నాబెందు ఘోష్ | |
---|---|
జననం | |
మరణం | 2007 డిసెంబరు 15 | (వయసు: 90)
ఇతర పేర్లు | ముకుల్; నాబెందు భూషణ్ ఘోష్ |
వృత్తి | దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు |
నబెందు ఘోష్ (1917, మార్చి 27 - 2007, డిసెంబరు 15) బెంగాలీ సాహిత్యకారుడు, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు. సుజాత, బాందిని, దేవదాస్, మజ్లి దీదీ, అభిమాన్, తీస్రీ కసమ్ వంటి క్లాసిక్ బాలీవుడ్ సినిమాలకు స్క్రీన్ ప్లేలు రాశాడు. బాప్ బేటీ, శత్రంజ్, రాజా జాని వంటి సినిమాలకు కథలు రాశాడు. దో బిఘా జమీన్, తీస్రీ కసమ్, లుకోచూరి సినిమాలలో నటించాడు. ఆ తర్వాత నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించాడు.
నాబెందు ఘోష్ 1917 మార్చి 27న బంగ్లాదేశ్‌లోని ఢాకా నగరంలో జన్మించాడు.
ఇతని భార్య కనక్లత 1999లో మరణించింది.[1] అతనికి ఇద్దరు కుమారులు (డాక్టర్ దీపాంకర్, సినీనిర్మాత శుభంకర్), ఒక కుమార్తె (రత్నోత్తమ సేన్‌గుప్తా: ఫిల్మ్ ఫెస్టివల్ క్యూరేటర్, రచయిత్రి, మాజీ ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ జర్నలిస్ట్) ఉన్నారు. ఇతని ఆత్మకథ, ఏక నౌకర్ జాత్రి 2008 మార్చిలో ప్రచురించబడింది.[2] ఇతని కోడలు డాక్టర్ సోమ ఘోష్ ప్రశంసలు పొందిన శాస్త్రీయ గాయకురాలు, 2016లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించబడింది.[3]
12 సంవత్సరాల వయస్సులో నాటకరంగంలో ప్రముఖ నటుడిగా ఎదిగాడు. ఉదయ్ శంకర్ శైలిలో ప్రశంసలు పొందిన నృత్యకారుడిగా, 1939-1945 మధ్య అనేక పతకాలను గెలుచుకున్నాడు. 1944లో భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమానికి వ్యతిరేకంగా దక్ దియే జై రాసినందుకు ఘోష్ ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఈ నవల అతనికి కీర్తిని తెచ్చిపెట్టింది. 1945లో కలకత్తాకు వెళ్ళాడు. బెంగాలీ సాహిత్యంలో అత్యంత ప్రగతిశీల యువ రచయితలలో స్థానం సంపాదించాడు.
విభజన తరువాత, ఉర్దూ తూర్పు పాకిస్తాన్ రాష్ట్ర భాషగా ప్రకటించబడింది; తద్వారా అన్ని బెంగాలీ సాహిత్యం, సినిమాలను నిషేధించారు. ఈ రాజకీయ విభజనే నాబెందు ఘోష్‌ను 1951లో కోల్‌కతాలోని నాటకరంగాన్ని విడిచిపెట్టి బాంబే టాకీస్ కోసం సినిమాలు చేయడానికి బిమల్ రాయ్‌లో చేరడానికి ప్రేరేపించింది. హృషికేశ్ ముఖర్జీ, అసిత్ సేన్, పాల్ మహేంద్ర, కమల్ బోస్, సలీల్ చౌదరి తదితరులతో పనిచేశాడు. బిమల్ రాయ్ మరణం తరువాత, ఘోష్ హృషికేశ్ ముఖర్జీతో కలిసి విస్తృతంగా పనిచేశాడు.[4]
నాబెందు ఘోష్ 1940ల నాటి అన్ని చారిత్రక తిరుగుబాట్లు - కరువు, అల్లర్లు, విభజన, ప్రేమపై రచనలు చేశాడు. దాదాపు 26 నవలలు, 14 చిన్న కథల సంకలనాలు ప్రచురించాడు. శారదిందు బందోపాధ్యాయ రాసిన మరు ఓ సంఘా అనే చిన్న కథ ఆధారంగా 1988లో తీసిన త్రిషాగ్ని సినిమాకు దర్శకత్వం వహించాడు.
నాబెందు ఘోష్ 2007, డిసెంబరు 15న పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో మరణించాడు.