ధర్మరత్న లేదా గోభరణ లేదా జు ఫాలన్ (Zhu Falan) (చైనా: 竺法蘭) క్రీ. శ. 1 వ శతాబ్దానికి చెందిన భారతీయ బౌద్ధ సన్యాసి. చైనా చక్రవర్తి మింగ్ ఆహ్వానం మేరకు క్రీ. శ. 68 లో తన సహచర బౌద్ధ సన్యాసి కశ్యప మాతంగునితో కలసి చైనాలో అడుగుపెట్టాడు. కశ్యప మాతంగుడు, ధర్మరత్నలను చైనాలో బౌద్ధ ధర్మాన్ని ప్రవేశపెట్టిన తొలి వ్యక్తులుగా ప్రాచీన చైనీయ సంప్రదాయం గుర్తించింది.
ధర్మరత్న గురించిన విశేషాలు చైనీయ ఆధారాల నుండి కొద్దిగా తెలుస్తున్నాయి. ఇతను మధ్య భారత దేశానికి చెందిన బౌద్ధ బిక్షువు. బాల్యం నుండే బౌద్ధం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆనతి కాలంలోనే బౌద్ధ ధర్మంలో నిష్ణాతుడయ్యాడు. ఇతని సహచర బిక్షువు కశ్యప మాతంగుడు. హాన్ వంశానికి చెందిన తూర్పు చైనా చక్రవర్తి మింగ్ (Ming) (క్రీ. శ. 28-75) ఆహ్వానం మేరకు వీరిరువురూ భారతదేశం నుండి బయలుదేరి సా.శ. 68 లో అతని రాజధాని 'లోయాంగ్' (Luoyang) చేరుకొన్నారు.[1] చక్రవర్తి ఆదరణతో వైట్ హార్స్ ఆలయం (white horse temple) లో నివాసం ఏర్పరుచుకొని ఆరు బౌద్ధ గ్రంథాలను చైనీయ భాషలోనికి అనువదించారు. వీటిలో “నలభై రెండు విభాగాల సూత్రం” (Sutra of Forty Two Chapters) ముఖ్యమైనది.
ప్రాచీన చైనీయ బౌద్ధ సంప్రదాయంలో తూర్పు చైనా పాలకుడు, హాన్ వంశీయుడైన “మింగ్” (Ming) చక్రవర్తి సా.శ. 68 లో ఒక స్వప్నం గాంచినట్లు చెప్పబడింది. ఆ స్వప్నంలో చక్రవర్తికి తలపై నుండి వెదజల్లబడుతున్న కాంతి కిరణాలతోను, బంగారు వర్ణంతోను భాసిల్లుతున్నఒక తేజోమూర్తి కనిపించడం జరిగింది.[2] ఆ కలను విశ్లేషించిన అతని సలహాదారులు ఆ తేజోవలయ మూర్తిని బుద్ధుని ఆత్మగా గుర్తించారు. తద్వారా ఆ స్వప్నం పశ్చిమం నుండి బుద్ధుని ఆగమనాన్ని సూచిస్తున్నదని చక్రవర్తికి తెలియచేసారు. అయితే పండితులు ఈ స్వప్న వృత్తాంతాన్ని చారిత్రకంగా విభేదిస్తారు. మింగ్ చక్రవర్తి స్వప్న వృత్తాంతం (క్రీ. శ. 68) నాటికి ముందుగానే బౌద్ధ మతం చైనాలో ప్రవేశపెట్టబడిన సాక్ష్యం వున్న కారణంగా వారు స్వప్న వృత్తాంతం యొక్క చారిత్రిక ప్రామాణికతను ప్రశ్నించారు.
మింగ్ చక్రవర్తి భారతదేశం నుండి బౌద్ధాచార్యులను తీసుకొని రమ్మని జాంగ్ కియాన్ (Zhang Quian) [2] ఆధ్వర్యంలో తసాయీ ఇన్, సింగ్ గింగ్, వాంగ్ స్వాంగ్[3] లతో కూడిన ఒక దౌత్యబృందాన్ని పశ్చిమ దిక్కుగా పంపడం జరిగింది. క్రీ. శ. 68 లో తిరిగి చైనాకు చేరుకొన్న ఆ దౌత్య బృందం తమతోపాటు భారతదేశం నుండి కశ్యప మాతంగ, ధర్మరత్న అనే ఇద్దరు బౌద్ధ సన్యాసులను చక్రవర్తి ఆస్థానానికి తీసుకొని వెళ్ళారు. ఆ సమయంలో వాయువ్య భారతదేశాన్ని చారిత్రకంగా కుషాణులు పరిపాలిస్తున్నట్లు తెలుస్తున్నది.
బౌద్ధ బిక్షువులను, బౌద్ధ సాహిత్యాన్ని తమ దేశానికి మోసుకొని వస్తున్న అశ్వాల (Horses) పట్ల కృతజ్ఞతగా మింగ్ చక్రవర్తి తన రాజధాని 'లోయాంగ్'లో ప్రసిద్ధ "వైట్ హార్స్ ఆలయం"ను (white horse temple) నిర్మించాడు. చైనాలోని మొట్టమొదటి బౌద్ధ ఆలయంగా గుర్తించబడిన ఈ ఆలయం ఇప్పటికీ నిలిచేవుంది. చరిత్రలో ఎన్నోమార్లు నాశనమై పునర్నిర్మించబడిన ఈ ఆలయం యొక్క ప్రస్తుత వాస్తు నిర్మాణం ప్రధానంగా 16 వ శతాబ్దానికి చెందినదిగా కనిపిస్తుంది. కశ్యప మాతంగ, ధర్మరత్న సన్యాసులకు చక్రవర్తి ఈ ఆలయంలోనే నివాసం ఏర్పాటు చేసాడు.[4] ఇక్కడనుండే వీరిరువురూ బౌద్ధ గ్రంధాలను చైనీయ భాషలోనికి అనువదించారు.
కశ్యప మాతంగ, ధర్మరత్నలిరువురూ కలసి చేసినటువంటివిగా చెప్పబడుతున్న అనువాదాలు మొత్తం ఆరు వున్నాయి. వీటిలో చివరి ఐదు కాలగర్భంలో అంతరించిపోగా మొదటిదైన నలభై రెండు విభాగాల సూత్రం ఒక్కటే ప్రస్తుతం లభ్యమవుతుంది.
అయితే నలభై రెండు విభాగాల సూత్రం గ్రంధానికి ఆపాదించబడిన సా.శ. 1 వ శతాబ్దం అంత విశ్వసనీయ యోగ్యంగా లేని కారణంగా దీని అనువాద కాల నిర్ణయంలో కొద్దిపాటి విభేదాలు చోటుచేసుకొన్నాయి. అనువాద కాలంపై కొద్ది వ్యత్యాసం ఉన్నప్పటికీ, సాంప్రదాయికంగా “నలభై రెండు విభాగాల సూత్రం” గ్రంథాన్ని చైనా భాషలో అనువదించిన తొలి భారతీయ గ్రంథంగా గుర్తించారు.
చైనాలో బౌద్ధ ధర్మ ప్రచారానికి పాటుపడిన ధర్మరత్న 60 సంవత్సరాలకు పైబడిన వయసులో రాజధాని 'లోయాంగ్'లో మరణించాడు.[4] తన జీవిత కాలమంతా వైట్ హార్స్ ఆలయ మఠంలోనే గడిపిన ధర్మరత్న మరణాంతరం, అదే ఆలయ ద్వారానికి లోపలివైపున పశ్చిమ దిశలో ఖననం చేయడం జరిగింది. అతని సమాధికి (tomb) ఎదురుగా తరువాతి కాలంలో ఒక డ్రమ్ టవర్ (drum tower) ను ఏర్పాటు చేసారు.