ద్రావిడ విశ్వవిద్యాలయం | |
రకం | Public |
---|---|
స్థాపితం | 1997 |
ఛాన్సలర్ | Governor of Andhra Pradesh |
వైస్ ఛాన్సలర్ | Prof. E. Sathyanarayana |
స్థానం | కుప్పం, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము |
కాంపస్ | గ్రామీణ |
జాలగూడు | అధికారిక వెబ్‌సైటు |
ద్రవిడ విశ్వవిద్యాలయం చిత్తూరు జిల్లా కుప్పంలో ఉంది. ద్రవిడ సంస్కృతులను, స్వభాషా, స్వజాతులను రక్షించుకోవడం, అభివృద్ధి పరచడం ఈ విశ్వ విద్యాలయ వ్యవస్థాపక లక్ష్యాలు.
వ్యవస్థాపక లక్ష్యాల సాధన కోసం ఈ విశ్వ విద్యాలయం త్రిరాష్ట్ర కూడలి అయిన కుప్పంలో 1997 అక్టోబరు 20న ప్రారంభింపబడింది. విశ్వవిద్యాలయ స్థాపన కోసం వెయ్యి ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. కంప్యూటర్ సైన్స్, సీడీఎల్‌పీ, చరిత్ర విభాగాలతో ప్రారంభమై 27 విభాగాలకు విస్తరించింది. ఇక్కడి వాతావరణం పల్లెటూరిని తలపించే విధంగా ఉంటుంది.
ఇక్కడ ద్రవిడ భాష, సంస్కృతులపై విస్తృత పరిశోధనలు సాగుతున్నాయి. సంస్కృతి, భాష, చరిత్ర పరిరక్షణకు నాలుగు రాష్ట్రాల నుంచి 27 ద్రవిడ భాషల్లో అనేక వందల మంది పరిశోధకులు, పరిశోధనలకు వేదికగా నిలిచింది. వందల సంఖ్యలో గ్రంథాలు.. వేల సంఖ్యలో పరిశోధన పత్రాలు ప్రచురించి ద్రవిడ భాష, శాస్త్ర, జానపద కళలకు జీవం పోస్తోంది. ఇప్పటివరకు 500 మందికిపైగా విద్యార్థులు పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు. జానపద కళలు, భాషలు ఇలా అనేక అంశాలపై పరిశోధనలు సాగుతున్నాయి. ప్రధానంగా ద్రవిడ భాషలకు సంబంధించి 300 పరిశోధన పత్రాలు సమర్పించారు. జానపద గిరిజన అధ్యయన శాఖ తరఫున విస్తృత స్థాయిలో పరిశోధనలు సాగించడానికి ‘ద్రవిడియన్ ఇండేజ్డ్ లాంగ్వేజ్’ పథకం కింద యూజీసీ రూ.1.6 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో అంతరించిపోతున్న చిన్నచిన్న భాషలను గుర్తించి... కోలారు, చిత్తూరు, కృష్ణగిరి జిల్లాల్లో రికార్డు చేసి భద్రపరిచే ప్రక్రియ జరుగుతోంది. శాప్ పథకం కింద మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో నాయిక, కొలాని తదితర భాషలపై ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత ద్రవిడ వర్సిటీలో మాత్రమే పరిశోధనలు సాగుతున్నాయి.
భారతదేశంలో అంతరించిపోతున్న మూలికా వైద్యాన్ని భావితరాలకు అందించాలన్న ఆశయంతో విశ్వవిద్యాలయంలో మూలికా వనాన్ని ఏర్పాటు చేశారు. ఈ వనంలో 250 రకాల వనమూలికలు ఉన్నాయి. 10 ఎకరాల విస్తీర్ణంలో 2500 వనమూలికల మొక్కలు పెంచుతున్నారు. ఈ మొక్కలతో బయోటెక్నాలజీ విభాగం పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థులు ఎలుకలపై ప్రయోగాలు చేస్తున్నారు.
ఒకప్పుడు ఏడు వేల పుస్తకాలతో ప్రారంభమైన గ్రంథాలయం నేడు.. 84,387 పుస్తకాలను కలిగివుంది.. 2012లో ఏర్పాటైన డిజిటల్ గ్రంథాలయంలో ప్రతి విద్యార్థి ఉచితంగా గంట పాటు అంతర్జాల సేవలు పొందే అవకాశాన్ని కల్పించారు. ప్రతిరోజూ 150 మంది విద్యార్థులు డిజిటల్ గ్రంథాలయంలో అంతర్జాల సేవలు అందుకుంటున్నారు. యూజీసీ సహకారంతో అంతర్జాలం ద్వారా జర్నల్స్‌ను పరిశీలించుకొనే అవకాశాన్ని కల్పించారు. 163 జర్నల్స్‌తో పాటు నాలుగు భాషల్లో 18 దినపత్రికలు అందుబాటులో ఉన్నాయి. ప్రతిఏటా రూ.35 లక్షలు జర్నల్స్, పుస్తకాలు, దినపత్రికల కోసం వెచ్చిస్తున్నారు.