానికి నాంది పలికింది.[2][3]
త్రిభువన్‌దాస్ పటేల్ 1963లో సామాజిక నాయకత్వం రంగంలో కృషికి గాను రామన్ మెగసెసే పురస్కారం, దారా నసెర్వాంజీ ఖురోడీ, వర్గీస్ కురియన్ లతో సంయుక్తంగా అందుకున్నారు.[1], 1964లో భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ పురస్కారం పొందారు.[4]
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, అధ్యక్షునిగా, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగానూ, రెండు సార్లు రాజ్య సభ సభ్యునిగానూ వ్యవహరించారు.[5]