?నర్సంపేట్ తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 17°55′35″N 79°53′49″E / 17.926394°N 79.896941°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 11.52 కి.మీ² (4 చ.మై)[1] |
జిల్లా (లు) | వరంగల్ జిల్లా |
అధికార భాష | తెలుగు |
పురపాలక సంఘం | నర్సంపేట్ నగర పంచాయితీ |
నర్సంపేట్, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, నర్సంపేట మండలానికి చెందిన గ్రామం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ గ్రామీణ జిల్లా లోకి చేర్చారు.[2][3] ఆ తరువాత 2021 లో, వరంగల్ గ్రామీణ జిల్లా స్థానంలో వరంగల్ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.[3] ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 175 కి.మీ.దూరంలో ఉంది. వరంగల్ జిల్లా కేంద్రానికి 40కి.మి.ల దూరంలో ఉంటుంది.తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో నర్సంపేట్ ఒకటి.
లోగడ గ్రామ పంచాయితీగా ఉన్న నర్సంపేట్ 2011 సంవత్సరంలో ది.03.09.2011 నుండి పురపాలక సంఘంగా ఏర్పడింది.[4]
ఈపట్టణంలోని పరిపాలన వార్డుల సంఖ్య మొత్తం 20.దీని అధికార పరిధి 11.52 కి.మీ2 (4.45 చ. మై.).[1]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా - మొత్తం 36,241 - పురుషుల సంఖ్య 18,502 - స్త్రీల సంఖ్య 17,739 - గృహాల సంఖ్య 8,726.
పూర్వం ఈ పట్టణాన్ని పాఖాల తాలూకాలో ఓ గ్రామంగా భావించారు, కాల క్రమేన పెద్ద గ్రామంగా, పట్టణంగా రూపాంతరం చెందింది. ఇటివల చేసిన జిల్లాల విభజనలో నర్సంపేట్ డివిజన్ వరంగల్ రూరల్ జిల్లాలోకి వెళ్ళింది. దీంతో జిల్లాలో పెద్ద నగరంగా అవతరించింది. ఒక విధంగా జిల్లా కేంద్రంగా మారబోతుంది. డివిజన్ కేంద్రమైన నర్సంపేట్ పరిధిలోనికి చెన్నారావుపేట, దుగ్గొండి, ఖానాపురం, నల్లబెల్లి,నర్సంపేట్,నెక్కొండ మండలాలు వస్తాయి. ప్రస్తుతం సుమారు 50వేల జనాభాతొ దినదినాభివృద్ధి చెందుతుంది. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నర్సంపేట్ ను పురపాలక (నగర పంచాయతి) గా గుర్తించింది. ఈ పట్టణంలో బస్సు డిపో ఉండగా ఆర్థికంగా ముందుకు సాగుతుంది.ఈ ప్రాంతం నుండి హైదరాబాదు, వరంగల్, కరీంనగర్, నిజామబాద్, ఖమ్మం, కామారెడ్డి, మంచిర్యాల, భద్రాచలం, గోదావరిఖని,నిర్మల్, రామగుండం, కొత్తగూడెం వంటి ప్రాంతాలకు, బాసర, యాదగిరి,వేములవాడ,శ్రీశైలం,కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రలకు రోడ్డు రవాణ ఉంది. మహారాష్ర్ట లోని సిరొంచ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంట (తిరుపతి)కి వెళ్లే జాతీయ రహదారి - 365 నర్సంపేట్ డివిజన్ లోని మల్లంపల్లిలో ప్రారంభమై నల్లబెల్లి మండలంలోని పలు గ్రామాలతో పాటు నర్సంపేట్ అర్బన్, రూరల్ మండలాలు, ఖానాపురం, మహబూబాబాద్ జిల్లా గూడురు, మహాబూబాబాద్ అర్బన్, రూరల్, మర్రిపేడల మీదుగా వెల్తుంది. నర్సంపేట్ సిటికి ముందు హనుమాన్ తండా వద్ద టోల్ ప్లాజాను ఏర్పాటు చేస్తున్నారు. నర్సంపేట్ నగరానికి 9కిలోమీటర్ల దూరంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాఖాల సరస్సు, దట్టమైన అభయారణ్యం ఉంది. ఈ సరస్సు చందాలు అటవి అందాలు ఎంతో భాగుంటాయి. పట్టణం లోని మాధన్నపేట సరస్సు కూడా చూడదగిన ప్రదేశం. తెలంగాణ రాష్ట్రంలోనే శబరిగా పేరుగాంచిన శ్రీ ధర్మశాస్త అయ్యప్ప దేవాలయము ఇక్కడ గలదు. ప్రతి యేటా శబరిలో నిర్వహించిన మాదిరిగా ఇక్కడ కూడా పంబారట్టు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలోనే అతి పేద్ద పైలాన్ ఇక్కడ ఉంది. నర్సంపేట్ పట్టణంలో అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. బాలాజి ఇన్ స్టూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సైన్సు, జయముఖి ఇన్ స్టూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సైన్సు, మహేశ్వరం శివాని గురుకులం, సిద్దార్ద గురుకులంతో పాటు మరిన్ని విద్యాసంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసి, బీఈడి,పీజి, డిగ్రి, జునియర్,ఐటిఐ కళాశాలలున్నాయి.
తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతానికి చెందిన యువత, ఉద్యోగ, వ్యాపార, కార్మిక రంగాలకు చెందిన వారు నర్సంపేట్ డివిజన్ ఐక్య కార్యాచరణ సమితి (జేఎసి) ఆధ్వర్యంలో ముందుండి పొరాడారు. సుమారు రెండు సంవత్సరాలు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రీలే నిరాహార దీక్షలు చేసి తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతాన్ని ముందుందని నిరూపించారు. ఉద్యమ సమయానా పట్టణానికి చెందిన రాజ్ కుమార్ చారి అనే ఉద్యమ కారుడు తన ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకొని అసువులు భారాడు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపుమేరకు రాస్తారోకో, దర్నా, వంటావార్పు, ముట్టడి వంటి అనేక ఉద్యమాలు జరిగాయి.
నర్సంపేట కమ్యూనిటీ హాస్పిటల్ ను రూ. 58 కోట్ల అంచనా వ్యయంతో 330 పడకల జిల్లాస్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు, రూ. 1.25 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే టి. డయాగ్నస్టిక్ సెంటర్, రూ. 4 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే 25 హెల్త్ సబ్ సెంటర్లకు 2022 మార్చి 5న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీష్ రావు శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపి మాలోతు కవిత, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[5] ఈ ఆసుపత్రి ఆధునీకణ వల్ల నర్సంపేట ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండడంతోపాటు ఇక్కడ ఏర్పాటు చేస్తోన్న టీ. డయాగ్నోస్టిక్ సెంటర్లో 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారు.
నర్సంపేటలో ఇంటింటికీ గ్యాస్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన పీఎన్‌జీ గ్యాస్ లైన్‌ను 2022 ఏప్రిల్ 20న తెలంగాణ రాష్ట్ర పురపాలక, పరిశ్రమల, ఐటీశాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించాడు. తక్కువ ధరకే గ్యాస్ అందించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన ఈ పీఎన్‌జీ గ్యాస్ లైన్ కింద 12,600 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. 50 లక్షల రూపాలయతో నిర్మించిన గ్రంథాలయ నూతన భవనాన్ని, 30 లక్షల రూపాలయతో నిర్మించిన మెప్మా నూతన భవనాన్ని, చెన్నారావుపేట, దుగ్గొండి మండలాల్లో కోటి రూపాయలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాలను ప్రారంభించడంతోపాటు మున్సిపల్ కార్యాలయంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్కు శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపి మాలోతు కవిత, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్-పశ్చిమ వరంగల్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[6][7]