నారమల్లి శివప్రసాద్ | |||
నారమల్లి శివప్రసాద్
| |||
పార్లమెంటు సభ్యుడు ఆంధ్రప్రదేశ్ మాజీ సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2014-2019 | |||
నియోజకవర్గం | చిత్తూరు | ||
---|---|---|---|
పదవీ కాలం 2009-2014 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పుట్లపల్లి, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్ | 1951 జూలై 11||
మరణం | 2019 సెప్టెంబరు 20 చెన్నై | (వయసు 68)||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం | ||
మతం | హిందూ మతము |
నారమల్లి శివప్రసాద్ (జూలై 11, 1951 - సెప్టెంబరు 20, 2019) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం నాయకుడు. 2009, 2014 లలో చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యాడు.
తిరుపతిలో డాక్టర్‌గా పనిచేసిన ఈయన నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశాడు. ఖైదీ లాంటి హిట్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఈయన 2006 సంవత్సరంలో విడుదలైన డేంజర్ సినిమాలో విలన్‌గా నటించాడు. ఈ సినిమాలో నటనకు ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చి సన్మానించింది. అనేక సినిమాల్లో ఈయన చిన్న పాత్రల్లో నటించాడు.పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వివాదం సాగినన్ని రోజులూ రోజుకో వేషంతో అందరినీ ఆకట్టుకున్నాడు.[1] కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన 2019 సెప్టెంబరు 21న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.[2][3]
శివప్రసాద్ సొంతూరు చిత్తూరు జిల్లాలోని పూటిపల్లి లో, నాగయ్య, చెంగమ్మ దంపతులకు 11 జూలై 1951న జన్మించాడు.
శివప్రసాద్ తిరుపతిలోని వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు.
శివప్రసాద్‌కి విజయలక్ష్మితో 26 ఫిబ్రవరి 1972 లో వివాహము జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు మాధవీలత, నీలిమ.
సాహిత్యం, కళలు, సినిమా నటన మొదలగునవి ఇతనికి ఇష్టమైన విషయాలు. చిన్నప్పటి నుంచి నాటకంపై ఉన్న ఆసక్తితో అనేక నాటకాల్లో నటించాడు. ఆ తర్వాత సినిమారంగానికి వచ్చి పలు చిత్రాలలో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించాడు. 2005 లో విడుదలైన దొంగ సినిమాలో నటనకు గాను ఇతనికి ఉత్తమ నటుడు అవార్డు లభించింది. ప్రేమ తపస్సు, టోపీ రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరో కో అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించాడు. 2006 సంవత్సరంలో విడుదలైన ‘డేంజర్’ సినిమాలో విలన్‌గా నటించాడు. ఈ సినిమాలో ఆయన నటనకు నంది అవార్డు అందుకున్నాడు.
చంద్రబాబు నాయుడు, శివప్రసాద్ బాల్యస్నేహితులు, చంద్రబాబునాయుడి పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరి, 1999లో సత్యవేడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. 1999-2001 మధ్య సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశాడు. చిత్తూరు పార్లమెంటు సీటు ఎస్సీ రిజర్వ్‌డ్ కావడంతో 2009, 2014లో చిత్తూరు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓడిపోయాడు.
కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, సెప్టెంబరు 21న మరణించాడు.[2]