![]() డర్బన్ లోని శివాలయం | |
మొత్తం జనాభా | |
---|---|
5,69,476 (2011) 1.1% of the total Population | |
మతాలు | |
శైవం, వైష్ణవం, బౌద్ధం, ఇరాలు | |
గ్రంథాలు | |
భగవద్గీత, వేదాలు, పురాణాలు, రామాయణం, మహాభారతం | |
భాషలు | |
పవిత్ర సంస్కృతం ప్రాంతీయ హిందీ, తమిళం, గుజరాతీ, మొ |
హిందూమతం దక్షిణాఫ్రికా అంతటా ఆచరణలో ఉన్నప్పటికీ, ప్రధానంగా క్వాజులు-నాటల్‌లో ఉంది . 2011 జనాభా లెక్కల ప్రకారం దక్షిణాఫ్రికా జనాభాలో దాదాపు 1.1% మంది హిందువులున్నారు.[1] 1996 జనాభా లెక్కల్లో ఇది1.4%గా ఉంది. 2016 సాధారణ గృహ సర్వే నాటికి మరింతగా క్షీణించి 0.9%కి చేరింది.[2]
ఏది ఏమైనప్పటికీ, 2001లో సంఖ్యాపరంగా మాత్రం హిందువులు 5,51,669 నుండి 2011లో 5,69,476కి పెరుగారు. ఈ కొలత ప్రకారం, మారిషస్ తర్వాత ఆఫ్రికాలో హిందువులు అత్యధికంగా ఉన్న దేశం దక్షిణాఫ్రికాయే.
సంవత్సరం | శాతం | మార్పు |
---|---|---|
1994 | 1.4% | - |
2001 | 1.22% | -0.18% |
2011 | 1.1% | -0.12% |
2013* | 1.0% | -0.1% |
2016* | 0.9% | -0.1% |
*2013, 2016 నాటివి అధికారిక గణాంకాలు కాదు.
దక్షిణాఫ్రికాలో ఉన్న హిందువులలో ఎక్కువ మంది భారతీయ దక్షిణాఫ్రికా వాసులు. వీరిలో ఎక్కువ మంది బ్రిటిషు వలస ప్రభుత్వంలో 1860 నుండి 1919 వరకు తోటలలోను, ఐరోపా స్థిరనివాసుల యాజమాన్యంలో ఉన్న మైనింగ్ కార్యకలాపాలలోనూ పనిచేసేందుకు వలస వచ్చిన ఒప్పంద కార్మికుల వారసులే.[3] చాలా మంది తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, బీహార్, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి వచ్చారు. వారి భారతీయ సంతతి కారణంగా, వలసవాద, వర్ణవివక్ష యుగాలలో దక్షిణాఫ్రికాలో హిందూ స్థిరనివాసులు వివక్షకు, దుర్వినియోగానికీ, హింసకూ గురయ్యారు
తొలి హిందూ దేవాలయాలు 1870లలో వచ్చాయి. కొన్ని దక్షిణాఫ్రికా స్థానిక ప్రభుత్వాలు 1910లలో హిందువుల ఆలయ నిర్మాణాన్ని, ఆస్తి యాజమాన్యాన్ని నిషేధించాయి.[4] ఆధునిక దక్షిణాఫ్రికాలో అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడి హిందూ సమాజం దీపావళి వంటి ప్రధాన పండుగలను జరుపుకుంటుంది.
ఆధునిక దక్షిణాఫ్రికాలో హిందువుల మొదటగా ఎప్పుడు వచ్చారనే దానిపై వివాదం ఉంది. ఆధునిక దక్షిణాఫ్రికాకు వలసరాజ్యాల కాలంలో బ్రిటిషు సామ్రాజ్యానికి ఒప్పంద సేవకులుగా భారతీయులు మొదటిసారిగా చేరుకున్నారని కొందరు పండితులు పేర్కొంటారు.[5] మరి కొందరు, భారతీయులు 500-900 AD మధ్య ఇస్లామిక్ వ్యాపారులు వచ్చిన సమయంలోనే వచ్చారని అంటారు. మూడవ సమూహం వారు, హిందువులు సా.పూ. 1వ సహస్రాబ్ది నాటికి లేదా అంతకు ముందే వచ్చారని అంటారు.[6][7] ఈ మూడవ సమూహం వారు తమ సిద్ధాంతానికి మద్దతుగా భాషా, సాహిత్య, బంగారు మైనింగ్ ప్రక్రియలకు చెందిన పరోక్ష, సాంకేతిక సాక్ష్యాలను ఉదహరిస్తారు.[8] మొదటి రెండు సమూహాలకు మాత్రం వారి వాదనలకు మద్దతుగా పురావస్తు, చారిత్రక ఆధారాలు పుష్కలంగా ఉన్నాయి.
అనేక ప్రాచీన భారతీయ గ్రంథాలు షిప్పింగ్, వాణిజ్యాన్ని వివరిస్తాయి. కౌటిల్యుని అర్థశాస్త్రంలో దానికి ఒక అధ్యాయమే ఉంది. అందులో నవాధ్యక్ష లేదా నౌకాయాన మంత్రి అనే ఒక ప్రభుత్వ అధికారిని ప్రస్తావిస్తుంది. వీరి పని సముద్రపు దొంగలను పట్టుకోవడం, విచారించడం, ఓడరేవులను నిర్వహించడం, సుంకాలను వసూలు చేయడం. విల్‌ఫ్రెడ్ స్కాఫ్ సా.పూ. 1వ శతాబ్దం నాటికి తూర్పు, పశ్చిమ భారత తీరాల వెంబడి వరుసగా ఉన్న చురుకైన వాణిజ్య నౌకాశ్రయాలను సూచించాడు. మొజాంబిక్, స్వాహిలి తీరంలో ( టాంజానియా, కెన్యా ) హిందూ వర్తకులు, వ్యాపారులూ ఉన్నట్లు విస్తృతమైన ఆధారాలు ఉన్నప్పటికీ, ఆధునిక దక్షిణాఫ్రికా తీరంలో మాత్రం భారతదేశం నుండి వచ్చిన హిందువులు, నౌకాయానం లేదా వాణిజ్యం జరిపేవారని చెప్పేందుకు పురావస్తు ఆధారాలేమీ లభించలేదు. ఆధునిక దక్షిణాఫ్రికా చుట్టూ ఉన్న సముద్రం అల్లకల్లోలంగా ఉండడం, అందుకు భిన్నంగా, మొజాంబిక్, స్వాహిలి తీర ప్రాంతం ప్రశాంతంగా ఉండటం, భారతదేశం, ఆఫ్రికాల మధ్య సహజమైన వాణిజ్య గాలులు ఉండటం దీనికి కారణమని బ్రూనో వెర్జ్ పేర్కొన్నాడు. మొజాంబిక్‌కు చేరుకున్నాక, జింబాబ్వేలోని షోనా బంగారు గనుల ప్రాంతాలలోని భూమార్గం ద్వారా దక్షిణాఫ్రికాకు వెళ్ళి ఉండవచ్చని హ్రోమ్నిక్ పేర్కొన్నాడు.[9] హిందువులు దక్షిణాఫ్రికాకు మొదటగా వచ్చింది ఎప్పుడైనప్పటికీ, వారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంది. వలసరాజ్యాల శకానికి ముందు వారు తీరప్రాంతాలకు లేదా పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యారు.
19వ శతాబ్దపు వలసరాజ్యాల యుగంలో పెద్ద సంఖ్యలో హిందువులు (ఇతర మతస్థుల లాగే) దక్షిణాఫ్రికాలోకి రావడం ప్రారంభించారు. వీరిలో ఎక్కువగా ఒప్పంద కార్మికులుగాను, కొందరు "స్వేచ్ఛా" వలసదారులుగానూ వచ్చారు. 1833 నాటికి బ్రిటిషు సామ్రాజ్యం అంతటా బానిసత్వాన్ని రద్దు చేయడంతతో బ్రిటిషు మైనింగ్ కంపెనీలు, యూరోపియన్ తోటల యజమానులూ తమ చెరకు తోటలు, మైనింగ్ పనుల కోసం చౌకగా లభించే నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతను ఎదుర్కొన్నారు. అందుబాటులో ఉన్న స్థానిక కార్మికులను తక్కువ జీతం, కఠినమైన పని కోసం నిలుపుకోవడం కష్టంగా మారింది.[3][10] దాంతో బ్రిటిషు సామ్రాజ్యం ఒక ఒప్పంద కార్మిక వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇందులో బానిసత్వపు అంశాలే చాలావరకు ఉన్నాయి.[11]
ఈ కొత్త వ్యవస్థను 'కూలీ వ్యవస్థ' అని కూడా పిలుస్తారు.[12] దక్షిణాఫ్రికాకు, బ్రిటిష్ సామ్రాజ్యంలోని ఇతర ప్రాంతాలకూ హిందువులను తీసుకురావడానికి దీన్ని విస్తృతంగా ఉపయోగించారు. ఈ వ్యవస్థ భారతదేశంలోని అత్యంత పేద ప్రజలను ఒక ఒప్పందంపై సంతకం చేయమని ప్రలోభపెట్టింది. దీనిలో వారికి జీతంతో కూడిన ప్రయాణం, జీవనోపాధి హామీ ఇస్తారు. దానికి బదులుగా వారు నిర్ణీత కాలం (నాలుగు నుండి ఏడు సంవత్సరాలు) పాటు పని చేస్తానని హామీ ఇవ్వాలి. ఒప్పందం ముగియడానికి ముందే ఒప్పంద కార్మికుడు వెళ్ళిపోతే, అతన్ని నేరస్థుడిగా పరిగణించి జైలు శిక్ష విధిస్తారు.[3]
ఒప్పంద కార్మిక చట్టం రూపొందించబడినప్పుడు, ఒప్పందం ముగింపులో కార్మిడికి కొన్ని హక్కులు లభిస్తాయి; కొంత భూమిపై చట్టబద్ధమైన హక్కు, ఆ కొత్త భూమిలో ఉండేందుకు లేదా తిరుగు ప్రయాణానికి అవసరమైన డబ్బు కోసం యజమానిని డిమాండ్ చేసేందుకూ కార్మికుడికి హక్కు లభిస్తుంది. అయితే, 1880ల చివరలో దక్షిణాఫ్రికాలో, కొత్తగా విముక్తి పొందిన ఒప్పంద కార్మికుడు భారీగా పన్ను చెల్లించాల్సి వచ్చేది. కొత్త లేబర్ కాంట్రాక్ట్‌పై సంతకం చేసి ఆ పన్ను నుండి తప్పించుకునే వీలు కల్పించారు. దాదాపు 25% మంది హిందువులు మొదటి ఒప్పందం ముగిసిన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చారు. మిగతా హిందూ కార్మికులు తమ దేశంలో ఉన్న సంబంధాలను కోల్పోవడంతో అక్కడే ఉండిపోవడానికే నిర్ణయించుకున్నారు. వాళ్ళు కొత్త ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ వ్యవస్థే పెద్ద సంఖ్యలో హిందువులను దక్షిణాఫ్రికాలోకి తీసుకువచ్చింది.[13]
బ్రిటిషు సామ్రాజ్యంలో తోటల కోసం ఒప్పంద హిందూ కార్మికులను తీసుకుని మొదటి నౌకలు 1836లో భారతదేశం నుండి బయలుదేరాయి. కొంతమంది హిందువులు చట్టబద్ధంగా రిక్రూటయ్యారు. మరికొందరు దక్షిణాఫ్రికా నుండి ఫిజీ, ఆస్ట్రేలియా, కరేబియన్ వంటి బ్రిటిషు వలస రాజ్యాలలో దీర్ఘకాలిక ఒప్పంద సేవలోకి కిడ్నాప్ చేయబడ్డారు.[3][14]
దక్షిణాఫ్రికాలో, నాటల్‌లోని చెరకు తోటలపై పని చేయడానికి ఒప్పంద కార్మికులను తీసుకువచ్చారు, చెరకు వ్యవసాయం, చక్కెర భారతదేశంలో అప్పటికే ఉన్నందున కార్మికులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేకపోవడం, భారతీయ హిందువులు కరువు కాటకాలతో బాధపడుతూండడం దీనికి కారణం. బ్రిటిష్ వలససామ్రాజ్యం భారతదేశపు సారవంతమైన పొలాలను ఆహార పంటల నుండి బ్రిటిషు మిల్లులకు అవసరమైన పత్తి, యూరోపియన్లకు పొగాకు, చైనాకు గసగసాలు, నల్లమందు వంటి వాణిజ్య పంటలకు మార్చడంతో కరువులు, తీవ్ర పేదరికం ఎక్కువయ్యాయి.[15]
వలసల ప్రారంభ దశాబ్దాలలో, బానిసలుగా ఉన్న ఆఫ్రికన్ల మాదిరిగానే ఒప్పందం చేసుకున్న భారతీయుల పట్ల కూడా అమానవీయంగా ప్రవర్తించారు.[3][12] వారిని తమ ఎస్టేట్‌లకే పరిమితం చేసేవారు, అరకొర జీతాలు ఇచ్చేవారు. ఏదైనా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఆటోమేటిక్ జరిమానాలు, జైలు శిక్ష విధించేవారు. వీరిలో చాలా మంది భారతదేశంలో రేవుపట్టణాలకు దూరంగా లోతట్టు ప్రాంతాలకు చెందినవారు. వారికి ఉద్యోగాల ఆశ చూపి, చేసే పని గురించి చెప్పకుండా, పని ఎక్కడో చెప్పకుండా, తమ స్వస్థలాలను, సమాజాలనూ విడిచిపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పకుండా, మోసపూరితంగా దక్షిణాఫ్రికాకు తీసుకువచ్చారు.[16] సుదీర్ఘమైన, కష్టతరమైన నాలుగు నెలల సముద్ర ప్రయాణానికి ఏమాత్రం సిద్ధంగా లేని వారిని, వేచి ఉన్న ఓడలపై హడావిడిగా ఎక్కించి బయలుదేరదీసారు. ఈ ఓడల్లోను, ఆ తరువాత దక్షిణాఫ్రికా తోటలలోనూ వెట్టి చాకిరీ, వ్యాధులు, మరణం మామూలుగా ఉండేవి. ఈ రకమైన దుర్వినియోగం కారణంగా 1870ల ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో ఒప్పంద కార్మికుల నియామకంపై తాత్కాలిక నిషేధం విధించారు.
1874 నాటి చట్టంతో ఆ నిషేధం ఎత్తివేయబడిన తర్వాత, బ్రిటిషు అధికారులు ఉత్తర గంగా పరీవాహక ప్రాంతం లోను, దక్షిణ తమిళనాడులోని హిందూ కుటుంబాల లోనూ ప్లాంటేషన్ ఉద్యోగ అవకాశాల గురించి ప్రచారం చేశారు. వారి కుటుంబాలను తీసుకురావడానికి పురుషులను ప్రోత్సహించారు. వారికి జీతం, నివాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కుటుంబాలు తోటలలో పనిచేస్తున్నప్పుడు హిందూ మతాన్ని ఆచరించడం కొనసాగించుకోవచ్చని చెప్పారు. అయితే, వారు వచ్చిన తర్వాత, అనేక అవకతవకలు జరిగాయి. బయలుదేరే ముందు చేసిన వాగ్దానాలకూ వచ్చిన తర్వాత వాస్తవికతకూ చాలా తేడా ఉండేది.
1874 - 1911 మధ్య, దక్షిణాఫ్రికాలోని నాటల్ ప్రాంతంలో యూరోపియన్ ప్లాంటేషన్, ఫ్యాక్టరీల యజమానులు 364 నౌకల్లో భారతదేశం నుండి 1,46,000 మందిని తీసుకువచ్చారు.[17] ఇతర హిందూ కూలీలు (ఒప్పందించిన కార్మికులు) [18] తూర్పు కేప్, వెస్ట్రన్ కేప్, ఫ్రీ స్టేట్‌లలో వలస ప్రభుత్వంచే నియమించబడ్డారు. కాలక్రమేణా, వలస ప్రభుత్వం హిందువులను మూడు తరగతులుగా విభజించింది - వారి స్వంత ఖర్చులతో దక్షిణాఫ్రికాకు వచ్చిన "స్వేచ్ఛా" వ్యాపార తరగతి హిందువులు, గతంలో ఒప్పందాలలో పనిచేసి తరువాత స్వేచ్ఛ పొందిన హిందువులు (వీరు సాధారణంగా దుకాణాలు, లాజిస్టిక్‌లను నిర్వహించేవారు), "స్వేచ్ఛ లేని" ఒప్పందాలకు లోబడి ఉన్న హిందువుల తరగతి. ఈ మూడవతరగతి వారిపై ఒప్పందం కారణంగా వారి నివాసాలపైన, కదలికలపైనా నియంత్రణ ఉండేది.[10] భారతీయ హిందువులలో మొదటి రెండు తరగతులు అభివృద్ధి చెంది సంపన్నులయ్యారు. 1880ల చివరినాటికి యూరోపియన్ వ్యాపారులు వీరిని తమకు ఆర్థికపరమైన ముప్పుగా పరిగణించారు.
1890లలో జాతి మూలం ఆధారంగా వివక్షాపూరిత చట్టాలు చెయ్యడం మొదలైంది. దక్షిణాఫ్రికా వర్ణవివక్ష మూలాలు రూపుదిద్దుకోవడం మొదలైంది. 1890ల నాటి ఈ వాతావరణంలో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్న భారతీయ ప్రవాసులకు సేవలు అందించే న్యాయవాదిగా దక్షిణాఫ్రికాకు వచ్చాడు. దక్షిణాఫ్రికాలో పేద హిందువులపై వలసవాద దుర్వినియోగం, మతపరమైన మూసలు, జాతి వివక్ష అతనికి చూపిన అనుభవాలు అతని రాజకీయ, అహింసా ఉద్యమాన్ని రూపొందించాయి. అతను, ప్రిటోరియాలోని ఇతర హిందువులతో కలిసి, హిందూ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రచురణలు మొదలుపెట్టాడు. హిందూ సంస్థలను ప్రారంభించాడు. ఆపై అహింసాత్మకంగా మానవ హక్కులను కోరాడు. వారు, వర్ణాంతర సంబంధాలను మార్చే పౌర హక్కులను డిమాండ్ చేయడమే కాకుండా, దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న హిందువులలో సామాజిక సంస్కరణలను కూడా ఆశించారు.
మొదటి దక్షిణాఫ్రికా హిందూ దేవాలయాన్ని 1869లో నిర్మించారు.[19][20] "స్వేచ్ఛ" హిందూ సమాజం అభివృద్ధి చెందడంతో, డర్బన్, పీటర్‌మారిట్జ్‌బర్గ్, పోర్ట్ ఎలిజబెత్, జోహన్నెస్‌బర్గ్, ప్రిటోరియాలలో మరిన్ని దేవాలయాలను నిర్మించారు. అయితే, దక్షిణాఫ్రికాలో ఉన్న హిందువులు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చారు. వివిధ భాషలు మాట్లాడేవారు. హిందువులలో దేవాలయాలు, సామాజిక జీవితం వైవిధ్యంగా ఉండేవి. నల్లజాతి ప్రజలపై ఉన్న వివక్ష లాగానే యూరోపియన్ సెటిలర్లు హిందువులపై వివక్ష చూపారు. 1902 లో కొన్ని ప్రాంతీయ ప్రభుత్వాలు, హిందువులు భూమి కొనుగోలు చెయ్యడాన్ని, కొత్త ఆలయాలు నిర్మించడాన్ని నిషేధించాయి.[4] 1994 వరకు హిందువుల పట్ల మరింత తీవ్రమైన ఆంక్షలు విధించారు
తమిళ హిందువులకు 1875 నాటికే డర్బన్‌లోని ఉంబిలో శ్రీ అంబలవానార్ ఆలయం ఉండేది. ఈ ఆలయం 1905లో వరదల వల్ల దెబ్బతింది. దాని లోని దేవతా విగ్రహాలను ఇతర భాగాలనూ వరదలకు ముందు సంరక్షించి, సమీపంలోని వేరే చోటికి మార్చారు. ఇది 100 సంవత్సరాలకు పైగా వాడుకలో ఉంది. దక్షిణాఫ్రికాలో ప్రారంభ దేవాలయాలు సరళమైనవే అయినప్పటికీ అవి సాంప్రదాయిక హిందూ దేవాలయ రూపకల్పనను, నిర్మాణ శైలినీ అనుసరించాయి. తరువాత నిర్మించిన దేవాలయాలు పెద్దవి, మరింత విశాలమైనవి.
దక్షిణాఫ్రికాలో, హిందువులలో భాష, మతం మధ్య కొంత అస్పష్టత ఉంది. తమిళులు తమ మతాన్ని "తమిళ మతం" అని పిలవడం లేదా హిందీ మాట్లాడేవారు తమ మతాన్ని తమ భాష పేరున పిలుచుకోవడం అసాధారణం కాదు.[21] సాధారణంగా, దక్షిణ భారత మూలం ఉన్న హిందువులలో శివ పార్వతులను ఆరాధించడం సర్వసాధారణం. ఉత్తర భారత మూలం ఉన్నవారు రాముడిని పూజిస్తారు. గుజరాతీలు విష్ణువును ఆరాధిస్తారు. ఏది ఏమైనప్పటికీ, దక్షిణాఫ్రికాలో హిందువులందరి లోనూ సారూప్యత ఉన్న పద్ధతులు అనేకం ఉన్నాయి.[21]
దీపావళి దక్షిణాఫ్రికా హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. డర్బన్‌లో ఇది ఒక ప్రధాన ఆకర్షణ, ఇక్కడ ప్రతి సంవత్సరం బీచ్‌లో ప్రజా ఉత్సవాలు జరుగుతాయి. దక్షిణాఫ్రికాలోని తమిళ హిందువులు కావడిని కూడా ఆచరిస్తారు, కృష్ణ భక్తులు రథయాత్ర చేసుకుంటారు.
హిందువుల హరే కృష్ణ సమాజం దక్షిణాఫ్రికాలోని అనేక ప్రాంతాలలో చురుకుగా ఉంది.
ఒక పరిశోధన ప్రకారం, 88% కంటే ఎక్కువ మంది హిందువులు హిందూమతంలో భగవంతుని యొక్క ఏకేశ్వరవాద అవగాహనను ధ్రువీకరించారు, కేవలం 11% మంది బహుదేవతారాధన భావాలను అంగీకరించారు.
దక్షిణాఫ్రికాలో ఉన్న హిందువులలో ఎక్కువ మంది భారతీయ దక్షిణాఫ్రికా వాసులు .[22] హిందూ మతాన్ని అనుసరించే భారతీయ దక్షిణాఫ్రికన్ల నిష్పత్తి 1996లో 50% నుండి 2001లో 47.27%కి తగ్గింది.[22] ఇది 2016లో 41.3%కి తగ్గింది. క్రైస్తవ మిషనరీలు హిందువులను మతం మార్చడం దీనికి ప్రధానం కారణం .[23]
భారతీయ మూలాలున్న వారిలో క్రైస్తవుల సంఖ్య 1925 లో 4% నుండి 2011 లో 24.4%కు పెరిగింది [24] పెంటెకోస్టల్ ఉద్యమాలు హిందూ సమాజంలోకి ప్రవేశించడం, ముఖ్యంగా క్వాజులు-నాటల్ ఇండియన్ టౌన్‌షిప్‌లలో ఎక్కువగా జరిగింది.[24][25] 2018లో, "దక్షిణాఫ్రికా హిందూ ధర్మ సభ" అనే సంస్థ అధికారికంగా "అటువంటి మత మార్పిడిపై యుద్ధం ప్రకటించింది". ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లో లీగల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించడానికి నెదర్లాండ్స్‌కు చెందిన ఫౌండేషన్‌కి కనీసం 5,00 000 సంతకాలు అవసరమని దాని ప్రెసిడెంట్ రామ్ మహారాజ్ చెప్పాడు. అయితే మహారాజ్ వైఖరిని దక్షిణాఫ్రికాలోని ఇతర హిందూ సంస్థలు తిరస్కరించాయి.[26]