ధ్యాన బుద్ధ | |
---|---|
ప్రదేశం | అమరావతి, పల్నాడు జిల్లా |
అక్షాంశ,రేఖాంశాలు | 16°34′44″N 80°21′11″E / 16.5789°N 80.3531°E |
ఎత్తు | 125 అడుగులు (38 మీ.) |
పూర్తయింది | 2015 |
పరిపాలన సంస్థ | ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ |
వాడిన వస్తువులు | కాంక్రీటు, రాయి |
ధ్యాన బుద్ధ విగ్రహం ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి లో ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్న గౌతమ బుద్ధుడి విగ్రహం.[1] ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు. ఇది కృష్ణా నది ఒడ్డున నాలుగన్నర ఎకరాల స్థలంలో ఇది నెలకొల్పబడింది. సా.పూ 200 నుంచి సా. శ 200 మధ్యలో ఈ ప్రాంతంలో విలసిల్లిన బౌద్ధ సాంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ కళాఖండాలు ఏర్పాటు చేశారు.
అమరావతి, దాని సమీపంలోని ధరణికోట గురించిన లిఖిత చరిత్ర సా.పూ 5వ శతాబ్దం నాటిది. సా.శ.పూ 3వ శతాబ్దం నుంచి సా.శ 3 వ శతాబ్దం దాకా ఈ ప్రాంతాన్ని ఏలిన శాతవాహనుల రాజధాని ఇది. వీరు హిందూ మతంతో పాటు బౌద్ధ మతాన్ని కూడా ఆదరించారు. అమరావతిలో ముఖ్యమైన చారిత్రక స్థలం అక్కడున్న మహాచైత్యం. దీన్ని భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థ పర్యవేక్షిస్తూ అక్కడే ఒక సంగ్రహాలయాన్ని కూడా నడుపుతుంది.
ఈ విగ్రహ నిర్మాణం 2003 లో ప్రారంభించి 2015లో పూర్తి చేశారు.[2] మోక్షాన్ని సాధించడానికి బుద్ధుని అష్టాంగమార్గం ప్రతీకగా ఈ విగ్రహం ఎనిమిది స్తంభాలపై భారీ కమలం అకారంలోని పునాదిపై వుంది.ఈ ప్రాంతం నాలుగు విభాగాలను కలిగివుంది. ఇవి నాలుగు ఉదాత్త సత్యాలకు ప్రతీకలు. [3]ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ బౌద్ధ సిద్ధాంతాల నేపథ్యంతో నిర్మించిన ఉద్యానవనాన్ని పూర్తి చేసి 2018లో ప్రజల సందర్శనకు అనుమతించనుంది.[4]
ఈ విగ్రహం అడుగున గల మూడు అంతస్తుల ప్రదర్శనశాలలో బౌద్ధ ప్రాముఖ్యత కలిగిన దృశ్యాలను వర్ణించే అమరావతి కళ యొక్క శిల్పాలు ఉన్నాయి. భారతదేశం, ప్రపంచంలోని ప్రదర్శనశాలలలోగల అమరావతి మహాచైత్య స్థూపం శిలాఫలకాల ఆధునిక నకళ్ళు ఇక్కడ వున్నాయి.