నర్సింగ్ యాదవ్ | |
---|---|
జననం | మైల నరసింహ యాదవ్ 1968 జనవరి 26 |
మరణం | 2020 డిసెంబరు 31 | (వయసు 52)
ఇతర పేర్లు | నర్సింగ్ |
వృత్తి | నటుడు |
జీవిత భాగస్వామి | చిత్ర |
పిల్లలు | రుత్విక్ |
నర్సింగ్ యాదవ్ (జనవరి 26, 1968 - డిసెంబరు 31, 2020) తెలుగు చలనచిత్ర నటుడు.[1] ఇతడు తెలుగు, తమిళ, హిందీ భాషలలో కలిపి సుమారు 300 చిత్రాలకు పైగా నటించాడు.[2] ఎక్కువగా ప్రతినాయక, హాస్యప్రధాన పాత్రలు పోషించాడు. కొబ్బరి బోండాం, మాయలోడు, అల్లరి ప్రేమికుడు, ముఠామేస్త్రి, మాస్టర్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఇడియట్, గాయం, పోకిరి, యమదొంగ, జానీ, ఠాగూర్, శంకర్ దాదా ఎం. బి. బి. ఎస్ మొదలైనవి నర్సింగ్ యాదవ్ నటించిన ముఖ్యమైన చిత్రాలు.
మూత్రపిండాల వ్యాధితో 2020 డిసెంబరు 31న హైదరాబాదులో మరణించాడు.
ఆయన అసలు పేరు మైల నరసింహ యాదవ్. సినీ పరిశ్రమలో ఈయన్ను నర్సింగ్ యాదవ్ అని పిలిచేవారు. నర్సింగ్ యాదవ్ 1968, జనవరి 26న రాజయ్య, లక్ష్మీ నరసమ్మ దంపతులకు హైదరాబాదులో జన్మించాడు. హైదరాబాదులోని న్యూ సైన్సు కళాశాలలో ఇంటర్మీడియట్ దాకా చదివాడు. ఆయన భార్య చిత్ర యాదవ్. కుమారుడు రుత్విక్.
నర్సింగ్ మొదటి సినిమా విజయ నిర్మల దర్శక నిర్మాతగా వచ్చిన హేమాహేమీలు అనే చిత్రం. నటుడిగా అతనికి బ్రేక్ ఇచ్చింది దర్శకుడు రాం గోపాల్ వర్మ. ఆయన నర్సింగ్ యాదవ్ ఒకే కళాశాలలో చదువుకున్నారు. వర్మ దర్శకత్వంలో వచ్చిన క్షణక్షణంలో చిత్రంలో చెప్పుకోదగ్గ పాత్ర పోషించాడు. తర్వాత కొబ్బరి బోండాం సినిమాలో కూడా నర్సింగ్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. మాయలోడు, అల్లరి ప్రేమికుడు, ముఠామేస్త్రి, మాస్టర్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఇడియట్, గాయం, పోకిరి, యమదొంగ, జానీ, ఠాగూర్, శంకర్ దాదా ఎం. బి. బి. ఎస్ తదితర చిత్రాల్లో మంచి పాత్రలు పోషించాడు. చిరంజీవి తన సినిమాలు చాలా వాటిలో అవకాశం ఇచ్చాడు.[3]
మూత్రపిండాల వ్యాధి కారణంగా హైదరాబాదు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో నర్సింగ్ యాదవ్, కొంతకాలం చికిత్స పొందాడు. చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటు రావడంతో 2020, డిసెంబరు 31న మరణించాడు.[4][5][6]