దీపేందర్ సింగ్ హుడా | |
---|---|
పార్లమెంట్ సభ్యుడు, రాజ్యసభ | |
Assumed office 2020 ఏప్రిల్ 10 | |
అంతకు ముందు వారు | కుమారి సెల్జా, (భారత జాతీయ కాంగ్రెస్) |
నియోజకవర్గం | హర్యానా |
పార్లమెంటు సభ్యుడు లోక్ సభ | |
In office 2005 – 2019 మే 23 | |
అంతకు ముందు వారు | భూపిందర్ సింగ్ హూడా, (భారత జాతీయ కాంగ్రెస్) |
తరువాత వారు | అరవింద్ కుమార్ శర్మ, భారతీయ జనతా పార్టీ |
నియోజకవర్గం | రోహ్తక్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ఢిల్లీ, భారతదేశం | 1978 జనవరి 4
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | శ్వేతా మిర్ధా హుడా |
తండ్రి | భూపిందర్ సింగ్ హూడా |
నివాసం | ఢిల్లీ, భారతదేశం |
నైపుణ్యం | రాజకీయ నాయకుడు సామాజిక కార్యకర్త |
దీపేందర్ సింగ్ హుడా' (జననం 1978 జనవరి 4) భారతీయ రాజకీయ నాయకుడు.[1] ఆయన భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా నాలుగు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడు, ప్రస్తుతం ఆయన హర్యానాకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు. ఆయన రోహ్తక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 2005–2019ల మధ్యకాలంలో లోక్‌సభకు మూడు సార్లు పార్లమెంటు సభ్యునిగా ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుడు, ఇది భారత జాతీయ కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ.[2][3]
ఎంపీగా తన 15 ఏళ్ల పదవీకాలంలో, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, సుజుకి మోటార్‌సైకిల్స్.. వంటి కంపెనీలతో 5,500 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక మోడల్ టౌన్‌షిప్(IMT)ని రోహ్‌తక్‌లో ఏర్పాటుచేసాడు.
అలాగే, ఆయన ఐఐఎమ్, ఐఐటీ ఎక్స్‌టెన్షన్ క్యాంపస్, ఝజ్జర్‌లో దేశంలోనే అతిపెద్ద క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లను స్థాపించడంలో సహాయం చేశాడు. రూ. 5,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించడంతోపాటు, తన నియోజకవర్గంలో ఎఫ్‌డిడిఐ, ఐహెచ్‌ఎంలను ఏర్పాటు చేసారు.
ప్రజా సేవలో ఆయనది, అతని కుటుంబంలోని నాల్గవ తరం, తండ్రి భూపిందర్ సింగ్ హుడా రెండు పర్యాయాలు హర్యానా ముఖ్యమంత్రిగా చేసాడు, తాత రణబీర్ సింగ్ హుడా స్వాతంత్ర్య సమరయోధుడు, రోహ్‌తక్ నుండి 1వ, 2వ లోక్‌సభలకు రాజ్యసభ సభ్యుడు కూడా.[4][5] ఇక, అతని ముత్తాత చౌదరి మాతు రామ్ ఒక సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, మహాత్మా గాంధీతో సన్నిహితంగా ఉండేవాడు.
2005లో రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు దీపేందర్ సింగ్ హుడా అతి పిన్న వయస్కుడైన పార్లమెంటేరియన్.[6] అతను ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఇతర ప్రముఖ వార్తాపత్రికలలో భారతీయ ఆర్థిక శాస్త్రం, అంతర్జాతీయ వ్యవహారాలపై తరచుగా వ్యాసాలు రాస్తూంటాడు.[7]
రోహ్‌తక్‌లోని మోడల్ స్కూల్, ఆర్.కె పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అజ్మీర్ లోని మాయో కాలేజ్[8] లలో దీపేందర్ సింగ్ హుడా చదువుకున్నాడు.
ఆయన భివానీలోని టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్స్‌టైల్ & సైన్సెస్ నుండి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, కెల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లతో పాటు న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ప్రతిష్టాత్మక క్యాంపస్ లా సెంటర్, ఫ్యాకల్టీ ఆఫ్ లా నుండి పొందాడు.
2020లో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యాడు. దానకి ముందు రోహ్‌తక్ నియోజకవర్గం నుండి మూడు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 16వ లోక్‌సభలో భారత జాతీయ కాంగ్రెస్ విప్‌గా పనిచేశాడు.[9] ఆయన కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీకి ఎన్నికైన బోర్డు సభ్యునిగా వివిధ హోదాల్లో అనేక ఇతర చట్టబద్ధమైన, పార్లమెంటరీ సంస్థలలో కూడా పనిచేశాడు; ఎనర్జీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా; ఇండో-యుకె పార్లమెంటేరియన్ల ఫోరమ్ ఛైర్మన్‌గా. గతంలో, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, వ్యవసాయం, మానవ వనరుల అభివృద్ధి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలలో కూడా ఆయన సభ్యుడు.[10]
రాజస్థాన్‌లో భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్న నాథూరామ్ మిర్ధా మనవరాలు శ్వేతా మిర్ధాను దీపేందర్ సింగ్ హుడా వివాహం చేసుకున్నాడు.[11] ఆమె అక్క, జ్యోతి మిర్ధా, రాజస్థాన్‌లోని నాగౌర్ నుండి కాంగ్రెస్ మాజీ ఎంపీ. శ్వేత, దీపేందర్ దంపతులకు కొడుకు కేసర్బీర్(Kesarbir) ఉన్నాడు.
గతంలో, దీపేందర్ సింగ్ హుడా గీతా గ్రేవాల్‌ను వివాహం చేసుకున్నాడు, వారు 2005లో విడాకులు తీసుకున్నారు.