పంజాబ్ ప్రాంతంలో 18వ శతాబ్దం (1747-1780) నిర్వహించిన సిక్ఖు సైన్యాన్ని దాల్ ఖల్సా అని పిలుస్తారు. 1699లో గురు గోబింద్ సింగ్ ఏర్పరిచిన ఖల్సా సైన్యాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ దాల్ ఖల్సా ఏర్పరిచారు. దాల్ ఖల్సాలో రెండు భాగాలు ఉంటాయి, తరుణ దాల్, బుధ దాల్. తరుణ దాల్ లో 40 సంవత్సరాల వయసులోపల ఉన్న యువకులు చేరుతారు. దీని ప్రధాన లక్ష్యం యుద్ధం చేయడమే. ఖల్సా సైన్యపు యుద్ధ బలగం ప్రధానంగా తరుణ దాల్ యే. 40 సంవత్సరాల వయసు దాటిన వృద్ధులతో బుధ దాల్ ఏర్పడుతుంది. బుధ దాల్ లో ఉన్నవారు గురుద్వారాల నిర్వహణ, సిక్ఖు బోధలు ప్రవచించడం వంటివి చేస్తూంటారు. అయితే వీరు రాజకీయంగా జరుగుతున్న మార్పులు, సైనిక బలగం కదలికలు, రాజకీయపుటెత్తుగడలు పరిశీలించి తరుణ దాల్ కు చేరవేస్తూంటారు
సిక్ఖు మతంలో మొదటి నలుగురు గురువులైన గురు నానక్, గురు అంగద్, గురు అమర్ దాస్, గురు రాందాస్ ల హయాంలో సిక్ఖులకు మొఘల్ ప్రభుత్వంతో ఏ విధమైన శత్రుత్వమూ లేదు. అప్పటి అక్బర్ చక్రవర్తి మత సామరస్య విధానం వంటివాటి వల్ల ఇంకా సిక్ఖుల అభివృద్ధికి రాజ్యం ఆటకం కలిగించలేదు. ఐతే సిక్ఖుల ఐదవ గురువు గురు అర్జున్ను రాజకీయ ఖైదీగా బంధితుణ్ణి చేసి, చిత్రహింసలు పాలుచేసి మొఘలులు దారుణంగా చంపేశారు. దీంతో సిక్ఖు మతం రాజకీయంగానూ, సైనికంగానూ గొప్ప మలుపుతీసుకుంది. అప్పటివరకూ ఆధ్యాత్మికపరమైన మతం ఆయన మరణం వల్ల ఆత్మరక్షణ చేసుకుని, పరిపాలించే రాజకీయ మలుపు తీసుకుంది. గురు హర్ గోబింద్ సిక్ఖు మతంలో సైనిక సంప్రదాయం ప్రారంభించారు. ఆ క్రమంలో పదవ గురువు గురు గోబింద్ సింగ్ ఇక తన తర్వాత గురు గ్రంథ్ సాహిబే ఇక శాశ్వతమైన గురువు అనీ, సిక్ఖు పంత్ భౌతికాధికారానికి అధికారి అని నిర్ణయించారు. గురు గోబింద్ సింగ్ స్వయానా ఖల్సాను స్థాపించారు.
గురు గోబింద్ సింగ్ మరణించడానికి ముందు హిందూ సాధువుగా జీవిస్తున్న వ్యక్తికి సిక్ఖు మతంపై ఆసక్తి కల్పించి ఆయనకు బందా సింగ్ బహదూర్ అని పేరు పెట్టారు. ఆయనను సిక్ఖుల సైన్యాధ్యక్షునిగా నియమించి పంజాబ్ పంపారు. ఆయన నాయకత్వంలో ఖల్సా సైన్యం మంచి విజయాలు సాధించింది. బందా సింగ్ బహదూర్ తన తిరుగుబాటును ప్రారంభించి సమానా, సధౌరా ప్రాంతాల వద్ద ముఘల్ సైన్యాలను ఓడించారు. ఆ క్రమంలోనే సిర్ హింద్ నగరంలో గెలుపొంది, గురు గోబింద్ సింగ్ ను చంపించి, ఆయన నలుగురు కుమారులను చంపిన వజీర్ ఖాన్ ను పట్టి మరణశిక్ష అమలు చేశారు. ఆయన హిమాలయాల్లో నెలకొన్న లోహ్ ఘర్ నగరాన్ని రాజధానిగా చేసుకుని సట్లెజ్, యమున నదుల మధ్య ప్రాంతంలో ఖల్సా రాజ్యాన్ని స్థాపించి పాలించారు. తన పాలనలో జమీందారీ వ్యవస్థను రద్దుచేసి సాగుచేసుకుంటున్న రైతులకే భూమిపై అధికారాన్ని కల్పించారు. 1716లో గురుదాస్ నాంగల్ కోటను ముట్టడించే యత్నంలో ముఘలుల చేతిలో ఓడిపోయారు. 700 మంది అనుచరులతో సహా బందా సింగ్ బహదూర్ ముఘల్ సైన్యానికి పట్టుబడగా అందరినీ దారుణంగా చంపేశారు.
బందా సింగ్ బహదూర్ మరణం, ఖల్సా రాజ్య పతనం 1716లో జరిగాకా మొఘల్ సామ్రాజ్యం సిక్ఖులపై తీవ్రమైన అణచివేతకు పాల్పడింది. సిక్ఖులు ఇస్లాంలోకి మారడం కానీ, మరణించడం కానీ జరగాలని మొఘల్ పాదుషా ఫరూఖ్ సియర్ శాసించారు. దాని ఆధారంగా ప్రభుత్వాధికారులు గ్రామస్థాయి అధికారులకు సిక్ఖులను పట్టి చంపాలని, లేదా బంధించాలని ఆదేశాలు జారీచేశారు. సిక్ఖులను చంపినవారికీ, ఆచూకీ తెలిపి పట్టించినవారికీ బహుమతులు ప్రకటించారు. ఆ సమయంలో సిక్ఖులు అడవుల్లోకి పారిపోవడం కానీ, బాహ్య చిహ్నాలు విడిచిపెట్టి మళ్ళీ హిందువుల్లో చేరిపోవడం కానీ, ఖల్సా పొంది బాహ్య చిహ్నాలు స్వీకరించకుండా రహస్యంగా ఉండిపోవడం కానీ చేసేవారు. వందలాది మంది సిక్ఖులను గ్రామాల్లోంచి బయటకు తెచ్చి చంపేశారు. ఆ దశలో ఖల్సాలో చేరిన కపూర్ సింగ్ మంచి వ్యూహకర్త, గొప్ప సైనిక నాయకుడిగా ఎదిగారు. ఆయన నేతృత్వంలో ఖల్సా సైన్యం పంజాబ్ ప్రాంతం మొత్తం నుంచీ లాహోరుకు, అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళే ప్రభుత్వ ధనాన్ని లూటీచేస్తూ, మధ్య ఆసియా ప్రాంతం నుంచి వచ్చిపోయే బిడారులపై దాడులు చేస్తూ తమ బలాన్ని పెంచుకుని, ప్రభుత్వాన్ని దెబ్బతీశారు. ఆ దశలో పంజాబ్ నుంచి కొన్నేళ్ళ పాటు ఏ మాత్రం రెవెన్యూ చేరలేదు.
చివరకు ప్రభుత్వం సిక్ఖుల సహకారం లేకుండా పంజాబ్ ప్రాంతాన్ని పరిపాలించడం అసాధ్యమన్న అభిప్రాయానికి వచ్చింది. దాంతో సిక్ఖులతో జరుగుతున్న యుద్ధాన్ని ఆపివేసి, వారిని దారికి తెచ్చుకోవాలని భావించి వారికి నవాబురికాన్ని, జాగీరును ఇచ్చేందుకు ముందుకువచ్చారు. ముందు ఖల్సా అంగీకరించకపోయినా శాంతి సమయం తమ అభివృద్ధికీ, ప్రస్తుతం ఉన్న అనిశ్చితి తాత్కాలికంగానైనా ఉపకరిస్తుందన్న ఆలోచనతో అంగీకరించారు. అయితే ప్రభుత్వం సూచించిన సిక్ఖుకు కాదని కపూర్ సింగ్ ను ఎంపికచేశారు. ఆ శాంతి సమయాన్ని అవకాశంగా ఉపయోగించుకున్నారు. ఈ దశలోనే కపూర్ సింగ్ దాల్ ఖల్సాకు నాంది పలికారు.
కపూర్ సింగ్ నాయకత్వంలో సిక్ఖులు ఖల్సాను రెండుగా విభజించుకున్నారు. ఆ రెండు విభాగాలను తరుణ దాల్, బుధ దాల్ లుగా పిలిచారు.
నవాబ్ కపూర్ సింగ్ చేపట్టిన చర్యలు ఇలా ఉన్నాయి:[3]
తరుణ దాల్లో వేగంగా 12 వేలమంది చేరారు, క్రమంగా అంతమందికి ఒకే ప్రదేశంలో ఉంచి నివాస, ఆహార అవసరాలు చూసుకోవడం కష్టమైపోయింది.[3] దాంతో దాల్ ను ఐదుగా విభజించేందుకు నిశ్చితమైంది, దాల్ కు చెందిన ఐదు విభాగాలు ఒకే ప్రధాన నిల్వలోంచి పదార్థాలు తీసుకుని, స్వంత లాంగర్లలో వండుకునేవారు.[4] అమృత్ సర్ లోని ఐదు పవిత్ర సరోవరాలైన రాంసర్, బిబేక్ సర్, లచ్మన్ సర్, కౌల్ సర్, సంతోఖ్ సర్ ల చుట్టుపక్కల ఈ ఐదు విభాగాలు నిలిచివుండేవి.[5]
ఈ విభాగాలు తర్వాతి కాలంలో మిస్ల్లు అయి సంఖ్య పదకొండుకు పెరిగింది. ఒక్కోటీ పంజాబ్ లో ఒక్కో ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్నారు. వారంతా కలిసి సర్బత్ ఖల్సాగా ఏర్పడ్డారు.
సిక్ఖు మత ఆవిర్భావం నుంచి చరిత్రలోకెల్లా అత్యంత తీవ్రమైన నిర్బంధం, అణచివేత, హత్యాకాండ ఎదుర్కొన్న దశలో దాల్ ఖల్సా ఏర్పాటు ఎదురుదాడికి వీలిచ్చింది. తరుణ్ దాల్ లో ఏర్పడ్డ ఐదు విభాగాలు పదకొండుగా మారి మిస్ల్ లు అయ్యాయి. పంజాబ్ ను సిక్ఖులు నియంత్రణలోకి తీసుకోవాలని కపూర్ సింగ్ పిలుపునిచ్చాకా జరిగిన పోరాటం తర్వాతికాలంలో ఆ పదకొండు మిస్ల్ లు పంజాబ్ లోని వివిధ భాగాలను పరిపాలించాయి. చారిత్రికంగా ఈ మిస్ల్ ల ఏర్పాటు 19వ శతాబ్దిలో సిక్ఖుల స్వయంపాలనను సుసాధ్యం చేసిన సిక్ఖు సామ్రాజ్యం ఏర్పాటుకు పునాదిగా నిలిచింది. తద్వారా సిక్ఖుల చరిత్రలోనూ, పంజాబ్ చరిత్రలోనూ దాల్ ఖల్సా సుస్థిర స్థానాన్ని పొందింది, చారిత్రక క్రమంలో కీలకమైన మలుపుల్లో ఒకటయింది.