నారాయణ తీర్థ

నారాయణ తీర్థ
జననంగోవింద శాస్త్రి
1650
మరణం1745
ఇతర పేర్లుగోవింద శాస్త్రి
వృత్తిరచయిత
ప్రసిద్ధి"కృష్ణ లీలా తరంగిణి" గ్రంథ రచయిత, కర్ణాటక సంగీత విద్వాంసులు
భార్య / భర్తరుక్మిణి
తండ్రిగంగాధరము
తల్లిపార్వతమ్మ

నారాయణ తీర్థులు (c. 1650 – 1745 CE) 17 వ శతాబ్దమునకు చెందిన ప్రసిద్ధ సంస్కృత రచయిత."కృష్ణ లీలా తరంగిణి" అను గొప్ప సంస్కృత గేయ నాటకమును రచించిన మహానుభావులు. ఈయన కర్ణాటక సంగీత విద్వాంసులు.

బాల్య విశేషాలు

[మార్చు]

నారాయణ తీర్థ యొక్క అసలు పేరు "గోవింద శాస్త్రి". వీరు తెలుగు స్మార్త బ్రాహ్మణ కుటుంబమునకు చెందినవారు. ఈయన గుంటూరు జిల్లా కాజ గ్రామములో గంగాధరము, పార్వతమ్మ దంపతులకు జన్మించారు.[1]. అతి చిన్న వయసులోనే సంగీతము, సంస్కృతము, శాస్త్రాలు అభ్యసించాడు. చిన్నవయసులోనే వివాహము జరిగింది. ఇతని పూర్వీకులు తొలుత ఆ విజయనగరంలో నుండిన పండిత వంశీకులు అనియు తరువాత తరలి తంజావూరు చేరినట్లు తెలియుచున్నది.

నారాయణ తీర్థ చిన్నతనమునుండే పూజలు, భగవన్నామస్మరణం చేస్తుండేవాడు. చిన్నతనము నుండి సంగీత, సాహిత్యము లందు కడు ఆసక్తి కలిగి భాగవతము మొదలగు గ్రంథములను పాడుచుండెడివారు. స్వామి శివానందతీర్థ పరిచయ భాగ్యముతో సన్యాస దీక్షాముఖముగా పయనించాడు. నారాయణ తీర్థ సంగీత సంస్కృత భాషాపరిజ్ఞానానికి శివానందతీర్థ మెరుగులు దిద్దాడు. భూపతి రాజపురములో స్థిర నివాసమేర్పరచుకొని "శ్రీ కృష్ణలీలాతరంగిణి" కావ్యము వ్రాశాడు. ఒక కావ్యానికి కావలిసిన మూడు ప్రధానాంశాలు పద్యము, గద్యము, వచనము కావ్యములో అతి చక్కగా చిత్రీకరించాడు. నాట్యానికి కావలిసిన జతులు, కృతులు పొందుపరచ బడ్డాయి. నృత్య సంగీత నాటకముగా యక్షగాన పద్ధతిలో వ్రాశాడు. మేళత్తూరు భాగవతులు ఈ నాటకాన్ని మేళా పద్ధతిలో ప్రదర్శించారు. ఈ రచన భాగవతమందు దశమ స్కందము యొక్క సారాంశం.

నారాయణ తీర్థ సంగీత కృతులే తరువాత అనేకమంది సంగీత విద్వాంసులకు స్ఫూర్తిదాయకమయ్యాయి. నారాయణ తీర్థ ప్రభావమువల్లే తాను ప్రహ్లాద భక్తి విజయము, నావికా చరితము వ్రాసినట్లు త్యాగరాజు చెప్పుకున్నాడు. నారాయణ తీర్థుల శిష్యుడు సిద్ధేంద్రయోగి. కూచిపూడి నృత్య సంప్రదాయానికి ఆద్యుడు.

సన్యాసాశ్రమం

[మార్చు]

నారాయణ తీర్థులు గృహస్తాశ్రమము నుండి సన్యాసాశ్రమమును స్వీకరించుటకు ఆయని జీవితము లోని ఒక ముఖ్య సంఘటన కారణమైనది. నారాయణ తీర్థుని అత్తవారి యిల్లి నది ఆవలి ఒడ్డున ఉంది. అందుచే నదిని దాటి అత్తవారింటికి వెళ్ళిచుండెడివారు. ఆ విధముగా వెళ్ళు సందర్భమున ఒకసారి మార్గ మధ్యమున నదీ ప్రవాహము హెచ్చుటచే తన జీవితముపై ఆశ వదులుకొని యజ్ఞోపవీతం తీసి పారవేసి సన్యాసాశ్రమమును స్వీకరించెను. అంతలో నదీ ప్రవాహము తగ్గుటచే అతడు ఆవలి గట్టుకు సురక్షితముగా చేరుకొనెను. తాను సన్యసించునట్లు ఇతరులకు తెలియదు కనుక దానిని గుప్తముగా ఉంచదలిచెను. కాని నారాయణ తీర్థుని భార్య అతనిని చూడగానే ఆమెకు ఒక దివ్య తేజస్సుతో విరజిల్లుతున్న ఒక మహానిభావుని వలె కనిపించెను. అంత దానిని బట్టి అక్కడ వారు ప్రశ్నింపగ నారాయణ తీర్థుడు ఆపసన్యాసము స్వీకరించిన విషయము తెలిపెను. అది మొదలు నారాయణ తీర్థులు శాస్త్రోక్తముగా సన్యాసాశ్రమమును స్వీకరించెను. అనంతరము కొన్ని పుణ్య స్థలములను దర్శించి ఆంధ్రప్రదేశ్ లోని చల్లపల్లి ముక్త్యాల సంస్థానములలో కొన్ని సంవత్సరములు గడిపెను. ముత్యాల సంస్థానములలోని నరసింహస్వామిపై కొన్ని రచనలు చేసెను.

భగవద్దర్శనము

[మార్చు]

నారాయణ తీర్థులు జీవితంలో మరియొక ప్రసిద్ధ సంఘటన ఉంది. నారాయణ తీర్థులు చాలాకాలము భరింపరాని కడుపునొప్పితో బాధపడుచుండెను. పుణ్యక్షేత్రములు దర్శించిన బాధ నివారణ అగునని తలంచి అతడు కావేరి అను పల్లెటూరిలో ఒక వినాయకుని గుడిలో విశ్రమించుచుండెను. అంత ఆ రాత్రి భగవంతుడు కలలో కనబడి మరుసటి ఉదయమున రెండు వరాహములు కనబడుననియు, వాని వెనుక బయలుదేరి అవి ఆగిన చోట విశ్రమించిన అతని కడుపునొప్పి పోవుననియు చెప్పెను. మరునాదు ఉదయము నారాయణ తీర్థులు దైవాజ్ఞ ప్రకారం ఆ వరాహముల వెంట అనుసరించగా "భూపతిరాజపురం" అనుచోట "వెంకటరమణస్వామి" దేవాలయము దగ్గర కొన్ని క్షణములు నిలిచి అదృశ్యమయ్యెను. అంత నారాయణ తీర్థులు దేవాలయమున ప్రవేశించినంతనే అతని కడుపు నొప్పి మాయమయ్యెనట.

వరాహపురం

[మార్చు]

నారాయణ తీర్థులు తన మిగిలిన కాలము అచ్చటనే గడిపెను. "కృష్ణ లీలా తరంగిణి" అనునది ఇచ్చటనే రచించెను. తరువాత ఆ ఊరునకు "వరాహపూర్" అనియు "వరాహపురం" అనియు పేరు వచ్చెను. నారాయణ తీర్థునకు భరత నాట్య శాస్త్ర మందును కూడా ప్రవేశముండుట వలన ఇచ్చట ఎందరో శిష్యులకు పారిజాతాపహరనం నృత్యనాటకముగా నేర్పెను. ఇతడు తెలుగులో పారిజాతాపహరణాన్ని యక్షగానం కూడా రచించినట్లు తెలియుచున్నది.

కృష్ణలీలా తరంగిణి

[మార్చు]

శ్రీ కృష్ణ గాథను సంస్కృతములో 12 సర్గలుగా రచించెను. ఈ గ్రంథమునే శ్రీ కృష్ణ లీలా తరంగిణి అంటారు. దీనిలో ప్రారంభమున మంగళాచరణము, తరువాత శ్లోకములు, ఇష్టదేవతా ప్రార్థనలు, తరంగములు ఉండును. ఈ తరంగములు పల్లవి అనుపల్లవి చరణములతో స్వనామ ముద్రను కలిగియుండును. కొన్ని తరంగములలో జతులు కూడా ఉండును. కృష్ణలీలా తరంగిణి ముగించిన తరువాత నారాయణ తీర్థులకు రుక్మిణి శ్రీకృష్ణుల దర్శనము కలిగెనని చెప్పుదురు.

కైవల్యం

[మార్చు]

నారాయణ తీర్థులు మాఘమాస శుక్ల అష్టమి దినమున తిరువయ్యారుకి 10 కి.మీ. దూరమున తిరుపూడి గ్రామములో జీవసమాధి అయినట్లు నానుడి. వీరి సమాధి వేంకటరమణస్వామి ఆలయమునకు సమీపమునను, వీరి ఛాయా చిత్రము ఆలయములోపలను నేటికిని ఉన్నాయి. వరాహపురిలో ప్రతి కృష్ణాష్టమికి శ్రీ కృష్ణలీలా తరంగిణిలోని తరంగములను గానము చేయుదురు. జయదేవుని వలె తన కావ్యమును మధురభక్తి ప్రధానముగా రచించిరి. నారాయణతీర్థులు జయదేవుని అంశ యని ప్రతీతి.

మూలాలు

[మార్చు]
  1. గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట 232

యితర లింకులు

[మార్చు]