నందకం అంటే శ్రీమహావిష్ణువు చేతిలో ఉండే కత్తి. అన్నమయ్య దీని అంశచే జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. మహా విష్ణువు శ్రీకృష్ణావతారంలో ఉన్నపుడు రుక్మిణిను అపహరించి తెచ్చి పెళ్ళిచేసుకుంటాడు.అప్పుడు వాళ్ళను రుక్మిణి అన్న రుక్మి అడ్డుకుంటాడు. వారిద్దరి మధ్య యుద్ధం కూడా జరుగుతుంది. అన్నను చంపడానికి రుక్మిణి ఒప్పుకోదు. రుక్మి విల్లమ్ములు నాశనం చేసేదాకా ఇతర ఆయుధాలు వాడతాడు. యుద్ధం చివరి దశలో శ్రీకృష్ణుడు ఈ కత్తిని ఉపయోగించి రుక్మికి శిరోముండనం చేయిస్తాడు. మీసాలు గొరిగిస్తాడు. అలా చేస్తే శత్రువు ఓడిపోయినట్లే లెక్క.
విష్ణువును సాధారణంగా నాలుగు చేతులు కలిగిన విగ్రహంగా చూపడం పరిపాటి. ఒక చేతిలో పాంచజన్యం (శంఖం), రెండో చేతిలో సుదర్శన చక్రం, మూడో చేతిలో పద్మం, నాలుగో చేతిలో కౌమోదకం (గద) ఉంటాయి. ఎనిమిది లేదా పదహారు చేతులు కలిగిన రూపాల్లో ఒక చేతిలో కత్తి ఉన్నట్లు చూపిస్తారు. కానీ కత్తి చేతిలో ఉన్న రూపం అంత ఎక్కువగా కనిపించదు. గుప్తుల కాలం (సా. శ. 320–550) నుంచి ఎక్కువగా కనిపిస్తూ ఉంది.
హిందూ పురాణాల్లో విష్ణువు ఒక్కో ఆయుధం ఎలా సంపాదించడనడానికి విస్తృతమైన కథనాలు ఉన్నా, కత్తి మాత్రం ఎలా సంపాదించడనడానికి ఎలాంటి కథనాలు లేవు. రామాయణంలో మాత్రం రాముడి వర్ణనలో చూచాయగా కనిపిస్తుంది.[1]
విష్ణు సహస్ర నామాల్లో నందకం రెండు సార్లు కనిపిస్తుంది. ఒక మంత్రంలో విష్ణువును శంఖం, నందకం, చక్రం ధరించినవాడిగా కీర్తిస్తుంది. 994 వ నామం నందకి (నందకం ధరించిన వాడు).[2]
ఉత్తర ప్రదేశ్ లోని దియోఘర్ లో గుప్తుల కాలానికి చెందిన ఒక ఫలకం మీద శేషశాయియైన విష్ణువు, దాని పక్కనే కత్తి పట్టుకుని నిలుచుని ఉన్న ఒక యువకుడి రూపంలో నందకుడిని చూపించారు. ఆయుధ పురుషుడు విష్ణు ఆయుధాలను మధు కైటబుల మీదకు ఎత్తిచూపుతున్నట్లు ఉంటుంది.[3][4] మహాబలిపురం లోని మషిషాసుర మర్దిని మండపంలో కూడా నందకుడిని ఒక ఆయుధ పురుషుడిగా చిత్రీకరించి ఉన్నది.